Namita Thapar Vs Infosys Narayana Murthy : భారతదేశం ఆర్థికంగా ముందడుగు వేయాలంటే, యువతీ యువకులు వారానికి 70 గంటలపాటు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో నిమితా థాపర్ తీవ్రంగా ఖండించారు. ఎక్కువ గంటలు పని చేస్తే లాభాలు సంపాదించేది యజమానులే కానీ, ఉద్యోగులు కాదని ఆమె కుండ బద్దలు కొట్టారు. కనుక టన్నుల కొద్దీ డబ్బులు సంపాదించే యజమానులు - కావాలంటే ఎక్కువ గంటలు పని చేయవచ్చని, కానీ ఉద్యోగులపై ఆ భారం మోపకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.
హీట్ డిబేట్
భారతదేశ పని సంస్కృతి గురించి, వారానికి 70 గంటలపాటు పని చేయాలనే ఆలోచన గురించి ఇటీవల - ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో నిమితా థాపర్, షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ మధ్య ఓ టీవీ సిరీస్‌లో పెద్ద డిబేట్ జరిగింది. పనికి, జీవితానికి మధ్య సమతుల్యత గురించి, దేశాభివృద్ధికి అవసరమైన ఉత్పాదకను పెంచడం గురించి వీరి మధ్య ఘాటైన చర్చ జరిగింది.
కష్టపడి పనిచేయాల్సిందే!
అనుపమ్ మిట్టల్ మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చేసిన ప్రతిపాదనలను సమర్థించారు. జీవితంలో ఏది సాధించాలన్నా కచ్చితంగా కష్టపడి పనిచేయాలని, పని గంటలను లెక్కలోకి తీసుకోకూడదని పేర్కొన్నారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు రోజుకు 16 గంటలు చొప్పున పనిచేశానని చెప్పారు. యువత కనుక పని గంటలను లెక్కించుకుంటే, జీవితంలో గొప్ప విజయాలేమీ సాధించలేరని అభిప్రాయపడ్డారు. ఏది సాధించాలన్నా గొప్ప అంకితభావం, కృషి ఉండాలని ఆయన సూచించారు.
తమ కంపెనీ (షాదీ.కామ్) హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పని చేసి గొప్ప విజయం సాధించిన అంశాన్ని అనుపమ్ మిట్టల్ గుర్తుచేశారు. పని-జీవితం మధ్య సమతౌల్యం అనే కాన్సెప్ట్ ప్రస్తుత యువతరాన్ని పూర్తిగా నాశనం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. విజయం, పోరాటం రెండూ ఒకదానితో మరొకటి కలిసి ఉంటాయన్నారు. కనుక యువత తమ లక్ష్య సాధన కోసం కెరీర్ ప్రారంభం నుంచే చాలా కష్టపడి పని చేయాలని సూచించారు.