Stock Market Close Today November 5, 2024 :మంగళవారం తీవ్ర ఒడుదొడులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్ రాణించడమే ఇందుకు కారణం. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది.
చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 79,476 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 217 పాయింట్లు వృద్ధి చెంది 24,213 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సెర్వ్, టాటా మోటార్స్, మారుతి సుజుకి
- నష్టపోయిన షేర్లు : అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టైటాన్, హిందుస్థాన్ యూనిలివర్, సన్‌ఫార్మా, రిలయన్స్
ఒడుదొడుకలకు కారణాలివే!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం సహా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్ల ప్రకటించనున్న నేపథ్యంలో చాలా మంది మదుపరులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఇది కొంత వరకు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. అయితే మార్కెట్ క్రాష్ తరువాత స్టాక్స్‌ను తగ్గిన ధరల వద్ద కొనేందుకు మదుపరులు మొగ్గు చూపడం వల్ల మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి.