New IT Law Explainer : 'నూతన ఆదాయపు పన్ను బిల్లు' కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర బడ్జెట్ సెషన్‌లో భాగంగా త్వరలోనే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తదుపరిగా ఈ బిల్లును ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతారు. ఈ విషయాన్ని ఇటీవలే పార్లమెంటు వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వెల్లడించారు. మొత్తం మీద ఆరు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం-1961' స్థానాన్ని 'నూతన ఆదాయపు పన్ను బిల్లు' భర్తీ చేయబోతోంది. కొంతమంది ఇందులో కొత్త రకం పన్నుల ప్రస్తావన ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి అలాంటివేం కొత్తగా చేర్చరు. ప్రస్తుతం అమల్లో ఉన్న 'ఆదాయపు పన్ను చట్టం-1961'లోని అంశాలనే స్పష్టంగా, సంక్షిప్తంగా, సరళమైన భాషలో, పునరావృతాలు లేకుండా రాయించారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సరళీకరించిన ఈ అంశాలే 'నూతన ఆదాయపు పన్ను బిల్లు'లో ఉంటాయి.
దీర్ఘ వాక్యాలకు చెల్లు
ఈ బిల్లులో ఆదాయపు పన్నుకు సంబంధించిన ఒక్కో అంశానికి విభిన్న నిబంధనలు/షరతులు, వివరణలు ఉండవని ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. దీర్ఘ వాక్యాలు ఉండవన్నారు. ఏదో ఒక మార్గం మంచిది లేదా ఉత్తమమైందని పన్ను చెల్లింపుదారులకు సూచించేలా రాతలు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. తటస్థంగా(న్యూట్రల్) రచనా శైలి ఉంటుందని తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. 'నూతన ఆదాయపు పన్ను బిల్లు'లో సామాన్య ప్రజల కోసం ఏముంది? అనే అంశాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
- ప్రశ్న : ఆదాయపు పన్ను (ఐటీ) చట్టంపై సమీక్ష ఎందుకు అవసరం?
జవాబు: ఆదాయపు పన్ను చట్టం దాదాపు 60 సంవత్సరాల క్రితం 1961లో అమల్లోకి వచ్చింది. నాటి నుంచి నేటివరకు భారతీయ సమాజంలో ప్రజలు డబ్బు సంపాదించే విధానంలో, కంపెనీలు వ్యాపారం చేసే విధానంలో చాలా మార్పులు జరిగాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కేవలం రెండున్నర దశాబ్దాల తర్వాత 'ఆదాయపు పన్ను చట్టం-1961' అమల్లోకి వచ్చింది. ఆనాటి ప్రజలు, కంపెనీల అవసరాలకు అనుగుణంగా అది ఉండేది. అందుకే కాలక్రమంలో ఆదాయపు పన్ను చట్టంలోని పలు నిబంధనలకు కేంద్రంలోని ప్రభుత్వాలు సవరణలు చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో, ప్రజల జీవితాల్లో సాంకేతికతకు ప్రాధాన్యత పెరిగింది. ప్రజలు పన్నులు చెల్లించే, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే విధానాలు మారాయి. బ్యాంకులు/కంపెనీలు/ఫారెక్స్ డీలర్లు/రియల్ ఎస్టేట్ సంస్థలు ఇచ్చిన టీడీఎస్ స్టేట్‌మెంట్లు వంటి వాటి ఆధారంగా ముందస్తుగా ఆదాయపు పన్ను శాఖకు ఐటీఆర్‌లను సమర్పించే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక పురోగతి, దేశంలోని సామాజిక, ఆర్థిక నిర్మాణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఆదాయపు పన్ను చట్టంలో వందలాది సవరణలు చేశారు. వాటన్నింటిని పక్కన పెట్టి, ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల వివరాలను సరళంగా వివరిస్తూ నూతన ఆదాయపు పన్ను బిల్లు ఉంది. ఇప్పుడు ఐటీ చట్టంలో చాలా విభాగాలు, ఉప విభాగాలు, నిబంధనలు ఉన్నాయి. వాటిని కనీసం చదవడం కూడా కష్టతరంగా ఉంది. ఈ సమస్య నూతన ఆదాయపు పన్ను బిల్లులో ఉండబోదు.
- ప్రశ్న : కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ఏమిటి ?
జవాబు : ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961ను ఆరు నెలల్లోగా సమగ్రంగా సమీక్షిస్తామని తొలిసారిగా 2024 జులై 23న బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, చదవడానికి యోగ్యంగా, సులభంగా అర్థం చేసుకునేలా మార్చడమే ఈ సమీక్ష ఉద్దేశమని ఆమె తెలిపారు. ఈ మార్పుల వల్ల ఐటీ చట్టంతో ముడిపడిన న్యాయపరమైన వివాదాలు, వ్యాజ్యాలు తగ్గుతాయన్నారు. 2025 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రసంగం చేస్తూ ఈ అంశాన్ని నిర్మల మరోసారి ప్రస్తావించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నూతన ఆదాయపు పన్ను బిల్లున పార్లమెంటులో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
- ప్రశ్న : నూతన ఆదాయపు పన్ను చట్టంలో ఏం ప్రతిపాదించారు ?