ITR Filing AIS and FORM 26AS Data : ఆదాయపు పన్ను రిటర్నుల(ఐటీఆర్) దాఖలు గడువు ముంచుకొస్తోంది. అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 కోసం ఈనెల(జులై) 31కల్లా ఐటీఆర్‌ను దాఖలు చేయాలి. ఈ క్రమంలో ఫామ్ 26ఏఎస్, ఏఐఎస్ (యానువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్), టీఐఎస్ (ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ)లను మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏఐఎస్, ఫామ్ 26ఏఎస్‌ల సమాచారంలో తేడా ఉంటే మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తాయి. పరిస్థితి అక్కడి వరకు వెళ్లొద్దంటే మీరు ముందుగానే వాటిని చెక్ చేసుకొని, తప్పులుంటే గుర్తించి సవరణలు చేయించుకోవాలి. ఇంతకీ ఈ మూడు రకాల స్టేట్మెంట్లు ఏమిటి? వీటికి ఐటీఆర్ ఫైలింగ్‌తో ఉన్న సంబంధమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
'ఫామ్ 26ఏఎస్' అంటే ఏమిటి?
ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో మనం చేసిన లావాదేవీలతో ముడిపడిన పన్ను వివరాలను 'ఫామ్ 26ఏఎస్' సమగ్రంగా అందిస్తుంది. దీన్ని మనం ఆదాయపు పన్ను శాఖ ద్వారా పొందొచ్చు. మనకు అందించే ఉత్పత్తి/సేవపై కంపెనీలు ముందస్తుగా విధించిన టీడీఎస్ (మూలం వద్ద పన్ను) వివరాలతో పాటు అమ్మకం దారులు ఉత్పత్తులు/సేవలను ప్రత్యక్షంగా విక్రయించేటప్పుడు వసూలు చేసే టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) సమాచారం ఫామ్ 26ఏఎస్‌లో ఉంటుంది. మన పాన్ కార్డు నంబరుతో చెల్లించిన పన్ను వివరాలు అన్నింటినీ ఇందులో పొందుపరుస్తారు.
'ఏఐఎస్' అంటే ఏమిటి?
యానువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్) అనేది ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పన్ను మదింపు వివరాలతో కూడిన అధికారిక పత్రం. ఇందులో మన ఆదాయ వివరాలతో పాటు క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, పన్ను చెల్లింపులు, థర్డ్ పార్టీలు చేసిన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సమాచారం ఉంటుంది.
'టీఐఎస్' అంటే ఏమిటి?
ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్) అనేది నిజంగానే ఒక సమ్మరీలా ఉంటుంది. యానువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్)లోని సమాచారం కూడా ఇందులో లభ్యమవుతుంది. 'ఫామ్ 26ఏఎస్'లో కేవలం మన ట్యాక్స్ పేమెంట్స్ ప్రస్తావన మాత్రమే ఉంటుంది. కానీ టీఐఎస్‌లో సమగ్రంగా ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలోని పన్ను చెల్లింపుల వివరాలు, సాధారణ లావాదేవీల సమాచారం, ఇతర ఆర్థిక వ్యవహారాల ఇన్ఫో అన్నీ కలగలిసి ఉంటాయి.
ఏఐఎస్, ఫామ్ 26ఏఎస్ మధ్య తేడా ఏమిటి?
యానువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్) అనేది 'ఫామ్ 26ఏఎస్'కు పొడిగింపు లాంటిది. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఆస్తి కొనుగోళ్లు, అధిక విలువ కలిగిన పెట్టుబడులు, టీడీఎస్/టీసీఎస్ లావాదేవీల వివరాలు 'ఫామ్ 26ఏఎస్'లో ఉంటాయి. ఇందుకు అదనంగా ఏఐఎస్‌లో సేవింగ్స్ ఖాతా వడ్డీ, డివిడెండ్ ఆదాయం, అద్దె ఆదాయం, సెక్యూరిటీలు/స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకం లావాదేవీలు, విదేశీ చెల్లింపులు, డిపాజిట్లపై వడ్డీ, జీఎస్టీ టర్నోవర్ సమాచారం ఉంటుంది. ఏఐఎస్‌లోని మన లావాదేవీలు, పన్ను చెల్లింపుల సమాచారంలో తేడాలు ఉంటే ఆదాయపు పన్ను విభాగానికి ఫిర్యాదు చేసే ఆప్షన్లు ఉంటాయి.
సమాచారంలో తేడా ఉంటే ?
మనం ఐటీ రిటర్న్‌ను దాఖలు చేసే ముందు ఏఐఎస్, ఫామ్ 26ఏఎస్ రెండింటిలో ఉన్న వివరాలను చెక్ చేసుకోవాలి. ఆ రెండింటి సమాచారంతో ఏదైనా తేడా ఉంటే వాటిపై ఆన్‌లైన్ ద్వారా ఐటీ విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. ఆ సమాచారంలో సవరణ చేయాలని కోరవచ్చు. అయితే ఈ క్రమంలో ఆ లావాదేవీ లేదా పన్ను చెల్లింపుతో ముడిపడిన సరైన వివరాలతో కూడిన డాక్యుమెంటు/బ్యాంక్ స్టేట్మెంట్/డీమ్యాట్ స్టేట్మెంట్‌లను ప్రూఫ్‌గా సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని ఐటీ విభాగం తనిఖీ చేసి మనం అందించిన సమాచారం నిజమైందని తేలితే ఫామ్ 26 ఏఎస్ లేదా ఏఐఎస్‌లో ఉన్న తప్పిదాన్ని ఆదాయపు పన్ను విభాగం సరి చేస్తుంది.
'ITR ఫైలింగ్ గడువు పొడిగించలేదు - జులై 31లోగా రిటర్నులు సమర్పించాల్సిందే' - ఐటీ డిపార్ట్మెంట్ - ITR Filing Last Date 2024