ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీరేట్లు తగ్గడం లేదు! మరి హౌమ్​ లోన్ తీసుకున్న వారేం చేస్తే బెటర్​? - House Loan Interest Deduction

How To Reduce Home Loan Interest : ప్రస్తుతం ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లు మాత్రం తగ్గడం లేదు. దీంతో హౌస్ లోన్​ తీసుకున్న వారు అధిక వడ్డీ భారాన్ని భరించక తప్పని పరిస్థితులున్నాయి. మరి ఇప్పటికే గృహరుణం తీసుకున్న వారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Reduce Home Loan Interest Rates
How To Reduce Home Loan Interest Rates
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 8:10 AM IST

How To Reduce Home Loan Interest :ఏడాది కాలంగా రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోంది. దీనిని ఆర్​బీఐ పెంచకపోవడం శుభ పరిణామమే. అదే సమయంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. అయితే అది వడ్డీ రేట్లను తగ్గించే విధంగా మాత్రం సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో గృహరుణం తీసుకున్న వారు అధిక వడ్డీ భారాన్ని భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గృహరుణం తీసుకున్న, ఇల్లు కొనాలని అనుకుంటున్న వారు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే?

సొంతిల్లు కొనాలి లేదా కట్టుకోవాలనే ఆలోచనలో ఉన్న వారికి రుణాలను అందించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా రుణగ్రహీతలను ఆకట్టుకునే క్రమంలో స్వయంగా కొంత ప్రీమియంను తగ్గించుకుంటున్నాయి. 2022 ఫిబ్రవరి నెలలో ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే ప్రస్తుత వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. అయితే గత ఏడాదితో చూస్తే మాత్రం కాస్త వడ్డీ భారం తగ్గిన మాట వాస్తవం. కాగా, ప్రస్తుతం ఇంటి రుణంపై కనీస వడ్డీ రేటు 8.30 నుంచి 8.60 శాతం మధ్యలోనే ఉంది.

750కిపైగా క్రెడిట్‌ స్కోరు ఉన్న ఖాతాదారులకు మాత్రమే బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. మహిళలకు, బ్లూచిప్‌ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రీమియం ఆస్తులను కొనుగోలు చేస్తున్న వారికి గృహరుణ వడ్డీలో కొంత రాయితీలను కల్పిస్తున్నాయి బ్యాంకులు. ఇదిలా ఉంటే ఖాతాదారుడు బ్యాంకును మార్చుకున్నప్పుడు కూడా వడ్డీ తగ్గే అవకాశం ఉంది.

వడ్డీ రేట్లను ఇలా నిర్ణయిస్తారు!
అక్టోబరు 2019 నుంచి బ్యాంకులు గృహరుణ వడ్డీ రేటును నిర్ణయించేందుకు రెపోను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అంతకుముందు వీటిని నిధుల ఆధారిత వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) లేదా బేస్‌ రేటు ఆధారంగా నిర్ణయించేవారు. రెపో రేటు ఆధారిత రుణాలు అది (రెపో రేటు) మారినప్పుడల్లా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ప్రస్తుతం తక్కువ గృహరుణ వడ్డీని తీసుకుంటున్న బ్యాంకు రుణం రెపో రేటుపై 180 బేసిస్‌ పాయింట్లు అధికంగా ఉంది. కానీ, కొన్ని పాత రుణాలు రెపో రేటుపై 300 బేసిస్‌ పాయింట్లకన్నా ఎక్కువగా కొనసాగుతున్నాయి.

బ్యాంకు మారేముందు ఇవి పరిశీలించండి
ప్రస్తుతం మీ రుణానికి వడ్డీ రేటు ఎంత ఉందో ముందుగా తెలుసుకోండి. బ్యాంకుకు ఇంకా ఎంత మొత్తం బాకీ ఉన్నారన్నదీ చూడండి. ఉదాహరణకు- మీరు ఇప్పటికీ సగానికిపైగా రుణం తీర్చాల్సి ఉందని అనుకుందాం. ఈ క్రమంలో మీరు కొత్తగా రుణం తీసుకుంటే 50-100 బేసిస్‌ పాయింట్లు తక్కువ వడ్డీకే రుణం వస్తుంది అని అనుకుంటే కొత్త బ్యాంకుకు మారే అంశాన్ని పరిశీలించవచ్చు. లేదంటే పాత బ్యాంకునే ఒకసారి అడిగి చూడండి. ఒకవేళ మీరు ఎంసీఎల్‌ఆర్‌ లేదా బేస్‌ రేటు ఆధారంగా వడ్డీ చెల్లిస్తుంటే దానిని రెపో ఆధారిత రుణ వడ్డీ రేటుకు మార్చమని అడగండి.

అయితే ఇందుకోసం కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. వేరే బ్యాంకుకు మారాలనుకున్నప్పుడు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తుంది. ఫీజులు కూడా అధికంగానే ఉంటాయి. మీరు తీసుకునే రుణంలో ఇవి 1 శాతం వరకు ఉండవచ్చు. అక్కడ(కొత్త బ్యాంకులో) తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఈ ఖర్చులు ఏడాదిలో తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీ హౌస్​లోన్​ బాకీ రూ.30 లక్షలు ఉందని అనుకుందాం. ఇంకా పదేళ్ల వ్యవధి మిగిలి ఉంది. వడ్డీ రేటు 9.50 శాతం నుంచి 8.50 శాతానికి మారితే 10 ఏళ్లలో కొత్త వడ్డీ రేటు కింద ఆదా అయ్యే మొత్తం రూ.1,95,000 వరకు ఉంటుంది.

ప్రభుత్వ బ్యాంకుల నుంచి గృహరుణం తీసుకుంటే?
ఒకవేళ మీరు ప్రభుత్వ బ్యాంకుల నుంచి గృహరుణం తీసుకుంటే అప్పుడు కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో తీసుకునే గృహరుణాలపై వడ్డీ రేట్లు చాలా వరకూ పాత బెంచ్‌మార్క్‌ల ఆధారంగానే ఉన్నాయని ఆర్‌బీఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 79 శాతం రుణాలు రెపో రేటు విధానానికి మారాయి. విదేశీ బ్యాంకుల విషయంలో ఇది 90 శాతంగా ఉంది. అయితే ప్రభుత్వ బ్యాంకుల్లో దీని వాటా 38 శాతం మాత్రమే ఉండడం గమనించాల్సిన విషయం. 2020కి ముందు ప్రభుత్వ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే గనకు ఒకసారి సంబంధిత బ్యాంకును సంప్రదించండి. రెపో రేటుకు మారేందుకు ప్రయత్నించండి. తద్వారా మీ గృహరుణ వడ్డీ భారం కొంతలోకొంతైనా తగ్గవచ్చు. చివరగా మీ క్రెడిట్‌ స్కోరు 800కి మించి ఉన్నప్పుడు బ్యాంకులతో వడ్డీ విషయంలో బేరమాడేందుకు ఆస్కారం ఉంటుంది.

'పేటీఎంకు సహాయం చేయండి'- NPCIని కోరిన RBI

సైబర్ నేరగాళ్ల​​ నుంచి రక్షణ కావాలా? అయితే ఆ 'బీమా' తీసుకోవడం తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details