Income Tax Changes From October 1st, 2024 : ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్. అక్టోబర్ 1 నుంచి పలు ఆదాయ పన్ను మార్పులు అమలులోకి రానున్నాయి. కేంద్ర బడ్జెట్ 2024లో ప్రతిపాదించి, తరువాత ఫైనాన్స్ బిల్లులో ఆమోదించిన విధంగా ఆధార్ కార్డ్, ఎస్టీటీ, టీడీఎస్ రేటు, డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్‌లలో ఈ మార్పులు ఉంటాయి. అందుకే ఈ ఆక్టోబర్ 1న అమల్లోకి వచ్చే ఈ పన్ను మార్పులు గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆధార్ :పాన్ దుర్వినియోగాన్ని, అలాగే నకిలీ పాన్లను నిరోధించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా అక్టోబర్ 1 తరువాత ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు, అలాగే కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కచ్చితంగా ఆధార్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఆధార్ నంబర్ లేకపోతే, ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని ఇచ్చినా సరిపోయేది. ఇకపై అలా కుదురదు.
షేర్స్ బై-బ్యాక్ :డివిడెండ్ల మాదిరిగానే అక్టోబర్ 1 నుంచి షేర్ల బై-బ్యాక్ ద్వారా ఆదాయం పొందుతున్నవారిపై పన్నులు విధిస్తారు. అయితే షేర్ హోల్డర్ల స్థాయిని బట్టి ఈ పన్నులు ఉండనున్నాయి. అంటే అక్టోబర్ 1 నుంచి పెట్టుబడిదారులపై అధిక పన్నుల భారం పడనుంది. అంతేకాదు ఇకపై మూలధన లాభాలను లేదా నష్టాలను లెక్కించేటప్పుడు, షేర్ల కొనుగోలు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024 :సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఆదాయ పన్ను వివాదాలను పరిష్కరించేందుకు కొత్తగా 'డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్, 2024'ను ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచే ఈ పథకం అమలు కానుంది.
ఈ కొత్త స్కీమ్ ద్వారా గతంలో కంటే, చాలా తక్కువ సెటిల్మెంట్ అమౌంట్‌తో వివాదాలు పరిష్కరించుకోవచ్చు. అంతేకాదు 2024 డిసెంబర్ 31లోపు పన్ను చెల్లించేవారి నుంచి చాలా తక్కువ సెటిల్మెంట్ అమౌంట్ తీసుకుంటారు. ఒక వేళ ఈ గడువులోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది.
ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ టీడీఎస్ :2024 బడ్జెట్లో చెప్పిన విధంగా, ఈ అక్టోబర్ 1 నుంచి ఫ్లోటింగ్ రేట్ బాండ్లు సహా, కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లపై 10% రేటుతో మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) ఉంటుంది. అయితే ఒక ఏడాది మొత్తంలో వచ్చే ఆదాయం రూ.10,000 కంటే తక్కువగా ఉంటే, ఎలాంటి టీడీఎస్ ఉండదు.
టీడీఎస్ రేట్స్ :2024 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన టీడీఎస్ రేట్లను, ఆర్థిక బిల్లులో ఆమోదించారు. 194డీఏ, 194హెచ్, 194-ఐబీ, 194ఎమ్ సెక్షన్ల కింద టీడీఎస్ రేటును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. అంతేకాదు ఈ-కామర్స్ ఆపరేటర్లకు టీడీఎస్ రేటును 1 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గించారు.
- సెక్షన్ 194డీఏ - జీవిత బీమా పాలసీలకు సంబంధించిన చెల్లింపులు
- సెక్షన్ 164జీ - లాటరీ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన కమీషన్
- సెక్షన్ 194హెచ్ - కమీషన్ లేదా బ్రోకరేజ్ చెల్లింపు
- సెక్షన్ 194ఐబీ - కొందరు నిర్దిష్ట వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్)లు చేసే అద్దె చెల్లింపులు
- సెక్షన్ 194ఎమ్ - కొందరు నిర్దిష్ట వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్)లు చేసే నిర్దిష్ట మొత్తాల చెల్లింపులు
- సెక్షన్ 194ఎఫ్ - మ్యూచువల్ ఫండ్స్ లేదా యూటీఐ ద్వారా యూనిట్లు రీపర్చేస్ చేస్తే, అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ తొలగించాలని ఓ ప్రతిపాదన ఉంది.
సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ (STT) :2024 బడ్జెట్లో, సెక్యూరిటీస్ ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌పై లావాదేవీల పన్ను (ఎస్టీటీ)ను వరుసగా 0.02%, 0.1%కు పెంచారు. అలాగే షేర్ బైబ్యాక్ ద్వారా ఆదాయం పొందిన వారిపై ట్యాక్స్ విధిస్తామని స్పష్టం చేశారు. ఈ రెండూ ఈ అక్టోబర్ 1న అమల్లోకి రానున్నాయి.