తెలంగాణ

telangana

50 ఏళ్లకే రిటైర్ కావాలనుకుంటున్నారా? ఇలా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా! - 50 Years Old Retirement Plan Tips

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2024, 1:46 PM IST

50 Years Old Retirement Plan Tips : మీరు యువ ఉద్యోగులా? 50 ఏళ్లకే రిటైర్మెంట్​ను ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. 50 ఏళ్ల వయసులో రిటైర్ అయితే, ఉద్యోగ అనంతరం జీవితం సాఫీగా సాగడానికి ఎంత మొత్తంలో నగదు ఉండాలి? ఎలా ప్లాన్ చేయాలి? తదితర విషయాలు తెలుసుకుందాం.

50 Years Old Retirement Plan Tips
50 Years Old Retirement Plan Tips (GettyImages)

50 Years Old Retirement Plan Tips :భారతదేశంలో పదవీ విరమణ వయసు 60 ఏళ్లు. అయితే చాలా మంది ముందుగానే రిటైర్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా యువతలో ఈ ధోరణి పెరుగుతోంది. 30 ఏళ్ల నుంచే రిటైర్మెంట్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అందుకు కారణాలు ఉద్యోగ ఒత్తిడి, జాబ్ పట్ల ఆసక్తి లేకపోవడం కావొచ్చు! అంత తక్కువ వయసులోనే రిటైర్మెంట్ కావడం అంటే ఆర్థిక సవాళ్లను కొని తెచ్చుకున్నట్లే. ఈ క్రమంలో 32 ఏళ్ల యువ ఉద్యోగి 50 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాడని అనుకోండి. ఎంత సొమ్ము అతడి చేతిలో ఉంటే నిశ్చింతగా 50 ఏళ్ల వయసులో రిటైర్ కావచ్చు. అందుకు ఏయే ఆర్థిక చిట్కాలు పాటించాలో ఈ స్టోరీలో చూద్దాం.

18 ఏళ్ల ఉద్యోగ జీవితం
ఉదాహరణకు ఉద్యోగి వయసు 32 ఏళ్లు అనుకుందాం. అతడు తాను చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తిగా లేడు. కానీ ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే వరకు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టలేడు. అప్పుడు 50 ఏళ్ల వయసులో తన దగ్గర తగినంత డబ్బు ఉంటుందని, ఆ తర్వాత రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఉద్యోగి చేతిలో ఉన్నవి 18 ఏళ్లు. ఈ సమయంలో అతను సంపదను ఎలా సృష్టించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.6 కోట్లు- రూ.7 కోట్లు అవసరం!
ప్రజల ఆయుర్దాయం పెరుగుతోందని గుర్తుంచుకోండి. కాబట్టి 85-90 సంవత్సరాల వయసు వరకు జీవించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగి 50 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ అయినా, మరో 40 సంవత్సరాలు ఉద్యోగానంతర జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి సరిపడా కార్పస్‌ ను కలిగి ఉండాలి. ఉద్యోగి వార్షిక వ్యయం ప్రస్తుతం రూ.7.5 లక్షలు అనుకుందాం. సగటు ద్రవ్యోల్బణాన్ని 6 శాతంగా తీసుకుందాం. ఈ లెక్కన 50 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వాలంటే రూ.6 కోట్లు- రూ.7 కోట్లు కావాలి. అలాగే పదవీ విరమణ తర్వాత 7-8 శాతం రాబడి వచ్చేలా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. 60-40 శాతం ఈక్విటీ-డెట్ పోర్ట్‌ ఫోలియోలో పెట్టుబడులు పెట్టాలి.

ఈ విషయాలు మరింత ముఖ్యం

- భార్యాపిల్లలు ఉంటే రిటైర్మెంట్ కోసం డబ్బు పొదుపు చేస్తే సరిపోదు. మీ పిల్లల చదువు, వివాహం కోసం కూడా ఆదా చేయాలి. సొంత ఇల్లు కొనుగోలుకు పొదుపు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రిటైర్ అయ్యే ముందు ఈ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ లక్ష్యాలన్నింటికీ అవసరమైన డబ్బు పదవీ విరమణ కార్పస్‌ కు అదనంగా ఉంటుంది.

-అకస్మాత్తుగా ఏదైనా అవసరం కావచ్చు. దీన్ని ముందుగానే ప్లాన్ చేయలేం. ఇల్లు, కారు కొనుగోలు చేయడం. వాటిని మెయింటెనెన్స్ చేయడం కావచ్చు. అప్పుడు పొదుపులో కొంత భాగం బయటకు పోతుంది. మీరు త్వరగా పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకుంటే, మీరు ఈ ఖర్చుల గురించి కూడా ఆలోచించాలి.

- రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ ఏళ్లు బతికేందుకు పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ అవసరం. మీ జీవిత భాగస్వామి మీ కంటే చిన్న అయితే, మీ తదనంతరం ఆమె జీవించడానికి డబ్బులు అవసరం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

- వయసు పెరిగే కొద్దీ వ్యాధులు కూడా పెరుగుతాయి. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోదు. ఎందుకంటే ఆరోగ్య బీమాలో చేర్చని అన్ని వైద్య ఖర్చుల గురించి కూడా ఆలోచించాలి. అందువల్ల మెడికల్ కంటింజెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలి.

-మీరు త్వరగా పదవీ విరమణ చేయాలనుకుంటే మీకు చాలా పొదుపు అవసరం. అందుకే త్వరగానే పొదుపు చేయడం, వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టండి. 50 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ను పక్కాను ప్లాన్ చేసుకోండి. పెద్ద మొత్తంలో కార్పస్ మీ దగ్గర ఉంటే ముందస్తు రిటైర్మెంట్ గురించి ఆలోచించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details