Stock Market Close :శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం 2 శాతానికి పైగా లాభపడి ఆల్‌టైమ్ హై లెవల్స్ వద్ద ముగిశాయి. ఆర్బీఐ 2024-25 ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచడమే ఇందుకు కారణం.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 1720 పాయింట్లు లాభపడి జీవనకాల గరిష్ఠాలను తాకింది. చివరికి సెన్సెక్స్ 1618 పాయింట్లు లాభపడి 76,693 వద్ద ఆల్‌టైమ్ హైరికార్డ్ వద్ద స్థిరపడింది. నిఫ్టీ 468 పాయింట్లు వృద్ధిచెంది 23,290 వద్ద జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిసింది.
లాభపడిన స్టాక్స్ : ఎం అండ్ ఎం, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టైటాన్
కారణం ఇదే!
అందరూ ఊహించినట్లుగానే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంది. పైగా ప్రస్తుతానికి భారతదేశంలో ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా ఉంది. ఇవన్నీ మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగానే స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో దూసుకుపోయాయి. దాదాపు అన్ని రంగాలు కూడా లాభపడ్డాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, రియాల్టీ, ఆటోస్టాక్ భారీ లాభాలను మూటగట్టుకున్నాయి.
వాస్తవానికి గత రెండు రోజులుగా బీఎస్ఈ ఏకంగా 2,995 పాయింట్లు (4.15 శాతం) మేర లాభపడింది. దీనితోపాటు ఇవాళ బీఎస్ఈ సెన్సెక్స్‌లోని కంపెనీలు అన్నీ లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, టెక్ మహీంద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్ టాటా స్టీల్, ఇన్ఫోసిస్ కంపెనీలు బాగా రాణించాయి.