తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోకు రూ.3వేల కోట్ల ప్రాఫిట్- 5% తగ్గిన రిలయన్స్‌ లాభం - Q1 Results 2024 - Q1 RESULTS 2024

Reliance Q1 Results 2024 : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభంలో 5 శాతం క్షీణత నమోదైనట్లు వెల్లడించింది. మరోవైపు, రిలయన్స్‌కు చెందిన టెలికాం విభాగం జియో లాభంలో 12 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Reliance Q1 Results 2024
Reliance Q1 Results 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 10:11 PM IST

Reliance Q1 Results 2024 : అపరకుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో 5 శాతం క్షీణత నమోదైనట్లు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.16,011 కోట్లుగా ఉన్న ఏకీకృత నికర లాభం ఈ ఏడాది రూ.15,138 కోట్లకు తగ్గినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. రిఫైనింగ్‌ మార్జిన్లు తగ్గడం, తరుగుల ఖర్చులు పెరగడమే లాభాల్లో క్షీణతకు ప్రధాన కారణంగా తెలిపింది. గత త్రైమాసికంతో పోల్చినప్పుడు నికర లాభం (రూ.18,951 కోట్లు) 20 శాతం మేర క్షీణించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.2.10 లక్షల కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.2.36 కోట్లకు పెరిగింది.

జియో లాభంలో 12 శాతం వృద్ధి
Jio Q1 Results 2024 : మరోవైపు, రిలయన్స్‌కు చెందిన టెలికాం విభాగం జియో లాభంలో 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతి ద్వారా రూ.5,445 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.26,478 కోట్లకు పెరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం 13 కోట్ల మంది జియో 5జీ సేవలను వినియోగిస్తున్నారని కంపెనీ తెలిపింది.

విప్రో లాభం రూ.3003 కోట్లు
Wipro Q1 Results 2024 : అంతకుముందు ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో త్రైమాసిక ఫలితాలను కూడా ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 3003.2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,870 కోట్లతో పోలిస్తే నికర లాభంలో 4.6 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం మాత్రం 3.8 శాతం క్షీణించి రూ.21,963.8 కోట్లుగా నమోదైంది. గతేడాది ఈ మొత్తం రూ.22,831 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో 2,600 మిలియన్‌ డాలర్ల నుంచి 2,652 మిలియన్‌ డాలర్ల మేర ఆదాయం సమకూరొచ్చని విప్రో అంచనా వేసింది. స్థిర ధరల ప్రాతిపదికన -1.0% నుంచి +1.0% ఉండొచ్చంటూ భవిష్యత్‌ అంచనాల్లో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details