Apple Iphone 16 Launch :యాపిల్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16ను సంస్థ లాంఛ్ చేసింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా జరిగిన ఈవెంట్‌లో యాపిల్ పలు కొత్త ఉత్పత్తులను రిలీజ్ చేసింది. "ఇట్స్ గ్లోటైమ్" పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను విడుదల చేసింది. వరల్డ్ వైడ్‌గా టెక్ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఈ ఈవెంట్‌ను లైవ్‌లో చూశారు. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఈ ఉత్పత్తులకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు అనేక కొత్త ఫీచర్లతో వచ్చాయి. ఈ కొత్త మోడళ్లలో 'యాపిల్ ఇంటెలిజెన్స్' ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ సిరీస్‌లో కొత్తగా టచ్ సెన్సిటివ్ కెమెరాతో పాటు, యాక్షన్ బటన్ పొందుపర్చారు. కొత్త సిరీస్ ఫోన్లలో ఏ18 చిప్ అమర్చారు. న్యూరల్ ఇంజిన్‌తో కూడిన ఈ చిప్, రెండు రెట్లు వేగవంతంగా పనిచేస్తుందని సంస్థ పేర్కొంది. 17 శాతం ఎక్కువ బ్యాండ్ విడ్త్‌తో కూడిన అప్‌గ్రేడెడ్ మెమోరీ సబ్‌సిస్టమ్‌ను ఇది కలిగి ఉన్నట్లు యాపిల్ వెల్లడించింది.
ఐఫోన్ 16 సిరీస్ ప్రధాన ఫీచర్లు, ధరలు
ఫీచర్లు/ మోడల్ | ఐఫోన్ 16 | ఐఫోన్ 16 ప్లస్ | ఐఫోన్ 16 ప్రొ | ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ |
డిస్‌ప్లే | 6.10అంగుళాలు | 6.70అంగుళాలు | 6.3అంగుళాలు | 6.9అంగుళాలు |
ప్రాసెసర్ | యాపిల్ ఏ18 | యాపిల్ ఏ18 | యాప్రిల్ ఏ18 ప్రొ | యాప్రిల్ ఏ18 ప్రొ |
ప్రంట్ కెమెరా | 12MP | 12MP | 12MP | 12MP |
రేర్ కెమెరా | 48MP+12MP | 48MP+12MP | 48MP+48MP | 48MP+48MP |
RAM | 8GB | 8GB | 8GB | 8GB |
స్టోరీజీ | 128GB | 128GB | 128GB( బేస్ మోడల్) | 128GB( బేస్ మోడల్) |
ఓఎస్ | iOS 18 | iOS 18 | iOS 18 | iOS 18 |
రిసొల్యూషన్ | 1179x2556 పిక్సెల్స్ | 1290x796 పిక్సెల్స్ | - | - |
ధర | రూ.79,000 | రూ.89,000 | రూ.1,19,900 | రూ.1,44,900 |
బుకింగ్స్ ఓపెన్ అప్పటినుంచే!
సంస్థ కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అయిన యాపిల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫోన్‌లోని యాప్‌లను చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చని, వందలకొద్ది కొత్త యాక్షన్స్ చేపట్టవచ్చని యాపిల్ పేర్కొంది. వచ్చే నెలలో బీటా వెర్షన్‌లో ఇంగ్లీష్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. అనంతరం చైనీస్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషల్లో ఇది విడుదల కానుంది. అయితే భారతీయ భాషలకు సంబంధించి యాపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని యాపిల్ చెప్పినప్పటికీ, దానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. కాగా, సెప్టెంబర్ 13 నుంచి ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త మోడళ్లలో యాపిల్ మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ స్పీడ్‌ను 15 వాట్స్ నుంచి 25 వాట్స్‌కు పెంచింది.