Union Budget App And Website : ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. గతేడాది మాదిరిగా ఈసారీ పేపర్‌లెస్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నారు సీతారామన్. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివి వినిపించనున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అందులోని సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేందుకు యూనియన్ బడ్జెట్ అనే వెబ్‌సైట్‌తో పాటు, యాప్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా బడ్జెట్ ప్రతులను ఎలా చూడొచ్చు? అందులో ఏయే వివరాలు ఉంటాయి? అనే విషయాలు తెలుసుకుందాం.
ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత యాప్‌లో బడ్జెట్ పీడీఎఫ్ ప్రతులు విడుదల చేస్తారు. వాటితో పాటు మంత్రి పూర్తి బడ్జెట్ ప్రసంగం, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు సహా మొత్తం బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో బడ్జెట్ హైలైట్స్ పేరుతో సెక్షన్ ఉంటుంది. ఇందులో మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అందులోని ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటారు. మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత ప్రసంగానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు సైతం ఇందులో అందుబాటులో ఉంటాయి.