Stocks Closing Today :రిలయన్స్, బ్లూ చిప్ స్టాక్స్ కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త చరిత్రను సృష్టించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ మొట్టమొదటిసారి 79వేల మార్క్‌ను చేరుకుంది. నిఫ్టీ తొలిసారి 24వేల మార్క్‌ను అధిగమించింది.
జీవనకాల గరిష్ఠాన్ని తాకిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ గురువారం 568 పాయింట్లు లాభపడి 79,243 వద్ద లైఫ్ టైమ్ హై రికార్డ్‌ను నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 175 పాయింట్లు వృద్ధి చెంది 24,044 వద్ద జీవన కాల గరిష్ఠాలను టచ్ చేసింది.
లాభపడిన స్టాక్స్ : అల్ట్రా సెమ్ కో, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంకు, టీసీఎస్, మహీంద్ర అండ్ మహీంద్ర, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్ర, రిలయన్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, టైటాన్, బజాజ్ ఫైనాన్స్
నష్టపోయిన షేర్స్ : హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐఎన్, మారుతి, సన్ ఫార్మా
లాభాలకు అదే కారణం!
బ్యాంకింగ్, టెలికాం సహా ఇతర రంగాల్లో ప్రాథమికంగా బలంగా ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ర్యాలీ వల్లే మార్కెట్లు రాణిస్తున్నాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. స్వల్ప కాలంలో మార్కెట్లలో బుల్లిష్ సెంటిమెంట్ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం వరకు ర్యాలీకి దూరంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం గురువారం సూచీల పరుగుకు తోడైనట్లు పేర్కొన్నారు. త్వరలో సెన్సెక్స్ 80,000 మార్క్‌ను తాకే అవకాశం ఉందని అంచనా వేశారు.
నష్టాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ , షాంఘై నష్టాల్లో ముగిశాయి.అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు 0.20 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.08 డాలర్లుగా ఉంది.