ITR Filing Mistakes: పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసే సమయం జూన్ 31 వరకే ఉంది. ఆ తర్వాత జరిమానా చెల్లించాల్సి వస్తుంది. సరైనా అవగాహన లేకపోయినా లేదా నిపుణుల సాయంతో చాలా మంది జాగ్రత్తగానే ఐటీఆర్‌ను సమర్పిస్తారు. కానీ కొన్ని సార్లు తొందపాటు వల్ల పొరపాట్లు చేసేస్తుంటారు. ఈ తప్పులను సరిదిద్దుకునేందు అవకాశం ఉంటుంది. రివైజ్డ్ రిటర్నుల దాఖలు చేసి సవరించుకోవచ్చు. కానీ, అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి చేయాలి. అందుకే ముందే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రిటర్నులు దాఖలు చేసేటప్పుడు తప్పులు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
సరైన ఫారం ఎంచుకోవాలి
కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (CBDT)నోటిఫై చేసిన ఏడు రకాల ఐటీ ఫారాల్లో, మీకు ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. రూ.50లక్షల వరకూ వేతనం, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ వంటి ఇతర మార్గాల్లో ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-1 ఎంచుకోవచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలకు రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్నప్పుడు ఐటీఆర్-4 దాఖలు చేయొచ్చు. రూ.50లక్షలకు పైగా వేతనం ఉండి, ఒకే ఇంటి ద్వారా ఆదాయం ఉన్నప్పుడు ఐటీఆర్-2ను దాఖలు చేయాలి. ఐటీఆర్-1, ఐటీఆర్-2ల విషయంలో అనుమానం ఉన్నవారు ఐటీఆర్-3ని ఎంచుకోవచ్చు. అయితే షేర్లలో క్రయవిక్రయాలు చేసినప్పుడు మీరు నిర్వహించిన లావాదేవీల ఆధారంగా ఐటీఆర్-2 లేదా ఐటీఆర్ 3ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగతా పత్రాలు కంపెనీలు, వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి.
బ్యాంకు ఖాతా ధ్రువీకరణ
పన్ను చెల్లింపుదారులంతా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ముందుగానే తమ బ్యాంకు ఖాతాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ట్యాక్స్ పేయర్ల ఖాతా యాక్టివ్‌గానే ఉందా లేదా అనే విషయాన్ని ఇది నిర్ధరిస్తుంది. అప్పుడే రిఫండ్లు జమ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.
ఐటీఆర్ ఈ-వెరిఫై తప్పనిసరి
ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా ధ్రువీకరించాలి. అప్పుడే దాఖలు ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. లేదంటే రిటర్నులను పరిగణనలోకి తీసుకోరు. అది కూడా ఐటీఆర్ అప్‌లోడ్ చేసిన 30 రోజుల్లోగా వెరిఫై చేయాల్సి ఉంటుంది.
మినహాయింపులు
ఆదాయపు పన్ను మినహాయింపుల్లో సెక్షన్ 80సీ ముఖ్యం. ఈ సెక్షన్ కింద వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తే, రూ.1,50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, గృహరుణం అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం వంటివి సెక్షన్ 80సీ పరిధిలోకే వస్తాయి. అయితే ఈ సెక్షన్లో ఆరోగ్య బీమా ప్రీమియం వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సేవింగ్స్ ఖాతా ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై రూ.10,000 వరకు 80టీటీఏ కింద మినహాయింపు కోరవచ్చు. అలాగే వేతనంలో హెచ్‌ఆర్‌ఏ లేనట్లయితే అద్దె చెల్లింపులకు 80జీజీ కింద మినహాయింపు ఉంటుంది. పన్ను ఆదా కోసం అన్ని రకాల పెట్టుబడులు, ఖర్చులను రిటర్నుల్లో సరిగ్గా పేర్కొనాలి.