తెలంగాణ

telangana

ETV Bharat / business

పేటీఎం వాలెట్ల సంగతేంటి? సౌండ్​ బాక్స్​లు, QR కోడ్​లు పని చేస్తాయా? RBI సమాధానాలివే!

RBI Releases Paytm FAQs : పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్​బీఐ విధించిన ఆంక్షలు మరో 15 రోజల గడువును పొడగించింది. అయితే నిర్దేశిత గడువు లోపే అకౌంట్​లో ఉన్న నగదు విత్​డ్రా చేసుకోవాలా? ఆ తర్వాత వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇలా చాలా రకాల అనుమానాలు ఉన్నాయా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

RBI Releases Paytm FAQs
RBI Releases Paytm FAQs

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 7:40 AM IST

RBI Releases Paytm FAQs : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​పై ఆంక్షలు విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 29 వరకు గడువును మార్చి 15 వరకు పొడగించింది. అయితే ఆర్​బీఐ ఈ ఆంక్షలు విధించినప్పటి నుంచి వినియోగదారుల్లో అనేక రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్​, క్యూఆర్ కోడ్​లు, సౌండ్ బాక్స్​ల గురించి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. దీంతో ఆర్​బీఐ వినియోగదారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

నగదు విత్‌డ్రా: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న నగదును 2024 మార్చి 15 తర్వాత కూడాఅకౌంట్​ ఖాళీ అయ్యే వరకు ఉపయోగించుకోవచ్చు. అలాగే, పేమెంట్స్‌ బ్యాంక్‌ జారీ చేసిన డెబిట్‌ కార్డు ద్వారా నగదును విత్‌ డ్రా చేసుకోవచ్చు. కానీ, మార్చి 15 తర్వాత పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాలో నగదు డిపాజిట్‌ చేయడానికి లేదు. వడ్డీ, క్యాష్‌బ్యాక్స్‌, పార్ట్‌నర్‌ బ్యాంక్స్‌ నుంచి స్వీప్‌-ఇన్‌, రిఫండ్లు మాత్రమే అనుమతిస్తారు.

వేతన ఖాతా:
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్‌ ఉంటే మార్చి 15 తర్వాత నుంచి నగదును అందుకోలేరు. భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మార్చి 15లోగా వేరే బ్యాంక్ అకౌంట్​కు మార్చుకునే ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్​బీఐ సూచించింది.

సబ్సిడీ:
ప్రభుత్వం నుంచి ఆధార్‌తో అనుసంధానం అయి ఉన్న నగదు బదిలీ గానీ, సబ్సిడీ గానీ వస్తుంటే అలాంటివారు కూడా నిర్దేశిత గడువులోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

ఆటో డెబిట్‌:
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో నగదు ఉన్నంతవరకు ఆటో డెబిట్‌ (NACH)కు అవకాశం ఉంటుంది. గడువు తర్వాత నగదు పూర్తయితే ఆటో డెబిట్‌కు అవకాశం ఉండదు. అందుకే మార్చి 15లోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌:
పేటీఎం పేమెంట్‌ బ్యాంక్స్‌తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఉంటే మార్చి 15 తర్వాత అకౌంట్​లో ఉన్న నగదు పూర్తయ్యేంత వరకు మాత్రమే రెన్యువల్‌కు అవకాశం ఉంటుంది.

వాలెట్‌:
మార్చి 15 తర్వాత పేటీఎం వాలెట్‌లో బ్యాలెన్స్‌ ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాష్‌బ్యాక్‌, రిఫండ్లు మినహా ఇతరుల నుంచి కూడా నగదును పొందలేరు. కావాలంటే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ వాలెట్‌ క్లోజ్‌ చేసి ఆ నగదును ఇతర బ్యాంకులకు పంపించుకోవచ్చు.

ఫాస్టాగ్‌ :
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ జారీ చేసిన ఫాస్టాగ్‌లను మార్చి 15 తర్వాత అందులో బ్యాలెన్స్‌ ఉన్నంత వరకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ తర్వాత నుంచి రీఛార్జి చేయడానికి వీలులేదు. అందుకే వేరే బ్యాంక్‌ నుంచి ఫాస్టాగ్‌ తీసుకోవడం మంచిది. ఫాస్టాగ్‌లో నగదును బదిలీ చేయడం కుదరదు. కొత్త ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే. లేదంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను సంప్రదించి రిఫండ్‌ కోరొచ్చు.

NCMC (నేషనల్‌ కామన్‌ మొబిలీటీ కార్డ్) : పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ జారీ చేసిన నేషనల్‌ కామన్‌ మొబిలీటీ కార్డుదారులు సైతం మార్చి 15 తర్వాత అందులోని బ్యాలెన్స్‌ పూర్తయ్యే వరకు వినియోగించుకోవచ్చు. భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇతర బ్యాంకులు జారీ చేసే ఈ తరహా కార్డులను తీసుకోవచ్చు. అయితే ఇందులో ఉన్న నగదును వేరే కార్డుకు బదిలీ చేయడం కుదరదు. కావాలంటే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను రిఫండ్‌ తీసుకునేందుకు అవకాశం ఉంది.

యూపీఐ (UPI) :
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు అనుసంధానం అయిఉన్న యూపీఐ/IMPS ఖాతాలకు మార్చి 15 తర్వాత నగదు పంపలేరు. ఆ సమయంలో అందులో ఉన్న నగదును యూపీఐ/IMPS ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు.

క్యూఆర్‌ కోడ్‌లు, పేటీఎం సౌండ్‌ బాక్స్‌లు : పేటీఎం క్యూఆర్‌ కోడ్‌లు, పేటీఎం సౌండ్‌ బాక్స్‌లు లేదా పీఓఎస్‌ టర్మినల్స్‌ వినియోగిస్తున్న మర్చంట్స్‌ ఇతర బ్యాంకులతో అనుసంధానం అయి ఉంటే వాటిని మార్చి 15 తర్వాత కూడా యథాతథంగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ వాటికి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ అనుసంధానం అయ్యి ఉంటే అందులో ఎలాంటి నిధులూ జమ కావు. అందుకే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ కాకుండా వేరే బ్యాంక్‌ ఖాతాను వాటికి అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 15 తర్వాత కూడా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఉన్న ఫండ్స్‌ను భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌కు బదిలీ చేసుకోవచ్చు.

పేటీఎం యూజర్లకు ఊరట- అప్పటి వరకు కార్డులు, ఫాస్టాగ్​లు పనిచేస్తాయ్​

పేటీఎం షేర్లు 9 శాతానికిపైగా పతనం- కంపెనీ గట్టెక్కేనా? యూజర్ల సంగతేంటి?

ABOUT THE AUTHOR

...view details