తెలంగాణ

telangana

ETV Bharat / business

పేటీఎం సంక్షోభం - PPBLతో ఒప్పందాలు రద్దు చేసుకున్న మాతృసంస్థ - PPBL terminates contracts

Paytm Crisis : సంక్షోభంలో ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ లిమిటెడ్​తో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యునికేషన్ అన్ని అంతర్గత ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య పరస్పర అంగీకారం కుదిరినట్లు తెలిపింది.

Paytm PPBL terminate agreements
Paytm crisis

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 11:55 AM IST

Paytm Crisis :ఆర్​బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​తో చేసుకున్న అంతర్గత ఒప్పందాలు అన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు ఫిన్​టెక్​ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్​97 కమ్యునికేషన్ తెలిపింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య పరస్పర అంగీకారం కుదిరినట్లు శుక్రవారం పేటీఎం ప్రకటించింది. అయితే సదరు ఒప్పందాలు ఏంటనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ పార్ట్-టైమ్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదా నుంచి విజయ్​ శేఖర్ శర్మ వైదొలిగారు. ​ఇది జరిగిన కొన్ని రోజులకే తాజా పరిణామం చోటుచేసుకుంది. పీపీబీఎల్​లో విజయ్ శేఖర్​ శర్మకు 51% వరకు వాటాలు ఉన్నాయి. మిగతావి వన్​97 కమ్యునికేషన్స్​ కంపెనీ చేతిలో ఉన్నాయి.

ఇకపై స్వతంత్రంగా
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ స్వతంత్రంగా తన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం మాతృసంస్థ వన్​97 కమ్యునికేషన్ తెలిపింది.

తమ ఖాతాదారులకు, వ్యాపారులకు నిరంతర సేవలు అందించడం కోసం, పలు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు ఇటీవలే పేటీఎం ప్రకటించింది. అంతేకాదు పేటీఎం యాప్​, క్యూఆర్​, సౌండ్​బాక్స్​, కార్డ్ మెషీన్స్ అన్నీ యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం తెలిపింది.

ఆర్​బీఐ ఆంక్షలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​పై ఆంక్షలు విధించింది. మార్చి 15 తర్వాత ఖాతాదారుల నుంచి డిపాజిట్లను స్వీకరించవద్దని ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులకు టాప్​అప్​ చేయకూడదు, క్రెడిట్ లావాదేవీలు కూడా బంద్ చేయాలని స్పష్టం చేసింది. మొదటిగా దీని కోసం ఫిబ్రవరి 29 వరకు గడువు విధించింది. తర్వాత దాన్ని మార్చి 15 వరకు పొడిగించింది. ఫలితంగా పేటీఎం మాతృసంస్థ వన్​97 కమ్యునికేషన్​ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి.

త్వరలోనే కొత్త ఛైర్మన్​!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ పార్ట్-టైమ్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదా నుంచి విజయ్​ శేఖర్ శర్మ వైదొలిగిన నేపథ్యంలో, కొత్త ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పీపీబీఎల్ ప్రారంభించనుంది. ఇప్పటికే పీపీబీఎల్‌ బోర్డు డైరెక్టర్లుగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్‌ శ్రీనివాసన్‌ శ్రీధర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దేవేంద్రనాథ్‌ సారంగి, మాజీ ఐఏఎస్‌ రజినీ సెఖ్రీ సిబల్‌ నియమితులయ్యారు. వీరు నూతన ఛైర్మన్​ను ఎంపిక చేయనున్నారు.

అదరగొట్టిన భారత్​- Q3లో జీడీపీ వృద్ధి 8.4శాతం- దేశ ఆర్థిక శక్తికి నిదర్శనమన్న మోదీ

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే?

ABOUT THE AUTHOR

...view details