తెలంగాణ

telangana

ETV Bharat / business

37 లక్షల మందికి అంబానీ దీపావళి గిఫ్ట్​- ప్రతి ఒక్కరికీ 'డబుల్​' బోనస్​

రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు గుడ్‌న్యూస్- బోనస్ షేర్ల జారీకి ఆమోదం- రికార్డ్ తేదీ ప్రకటించిన కంపెనీ

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Reliance Bonus Share Record Date :దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తమ వాటాదారులకు అదిరే శుభవార్త అందించింది. ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోనస్ షేర్ల రికార్డ్ తేదీని ప్రకటించింది. దీపావళి కానుకగా రెండు రోజుల ముందే 1:1 రేషియోలో బోనస్ షేర్లు అందించనుంది. మొత్తం 37 లక్షల మంది షేర్‌హోల్డర్‌లకు లాభం చేకూరనుంది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది!

బోనస్ షేర్లను జారీ చేసే నిర్ణయాన్ని ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 5న జరిగిన బోర్డు సమావేశంలో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం లభించింది. తాజాగా ఈ బోనస్ షేర్ల జారీకి సంబంధించి రికార్డ్ తేదీని 2024 అక్టోబర్ 28గా కంపెనీ నిర్ణయించింది.

అంటే రికార్డ్ తేదీ నాటికి తమ డీమ్యాట్ ఖాతాలో 1 ఈక్విటీ షేరును కలిగి ఉన్న వారికి మరో ఈక్విటీ షేరు బోనస్ రూపంలో ఉచితంగా లభించనుంది. 100 షేర్లు ఉన్న వారికి మరో 100 షేర్లు ఉచితంగా లభిస్తాయి. ఈ బోనస్ షేర్ల జారీ కోసం రూ.6766.23 కోట్లు ఖర్చు చేయనుంది. బోనస్ షేర్ల జారీకి రికార్డ్ తేదీ ప్రకటించిన క్రమంలో ప్రముఖ బ్రోకరేజీ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుకు బై రేటింగ్ ఇచ్చాయి. అలాగే కొత్త టార్గెట్ ప్రైస్ కూడా చేశాయి. ఈ కంపెనీ షేరుకు రూ.3265 కొత్త టార్గెట్ ప్రైస్​గా సూచించాయి.

రిలయన్స్ క్యూ2 ఫలితాలు ఇలా!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం 5 శాతం క్షీణించింది. ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రో కెమికల్‌ వ్యాపారం ఆశించిన మేర రాణించకపోవడం లాభంలో క్షీణతకు కారణం. సమీక్షా త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.16,653 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో రూ.17,394 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.2.38 లక్షల కోట్ల నుంచి రూ.2.4 లక్షల కోట్లకు పెరిగినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

టెలికాం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్‌ ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 23.4 శాతం వృద్ధితో రూ.6539 కోట్లుగా నమోదైంది. యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం నెలకు రూ.181.7 నుంచి రూ.195.1కి పెరిగింది. మొత్తం ఆదాయం రూ.37,119 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం 14.8 కోట్ల మంది 5జీ సబ్‌స్క్రైబర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపార విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ నికర లాభం రూ.2800 కోట్ల నుంచి 1.3 శాతం వృద్ధితో రూ.2,836 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 3.5 శాతం క్షీణించి రూ.66,502కోట్లుగా నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details