Short Term FD Vs Long Term FD : ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి చాలా సురక్షితమైనవి. వీటివల్ల ఖాతాదారులకు మంచి వడ్డీ రావడంతో పాటు, వారి డబ్బుకు రక్షణ లభిస్తుంది. అందుకే మన దేశంలో వీటికి ఆదరణ ఎక్కువ. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ల కాలపరిమితి కొన్ని రోజుల నుంచి మెుదలుకొని కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఎక్కువ కాలానికి చేసే ఎఫ్డీలపై అధిక శాతం వడ్డీ వస్తుంది. స్వల్ప కాలానికి చేసే ఎఫ్డీలపై తక్కువ వడ్డీ వస్తుంది. అయితే ఆర్థిక అత్యవసరం ఏర్పడినప్పుడు షార్ట్ టర్మ్ ఎఫ్‌డీల నుంచి డబ్బులు తీసుకోవడానికి వీలవుతుంది. కానీ లాంగ్ టర్మ్ ఎఫ్‌డీల నుంచి సొమ్ము తీసుకోలేము. అందుకే మన ఆర్థిక అవసరాలు తీరేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత కాలానికి చేయాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అవసరాలకు అనుగుణంగా
మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు మీ ఆర్థిక అవసరాలను ఒకసారి అంచనా వేసుకోవాలి. ఒకవేళ మీకు సమీప భవిష్యత్‌లోనే డబ్బు అవసరం ఉంటే, షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఇప్పట్లో డబ్బు అవసరం లేదు అనుకుంటే లాంగ్ టర్మ్ ఎఫ్డీలు చేయాలి. ఎందుకంటే దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు అధిక వడ్డీని చెల్లిస్తాయి.
వడ్డీ రేట్లు
సాధారణంగా ఎఫ్డీలపై అందించే వడ్డీ రేట్లు కాలపరిమితిని అనుసరించి మారుతూ ఉంటాయి. అలాగే వివిధ బ్యాంకుల్లో వివిధ రకాలైన వడ్డీ రేట్లు ఉంటాయి. కనుక ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏ బ్యాంకులు అధికంగా వడ్డీ ఇస్తున్నాయో చూసుకొని, వాటిలో ఎఫ్డీ చేయటం మంచిది.
పన్ను మినహాయింపులు
ఎఫ్‌డీల వచ్చే వడ్డీపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. కనుక మీకు వచ్చే రాబడి తగ్గుతుంది. అందుకే మీ పాలసీ కాలవ్యవధి ఆధారంగా ట్యాక్స్ ఎంత కట్ అవుతుందో ముందే తెలుసుకోండి. లేదా టాక్స్-సేవర్ ఎఫ్‌డీల్లో పొదుపు చేయండి.