Ratan Tata Career Journey :ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన పారిశ్రామికవేత్త రతన్ టాటా. అయినా ఏనాడూ కుబేరులతో కలిసి కనిపించేవారు కాదు. ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాల్లోని 100 దేశాల్లో టాటా గ్రూపునకు చెందిన 30 కంపెనీలకు ఆయన నేతృత్వం వహించారు. అయినా అత్యంత సాధారణ జీవితం గడిపారు. జేఆర్‌డీ టాటా నుంచి ఘనమైన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన, టాటా గ్రూపును ఉన్నత శిఖరాలకు చేర్చారు. కార్పొరేట్ టైటాన్‌గా అత్యంత గౌరవ జీవితాన్ని గడిపారు.
విద్యాభ్యాసం
రతన్ టాటా 1937 డిసెంబరు 28వ తేదీన నావల్ టాటా, సోనూలకు జన్మించారు. 8వ తరగతి వరకు ముంబయిలోని కాంపియన్ పాఠశాలలో ఆయన చదివారు. ఆ తరువాత కేథడ్రల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో కొంత కాలం, శిమ్లాలోని బిషప్ కాటన్ పాఠశాలలో కొంత కాలం చదివారు. 1955లో న్యూయార్క్‌లోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆ తరువాత కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆ తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చేరి అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేశారు.
రతన్ టాటా 1962లో టాటా స్టీల్‌లో చేరడం ద్వారా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తొమ్మిదేళ్ల తర్వాత నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్‌కు డైరెక్టర్-ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 1977లో సంక్షోభంలో ఉన్న టాటా గ్రూపునకు చెందిన ఎంప్రెస్ మిల్స్‌కు మారారు. టాటా గ్రూప్‌లోని ఇతర ఉన్నతాధికారులు ఆయన ప్రణాళికను అంగీకరించకపోవడంతో అది మూతపడింది.
1991లో టాటా సన్స్ ఛైర్మన్‌గా జేఆర్‌డీ టాటా వైదొలగారు. అదే సమయంలో తన వారసుడిగా రతన్ టాటాను ప్రకటించారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా సంస్థను చాలా గొప్పగా విస్తరించారు. పేదవాడి కారైన టాటా నానోతోపాటు టాటా ఇండికా కార్లను మార్కెట్‌కు పరిచయం చేశారు. 2012 డిసెంబరు 28న తన 75వ పుట్టిన రోజునాడు టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి రతన్ టాటా స్వచ్ఛందంగా వైదొలగారు. సైరస్ మిస్త్రీని సంస్థకు ఛైర్మన్ చేశారు.
టాటా గ్రూప్ విస్తరణ
21 ఏళ్లపాటు ఛైర్మన్‌గా పని చేసిన రతన్ టాటా, తన హయాంలో టాటా గ్రూప్‌ను చాలా గొప్పగా విస్తరించారు. ఆయన హయాంలో గ్రూప్ ఆదాయం 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. అయితే 2016 అక్టోబరు 24వ తేదీన సైరస్ మిస్త్రీని తొలగించి, మళ్లీ రతన్ టాటా - టాటా గ్రూప్‌నకు తాత్కాలిక ఛైర్మన్ అయ్యారు. 2017 జనవరి 12వ తేదీన నటరాజన్ చంద్రశేఖరన్‌ను గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్ ఛైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి రతన్ టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత కూడా రతన్ టాటా వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన వ్యక్తిగత హోదాలో 30 అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. అందులో ఓలా ఎలక్ట్రిక్, పేటీఎం, స్నాప్‌డీల్, లెన్స్‌కార్ట్, జివామే వంటివి ఉన్నాయి.
- దేశంలో ఆర్థిక సంస్కరణల సమయంలో టాటా గ్రూపును రతన్ టాటా పునర్వ్యవస్థీకరించారు. అదే సమయంలో స్థానికంగా రూపొందించిన టాటా నానో, ఇండికా కార్లను విడుదల చేసి ఓ సంచలనం సృష్టించారు. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూ తీసుకొచ్చారు.
- అంతర్జాతీయంగానూ టాటా గ్రూపును విస్తరించడంలో రతన్ టాటా కృషి ఎనలేనిది. ఆంగ్లో-డచ్ స్టీల్ కంపెనీ కోరస్‌ను ఆయన టేకోవర్ చేశారు. బ్రిటిష్ వాహన దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కూడా కొనుగోలు చేశారు. బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీనీ కొన్నారు.
- 1991లో 5.7 బిలియన్ డాలర్లుగా ఉన్న టాటా గ్రూపు సంపదను 2016 నాటికి 103 బిలియన్ డాలర్లకు చేర్చడంలో రతన్ టాటా కృషి ఎనలేనిది. తన 25 లిస్టెడ్ కంపెనీల ద్వారా టాటా గ్రూప్ 2024లో రూ.85,510 కోట్ల లాభాలను ఆర్జించింది.
పెళ్లి ఊసెత్తలేదు!
అత్యంత నిరాడంబరంగా జీవించిన రతన్ టాటా ఓ దశలో ఒక అమ్మాయి ప్రేమించారు. కానీ అది సఫలం కాకపోవడంతో వివాహం చేసుకోకుండానే జీవితాన్ని గడిపారు. ముంబయిలోని అత్యంత చిన్న ఇంట్లో ఆయన నివసించేవారు. తన టాటా సెడాన్ కారును ఆయనే నడిపేవారు. రతన్ టాటా ఎక్కువగా ప్రైవసీని ఇష్టపడేవారు. మీడియా ప్రచారానికి దూరంగా ఉండేవారు. తనతోపాటు పుస్తకాలను, సీడీలను, పెంపుడు కుక్కలను ఉంచుకునేవారు.
సేవాగుణంలో రతన్ టాటా మరెవ్వరూ సాటిరారు అంటే అది అతిశయోక్తి ఏమాత్రం కాదు. 1970లలోనే ఆయన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆగాఖాన్ ఆసుపత్రి, వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు. 1991లో ఆయన టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక, టాటా గ్రూప్ సేవా కార్యక్రమాలు కొత్త రూపును సంతరించుకున్నాయి. టాటా ట్రస్టులను మరింతగా విస్తరించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ను స్థాపించారు. విద్యా రంగానికి కూడా ఆయన ఎనలేవి సేవలందించారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్- పిల్లులు, కుక్కల కోసం భారీ ఆస్పత్రి- ప్రత్యేకతలు ఇవే!