తెలంగాణ

telangana

ETV Bharat / business

అంబానీ మాస్టర్ ప్లాన్​ - త్వరలోనే రూ.55వేల కోట్ల జియో ఐపీఓ! - Reliance Jio IPO

Reliance Jio IPO : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ జియోను పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇష్యూ ద్వారా ఏకంగా రూ.55,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 7:38 AM IST

Reliance Jio heading for an IPO?
Reliance Jio IPO (ANI)

Reliance Jio IPO : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ జియోను పబ్లిక్‌ ఇష్యూ (IPO)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇష్యూ ద్వారా ఏకంగా రూ.55,000 కోట్లు సమీకరించేందుకు అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలుస్తుంది. ఇప్పటి వరకు రూ.21,000 కోట్లు సమీకరించిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) ఐపీఓనే అతిపెద్దదిగా ఉంది.

టారిఫ్‌ పెంపు అందుకేనా : రిలయన్స్‌ జియో ఇటీవలే మొబైల్‌ టారిఫ్‌లను భారీగా పెంచింది. ఇప్పటి వరకు 4జీ టారిఫ్‌లతోనే 5జీ సేవలు అందిస్తున్న జియో, ఇకపై 5జీకి ప్రత్యేకంగా టారిఫ్​ నిర్ణయించే అవకాశం ఉంది. ఇవన్నీ ఈ టెలికాం సేవల సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు ముందు కనిపించే సంకేతాలుగా భావించవచ్చని ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది. బహుశా వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ రావొచ్చన్న విశ్లేషకుల అంచనాను ఆ పత్రిక ఉటంకించింది.

ఆగస్టులో తెలిసే అవకాశం : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సాధారణంగా ఏటా ఆగస్టు నెలలో వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్‌) నిర్వహిస్తుంటుంది. కనుక జియో ఐపీఓ గురించి సంస్థ అధిపతి ముకేశ్‌ అంబానీ ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ‘టారిఫ్‌ పెంపు, 5జీ వ్యాపారంతో వచ్చే నగదుతో జియో సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) బాగా పెరుగుతుంది. రానున్న త్రైమాసికాల్లో మదుపర్లకు ఇది అత్యంత ఆకర్షణీయ అంశంగా మారవచ్చు' అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ విలువ :తాజా టారిఫ్‌ పెంపు, 5జీ నగదీకరణ ప్రతిపాదన నేపథ్యంలో, జియో విలువ 133 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.11.11 లక్షల కోట్లు) వరకు ఉండవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్‌ అంచనా వేసింది. పెద్ద కంపెనీలు తమ విలువలో కనీసం 5 శాతాన్ని, చిన్న కంపెనీలైతే కనీసం 10 శాతానికి సమానమైన వాటాను ఐపీఓ ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. జియో విలువ దృష్ట్యా, కేవలం 5% వాటాయే రూ.55,000 కోట్లు ఉంటుంది. ఇంతటి భారీ మొత్తం నిధులను సమీకరిస్తే కనుక, జియో ఐపీఓ ఇండియాలోనే అతిపెద్ద ఐపీఓ నిలుస్తుందని జెఫ్రీస్‌ అంచనా వేస్తోంది.

పీఈ సంస్థలు బయటకు వెళ్లొచ్చు :ఈ ఐపీఓ వస్తే, అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) కంపెనీలు జియోలో ఉన్న తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు దాదాపు 67.03% వాటా ఉంది. మిగతా 32.97 శాతంలో 17.72 శాతాన్ని మెటా, గూగుల్‌ కంపెనీలు కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ పీఈ సంస్థలైన విస్టా ఈక్విటీ పార్టనర్స్, కేకేఆర్, పీఐఎఫ్, సిల్వర్‌ లేక్, ఎల్‌ కాటర్టన్, జనరల్‌ అట్లాంటిక్, టీపీజీలకు 15.25% వరకు వాటా ఉంది. 2020లో ఈ అంతర్జాతీయ పెట్టుబడిదార్ల నుంచి జియో ప్లాట్‌ఫామ్స్‌ రూ.1.52 లక్షల కోట్లను సమీకరించిన విషయం తెలిసిందే!

సైబర్​ దాడుల నుంచి సురక్షితంగా ఉండాలా? ఈ టాప్​-6 టిప్స్ మీ కోసమే! - How To Protect From Cyber Crime

ప్రతి చిన్న అవసరానికి క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మీ 'సిబిల్ స్కోర్'​పై పడే ఎఫెక్ట్ ఇదే! - How Does Loans Affect Credit Score

ABOUT THE AUTHOR

...view details