PM Svanidhi Scheme Benefits : కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండా రూ.10,000 రుణం అందిస్తోంది.
పీఎం స్వనిధి బెనిఫిట్స్
ఈ పీఎం స్వనిధి స్కీమ్ కింద లోన్ తీసుకున్నవారు నిర్ణీత సమయంలోనే రుణాన్ని తిరిగి చెల్లిస్తే, వారికి అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వడ్డీ రేటులో 7% వరకు సబ్సిడీ లభిస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా పేమెంట్స్ చేస్తే, ఏడాదిలో రూ.1200 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంటే వడ్డీ రాయితీ, క్యాష్‌బ్యాక్ రెండూ కలిపి చూస్తే, ఏకంగా రూ.1602 వరకు ఆదా అవుతుంది. సకాలంలో రుణాలు తీర్చిన వారికి, మరలా రుణం పొందేందుకు అర్హత లభిస్తుంది. అప్పుడు రెండోసారి రూ.20 వేల వరకు రుణం తీసుకోవచ్చు.
చేయూత
కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం ఈ పీఎం స్వనిధి స్కీమ్‌ను తీసుకువచ్చింది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అందిస్తోంది. కనుక అర్హత కలిగిన వారు ఈ స్కీమ్ కింద రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. అందుకుగాను ఎలాంటి స్థిరచరాస్తులు తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. మొదటిసారిగా అప్లై చేసినవారికి రూ.10 వేలు రుణం అందిస్తారు. అయితే ఒక ఏడాదిలోగా ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
రుణార్హతలు
వీధి వ్యాపారులు మాత్రమే ఈ స్కీమ్ కింద రుణం పొందడానికి అర్హులు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, గుడ్లు అమ్మేవారు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు నడిపేవారు, బార్బర్ షాప్ నిర్వహించే వారందరూ ఈ వీధివ్యాపారుల కేటగిరీ కిందకే వస్తారు.