Interim Budget 2024 Expectations : సార్వత్రిక సమరానికి ముందు ఎన్డీఏ సర్కారు తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలన్న ఆకాంక్షల మధ్య ఈ బడ్జెట్‌ను తీసుకొస్తోంది. ఈసారి బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలేమీ ఉండకపోవచ్చని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. తాత్కాలిక బడ్జెట్ అయినందున పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు.
అప్పుడే మొదలైంది
మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు తాత్కాలిక బడ్జెట్‌లో కొత్త పథకాలు, పన్నుల్లో మార్పులు వంటివి పెద్దగా ఉండవు. ఎన్నికల అనంతరం కొలువుదీరే కొత్త ప్రభుత్వానిదే వాటి బాధ్యత. అయితే ఈ సంప్రదాయానికి ఎప్పుడో తెరపడింది. ఎన్నికల ముందు వచ్చే తాత్కాలిక బడ్జెట్‌లోనూ కీలక ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రజాకర్షక పథకాలు, ఓటర్లను ఆకట్టుకునే నిర్ణయాలు తీసుకోవడం 20 ఏళ్ల క్రితమే మొదలైంది.
2004లో ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి జశ్వంత్‌సింగ్ తాత్కాలిక బడ్జెట్‌లో కీలక నిర్ణయం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకోవడానికి 50 శాతం డీఏను ఐదో వేతన సంఘం సిఫార్సుల మేరకు మూలవేతనంలో కలుపుతూ నిర్ణయం వెల్లడించారు. అంతేగాక అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారుల కుటుంబాల సంఖ్యను కోటీ 50 లక్షల నుంచి 2 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
యూపీఏ కూడా అదే బాటలో
తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్‌లో ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. 2009లో నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని 10 నుంచి 8 శాతానికి, సర్వీస్ ట్యాక్స్‌ను 12 నుంచి 10 శాతానికి తగ్గించారు. 2014లో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన చిందంబరం, కొన్నింటిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్-నాన్ డ్యూరబుల్స్, ద్విచక్ర వాహనాలు, కార్లు, వాణిజ్య వాహనాలు, మొబైల్ ఫోన్లపై ట్యాక్స్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.