RBI Monetary Policy Meeting 2024 :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా పదోసారి కీలకవడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. సోమవారం నుంచి 3 రోజులు సాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు.
2023 ఫిబ్రవరి తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఒక్కసారి కూడా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. గత నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బెంచ్మార్క్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. అభివృద్ధి చెందిన మరికొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు కూడా అదే బాటలో పయనించాయి. కానీ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.
కీలక అంశాలు
- అధిక వర్షపాతం నమోదు, సరిపడా నిల్వలు ఉండటం వల్ల ఈ ఏడాది చివరి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది.
- 2024-2025లో జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.2 శాతం. 2012-13 తర్వాత జీడీపీలో పెట్టుబడి వాటా గరిష్ఠ స్థాయికి చేరింది.
- సెప్టెంబరులో ఉన్న అనుకూల పరిస్థితుల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరగొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5శాతంగా ఉండే అవకాశం.
- తయారీ ఖర్చులు తగ్గడం, ప్రభుత్వ విధానాలు, దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ తదితర కారణాలతో తయారీ రంగం వృద్ధి చెందుతోంది.
- ఆర్థిక రంగం స్థిరంగా ఉంది. బ్యాంకుల కార్యకలాపాలు బలంగా ఉన్నాయి.
- యూపీఐ లైట్ వాలెట్ పరిమితి రూ.2,000 నుంచి రూ.5,000 పెంపు.
- యూపీఐ 123పే ఒక్కో లావాదేవీ పరిమితి రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంపు.
మదుపర్లలో జోష్
ద్రవ్యపరపతి విధాన రూపకల్పన వ్యూహాన్ని న్యూట్రల్కు మార్చుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసిన ప్రకటన మదుపర్లలో ఉత్సాహం నింపింది. భవిష్యత్లో వడ్డీ రేట్లు తగ్గిస్తామన్న సంకేతాలు ఇస్తూ శక్తికాంత దాస్ చేసిన ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 82వేల మార్కుకు చేరుకుంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ 600 పాయింట్లకుపైగా లాభంతో 82వేల 290 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 200 పాయింట్లకుపైగా పెరిగి 25వేల 225 వద్ద కొనసాగుతోంది.