Tax Savings With ELSS Investments : పెట్టుబడిపై మంచి రాబడితో పాటు లక్షల్లో ఆదాయపు పన్ను ఆదా ప్రయోజనాలను అందిస్తాయి ఈక్విటీ ఆధారిత పెట్టుబడి పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్). ఇవి ముఖ్యంగా ఈక్విటీ, ఆయా సంబంధిత మార్గాల్లో తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో 65 శాతం వరకు పెట్టుబడి పెడుతుంటాయి. ఈక్విటీలపై ప్రత్యేక దృష్టి ఉండటం వల్ల దీర్ఘకాలిక వృద్ధికి ఎక్కవ అవకాశాలుంటాయి. ఈ ఫండ్లు మంచి లాభాలను ఆర్జిస్తుంటాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లుగా వీటిని పేర్కొంటారు. ఈక్విటీ పెట్టుబడుల ద్వారా ఇన్వెస్టర్లకు మూలధన వృద్ధిని అందించడమే వీటి ప్రాథమిక లక్ష్యం.
ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల లాగా కాకుండా ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను ఈ ఈఎల్‌ఎస్‌ఎస్‌లు అందిస్తాయి. పన్ను భారాన్ని తగ్గించుకుంటూనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంలో అధికంగా సంపాదించేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. 2023 డిసెంబరు నాటికి చూసుకుంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌ల పథకాల నుంచి వచ్చిన ఏడాది రాబడి దాదాపు 18.8 శాతం వరకు ఉంది. మూడేళ్ల సగటు రాబడి దాదాపు 20 శాతం వరకు నమోదైంది. క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్) ద్వారా ఈ పథకాల్లో మూడేళ్లలో 17.5 శాతం, అయిదేళ్లలో 19.2 శాతం వరకు రాబడి అందించాయి.
రూ.1.50 లక్షల వరకు పన్ను ఆదా
ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. 30 శాతం పన్ను చెల్లించే శ్లాబులో ఉన్న వారికి వీటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపు రూ. 46,800 వరకు పన్ను భారం తగ్గుతుంది. అయితే ఈఎల్‌ఎస్‌ఎస్‌లను తప్పనిసరిగా మూడేళ్ల వరకు కొనసాగించాలి. అంటే మూడేళ్లు పూర్తయ్యేదాకా పెట్టుబడులను ఉపసంహరించుకోలేరు. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇతర పన్ను ఆదా పథకాలతో పోలిస్తే ఈఎల్‌ఎస్‌ఎస్‌లు అధిక రాబడులను అందించిన సందర్భాలు ఉన్నాయి.
ప్రయోజనాలు-
అధిక రాబడికి అవకాశం:ఈఎల్‌ఎస్‌ఎస్‌లు విభిన్న షేర్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. ఫండ్ మేనేజర్లు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్‌లలో పెట్టుబడి పెట్టేందుకు వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా నష్టభయం అనేది కూడా తగ్గుతుంది. అధిక రాబడి పెరిగేందుకూ అవకాశం ఉంటుంది. వీటిని ఈక్విటీ మార్కెట్లలో అనుభవం ఉన్న వారే నిర్వహిస్తుంటారు. ఎంతో పరిశోధనతో పెట్టుబడులను ఎంచుకుంటారు. అలానే దీర్ఘకాలంలో సందపను సృష్టించాలి అనుకునే వారికి ఈ పథకాలు అనువుగా ఉంటాయని చెప్పొచ్చు. పదవీ విరమణ ప్రణాళిక, పిల్లల ఉన్నత చదువులు, ఇతర అవసరాలకు ఇవి ఉపయోగపడతాయి. ఈక్విటీ మార్కెట్‌ల దీర్ఘకాలిక వృద్ధి, పన్ను ప్రయోజనాలు రెండూ పెట్టబడిదారులకు కలిసొచ్చే అంశాలు.
చిన్న మొత్తాల్లో పెట్టుబడి
ఒకేసారి పెద్ద మొత్తంతోనే కాకుండా, చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టేందుకు వీలుటుంది. పాత శాబ్లులో పన్ను కడుతున్న వారు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి భారాన్ని తగ్గించుకునేందుకు ప్లాన్స్ చేసుకోవచ్చు.