Life Insurance Claim Settlement Process : జీవితం అనూహ్యమైంది. ఎప్పుడు ఏమి జరగుతుందో తెలియని పరిస్థితి. ఇలా ఊహించని ఘటనలు జరిగినప్పడు కుటుంబాన్ని రక్షించుకోవడానికి చాలా మంది బీమా పాలసీలను కొనుగోలు చేస్తారు. పాలసీదారుడు మరణించినప్పుడు, అతని కుటుంబానికి లేదా నామినీలకు పరిహారం అందుతుంది. అయితే, జీవిత బీమా క్లెయిం సెటిల్‌మెంట్ అనేది బీమా కంపెనీ తన వినియోగదారులకు అందించే అత్యంత ముఖ్యమైన సేవలలో కీలకమైంది. వినియోగదారుల క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత బీమా కంపెనీలకు ఉంటుంది. జీవిత బీమాయే కాకుండా ఏ బీమా విషయంలోనైనా పాలసీని కొనుగోలు చేసే ముందు, అధిక క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో ఉన్న బీమా సంస్థను ఎంచుకోవడం మంచిది.
క్లెయిం ఎలా చేసుకోవాలి
ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే, నామినీ జీవిత బీమాకు సంబంధించిన అన్ని పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించాలి. అప్పుడు హామీ మొత్తం నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ బీమా సంస్థ క్లెయిం మొత్తాన్ని పరిష్కరించలేకపోతే, అందుకు గల కారణాలను రాతపూర్వకంగా పాలసీదారులకు/నామినీలకు తెలియజేస్తుంది.
పాలసీదారుడు మరణిస్తే, ఆ విషయాన్ని వీలైనంత త్వరగా బీమా సంస్థకు తెలియజేయాలి. తరువాత పరిహారం కోసం, నామినీగా ఉన్న వ్యక్తి జీవిత బీమా సంస్థ సమీప బ్రాంచ్‌ను సందర్శించి క్లెయిల్ ఫారాన్ని తీసుకోవాలి. లేదా సదరు బీమా సంస్థ వెబ్సైట్లో క్లెయిం ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నామినీ క్లెయిమ్ దరఖాస్తులో పాలసీ నంబర్, పాలసీదారుని పేరు, మరణించిన తేదీ, స్థలం, లబ్దిదారుడి పేరు మొదలైన వివరాలను నమోదు చేయాలి. అలాగే పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా దాఖలు చేయాలి. ఒక వేళ పాలసీదారుడి మరణం పోలీసుల విచారణలో ఉన్నట్లయితే, దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్, అధికారులు జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రం, పోస్ట్‌మార్టం నివేదిక కూడా అందించాలి.
బీమా పాలసీ తీసుకున్న 3 ఏళ్ల లోపునే, పరిహారం కోసం క్లెయిమ్ చేస్తే, అది నిజమైన క్లెయిమ్ అవునో, కాదో నిర్ధరించడానికి బీమా సంస్థ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తుంది. అన్నీ క్లియర్‌గా ఉంటే, పరిహారం చెల్లిస్తుంది. పాలసీదారుడు ఆత్మహత్య చేసుకుంటే మాత్రం పరిహారం అందించదు.