ITR Filing Last Date 2024 :ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నులను దాఖలు చేసేందుకు ఈ రోజు (జులై 31)తో గడువు ముగియనుంది. ఈ గడువును మళ్లీ పొడిగించే సూచనలేవీ కనిపించడం లేదు. కనుక వీలైనంత త్వరగా ఇవాళే ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది.
వాళ్లు నష్టపోవడం ఖాయం!
గడువు దాటిన తరువాత కూడా అపరాధ రుసుముతో ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ పాత విధానం (Old tax regime) ఎంచుకునే వారు మాత్రం పలు ప్రయోజనాలు కోల్పోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాత పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటున్నవారు, పెనాల్టీతో పాటు అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది.
గడువులోగా మారే అవకాశం ఉంది!
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ అవసరం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు జులై 31లోపు ఐటీ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం 2 రకాల పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వీటిలో కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటుంది. కానీ మీరు కావాలని అనుకుంటే, గడువులోగా పాత పన్ను విధానానికి మారవచ్చు. కనుక మీకు ఏది ప్రయోజనకరమైతే, ఆ విధానాన్ని ఎంచుకోవడం మంచిది.
బై డిఫాల్ట్‌గా
నిర్దేశిత గడువు దాటిన తర్వాత, పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా కొత్త పన్ను విధానాన్ని మాత్రమే అనుసరించాల్సి ఉంటుందని ఐటీఆర్ వెబ్‌సైట్ స్పష్టం చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే, గడువు దాటిన తరువాత పాత పన్ను విధానాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉండదు. డెడ్‌లైన్ ముగిశాక బిలేటెడ్ ఐటీఆర్‌ను కేవలం కొత్త పన్ను విధానంలో మాత్రమే దాఖలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల పాత పన్ను విధానంలో మినహాయింపులు క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు కోల్పోతారు. పైగా కొత్త పన్ను విధానం కింద అదనంగా పన్ను చెల్లించాల్సి రావచ్చు.