తెలంగాణ

telangana

ETV Bharat / business

భావితరాలకు స్ఫూర్తి ప్రదాత 'రతన్ టాటా'

Ratan Tata Biography : ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన పారిశ్రామికవేత్తలో రతన్ టాటా ఒకరు. అయిన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు గొప్ప మానవతావాది కూడా. ఆ స్ఫూర్తిప్రదాత జీవన ప్రస్థానం ఎలా కొనసాగిందంటే?

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Ratan Tata
Ratan Tata (ANI)

Ratan Tata Biography : వందకు పైగా దేశాలు, 30కిపైగా కంపెనీలు! లక్షల కోట్లు విలువైన పెట్టుబడులు! ఇవీ మూడు ముక్కల్లో టాటా గ్రూప్ సామ్రాజ్యం విశిష్టతలు. దీని వెనకున్న విలక్షణ వ్యాపార వేత్త రతన్ టాటా! జేఆర్​డీ టాటా నుంచి ఘనమైన వారసత్వాన్ని అందిపుచ్చుకుని, తనదైన వ్యూహాత్మక ప్రణాళికలతో టాటా గ్రూప్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చిన మేరునగధీరుడాయన! భారతదేశానికే కాదు ప్రపంచానికే పారిశ్రామిక దిక్సూచి ఆయన. అయినప్పటికీ నిరాడంబర జీవితాన్ని గడిపిన గొప్ప మానవతామూర్తి రతన్‌ టాటా!

వ్యాపార విలువలే ఆస్తిగా, అసమాన మానవతామూర్తిగా ఎనలేని కీర్తి గఢించిన రతన్‌ టాటా 1937 డిసెంబరు 28న నావల్‌ టాటా, సోనూలకు ముంబయిలో జన్మించారు. ఎనిమిదో తరగతి వరకూ స్థానికంగా ఉన్న కాంపియన్‌ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత కేథడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ పాఠశాలలో చదువు కొనసాగించారు. ఉన్నత చదువుల కోసం 1955లో అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌లోని రివర్‌డేల్‌ కంట్రీ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశారు. లాస్‌ఏంజల్స్‌లోని కార్నెల్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నారు. ఆ తరువాత హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చేరి అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశారు.

నిరాడంబర జీవితమే ఇష్టం!
సంపన్న కుటుంబంలో పుట్టినా అమెరికాలో సామాన్య జీవితం గడిపారు రతన్‌ టాటా. కొంత కాలం లాస్‌ ఏంజల్స్‌లోని జోన్స్‌ అండ్‌ ఎమెన్స్‌లో పనిచేశారు. ప్రముఖ కంప్యూటర్ సంస్థ ఐబీఎంలో ఉద్యోగం వచ్చినా చేరలేదు. తన తాత జేఈర్​డీ టాటా సలహా మేరకు భారత్ వచ్చేశారు. అప్పటికే రతన్ తండ్రి నావల్‌ - టాటా గ్రూప్‌ డిప్యూట్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. కానీ రతన్‌ టాటా అట్టడుగు స్థాయి నుంచే టాటా గ్రూప్‌లోకి ప్రవేశించారు. 1962లో జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్‌ ఫ్యాక్టరీ ఉత్పత్తి విభాగంలో సాధారణ ఉద్యోగిగా చేరారు. అలా 9 ఏళ్లపాటు స్టీల్‌ ఫ్యాక్టరీలోని వివిధ విభాగాల్లో నలిగిన రతన్‌ టాటాకు, 1971లో తొలిసారి నాయకత్వ సవాల్‌ ఎదురైంది. నష్టాల్లో ఉన్న నేషనల్‌ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్‌-నెల్కో డైరక్టర్‌గా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. దాన్ని లాభాల్లోకి తేవడానికి ఆయన సర్వశక్తులూ ఒడ్డారు. అప్పటికే నెల్కోలో ఉన్న సీనియర్ల అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల వ్యాపారాన్ని విస్తృతం చేసి తన వ్యాపార దీక్షాదక్షతను చాటుకున్నారు. మనవడి కార్యదక్షతకు అబ్బురపడిన జేఆర్​డీ టాటా 1977లో నష్టాల్లో నడుస్తున్న ఎంప్రెస్‌ మిల్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను రతన్​కు అప్పగించారు. 1991లో టాటా ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌గా వైదొలిగిన జేఆర్​డీ టాటా మనవడైన రతన్‌ టాటా చేతికి వ్యాపార సామ్రాజాన్ని అప్పగించారు.

వ్యాపార సామ్రాజ్య విస్తరణ
టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రతన్‌ టాటా సంస్థను భారీగా విస్తరించారు. దేశంలో ఆర్థిక సంస్కరణల సమయంలో గ్రూపును రతన్‌ టాటా పునర్వ్యవస్థీకరించారు. క్యాపిటల్‌ మార్కెట్‌కు ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునే వ్యూహాత్మక ప్రణాళికలు వేశారు. గ్రూప్‌నకు అప్పటిదాకా పరిచయంలేని కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. టెలీకమ్యూనికేషన్స్​, బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సేవా రంగాల్లోకి అడుగు పెట్టారు. భవిష్యత్‌ వ్యాపారాన్ని ముందే పసిగట్టగల నేర్పున్న రతన్‌ టాటా, వివిధ రంగాల్లో కంపెనీలు ప్రారంభించారు. అది టాటాగ్రూప్‌ ప్రస్థానాన్నే పూర్తిగా మార్చేసింది. 2004లో పబ్లిక్‌ ఇష్యూకి తెచ్చిన టీసీఎస్​ దేశ, విదేశాల్లో సేవలందించే సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా రాణిస్తోంది.

బిజినెస్ టేకోవర్స్​
అంతర్జాతీయంగానూ టాటా గ్రూపును విస్తరించడంలో రతన్ టాటా ఎనలేని కృషి చేశారు. ఆంగ్లో-డచ్‌ స్టీల్‌ కంపెనీ కోరస్‌ను టేకోవర్‌ చేశారు. బ్రిటిష్‌ వాహన దిగ్గజం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ను కూడా కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని విలాసవంతమైన కార్ల తయారీకి బ్రాండ్‌గా మార్చేశారు. టాటా మోటార్స్‌ రూపొందించిన టాటా ఇండికా కార్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌లో పెద్ద చరిత్రనే సృష్టించింది. సంపన్నులే కాదు, సామాన్యులు కూడా కార్లో ఎందుకు వెళ్లకూడదనే ప్రశ్నకు సమాధానమే నానో కార్‌. కేవలం లక్ష రూపాయలకే కారు అందిస్తామని రతన్ టాటా ప్రకటించగానే, ఆయన్ను అందరూ వ్యతిరేకించారు. కానీ అన్నమాట ప్రకారం నానో కారును మార్కెట్‌లోకి తెచ్చి, పేదవాడి చేతికి కారు స్టీరింగ్‌ అప్పగించారు రతన్ టాటా. ఇక రతన్ టాటా టోకేవర్ చేసిన మరో బ్రిటిష్‌ టీ కంపెనీ టెట్లీ కూడా మార్కెట్‌లో అగ్రగామిగా నిలిచిపోయింది. ఇక అంకుర సంస్థల్ని ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. వ్యక్తిగత హోదాలో ఓలా ఎలక్ట్రిక్, పేటీఎం, స్నాప్‌డీల్, లెన్స్‌కార్ట్, జివామే వంటి 30 అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు రతన్​.

రక్షణ, విమానయాన రంగంలోనూ
రక్షణ,విమానయాన రంగంలో టాటా గ్రూప్‌ దేశంలో అగ్రగామిగా వెలుగొందడంలోనూ రతన్‌ టాటా ఎనలేని కృషిచేశారు. విమానయాన రంగంలో విడిభాగాల తయారీలో టాటా సంస్థ ప్రపంచ సరఫరాదారుగా ఎదగడంలో రతన్‌ ముఖ్యపాత్ర పోషించారు. రక్షణ ఉత్పత్తులకు సంబంధించి రక్షణ మంత్రిత్వశాఖకు నమ్మకమైన భాగస్వామిగా టాటా డిఫెన్స్‌ను తీర్చిదిద్దారు. ప్రధాని మోదీ ఇచ్చిన భారత్‌లో తయారీ నినాదాన్ని గట్టిగా సమర్థించిన రతన్‌ టాటా యుద్ధవిమానాలు, హెలికాఫ్టర్లు, రవాణా విమానాలు, ఆయుధ వ్యవస్థలు, మానవ రహిత వ్యవస్థల తయారీని టాటా గ్రూప్‌ నుంచి పెద్దఎత్తున చేపట్టారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏరోఇంజిన్‌, విడిభాగాల తయారీ యూనిట్లను నెలకొల్పారు. లక్షల కోట్లు విలువైన సంస్థగా 'టాటా ఏ అండ్‌ డీ'ని తీర్చిదిద్దారు. మరోవైపు టాటాలకు సొంత విమానయాన సంస్థ ఉండాలన్న చిరకాల కోరికను సైతం రతన్‌ టాటా సాకారం చేశారు. తమచేతి నుంచి చేజారిన ఎయిరిండియాను ఇటీవల తిరిగి ఆయన సొంతం చేసుకున్నారు.

కొత్త తరానికి ప్రోత్సాహం
కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే రతన్ టాటా తొలిసారి టాటా కుటుంబంలో కాకుండా బయటి వ్యక్తికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. 2012 డిసెంబరు 28న తన 75వ పుట్టిన రోజునాడు టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగారు. తన వారసుడిగా సైరస్ మిస్త్రీని ప్రకటించారు. అయితే మిస్త్రీపై పలు ఆరోపణలు రావడం వల్ల 2016 అక్టోబరు 24న మిస్త్రీని తొలగించి మళ్లీ రతన్‌ - టాటా గ్రూప్‌ తాత్కాలిక ఛైర్మన్‌ అయ్యారు. 2017 జనవరి 12న నటరాజన్‌ చంద్రశేఖరన్‌ను టాటాసన్స్‌ ఛైర్మన్‌గా నియమించారు. పదవీ విరమణ తర్వాత కూడా రతన్‌ టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతూ, కంపెనీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.

నేషన ఫస్ట్​
రతన్‌ టాటా ఆ జన్మాంతం 'దేశమే ముందు' అనే సిద్ధాంతాన్ని ఆచరించారు. దేశ పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ ముందుండేవారు. అత్యంత నిరాడంబర జీవితాన్ని ఆయన గడిపారు. ముంబయిలోని చిన్న ఇంట్లో నివసించారు.పెళ్లికూడా చేసుకోలేదు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమలో పడిన రతన్‌ టాటా పెళ్లి మాత్రం చేసుకోలేకపోయారు. రతన్‌ ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు ఆ సమయంలో భారత్-చైనా యుద్ధం జరుగుతోందంటూ ఆమెను భారత్‌ పంపేందుకు నిరాకరించారు. దీనితో ఆయన జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. టాటా గ్రూప్‌ బాధ్యతల్లో నిమగ్నమయ్యాక ఇక ఆయన పెళ్లి గురించి ఆలోచించలేదు. టాటా గ్రూప్‌ విస్తరణకే తన జీవితాన్ని అంకితం చేశారు. పారిశ్రామిక మేరు నగధీరుడుగా చెప్పుకునే రతన్ టాటాను కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌, 2008లో పద్మవిభూషణ్‌తో ఘనంగా సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నవరత్న బిరుదు ఇచ్చింది. లెక్కలేనన్ని దేశ, విదేశీ విద్యాలయాలు, సంస్థలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు అందించి, తమ గౌరవాన్ని పెంచుకున్నాయి.

దయామయుడు - మూగజీవాల కోసం భారీ ఆసుపత్రి నిర్మించిన రతన్​ టాటా

జంషెడ్​జీ నుంచి మాయ వరకు - టాటా ఫ్యామిలీ చేసిన వ్యాపారాలివే! - TATAs Business Journey

ABOUT THE AUTHOR

...view details