తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫారం-16 లేకుండా ITR దాఖలు చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To File ITR Without Form 16

How To File ITR Without Form 16 : గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. అయితే ఫారం-16 లేకుండా ఐటీఆర్​ దాఖలు చేయడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

How to File ITR in Telugu
How to File ITR Without Form 16 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 4:57 PM IST

How To File ITR Without Form 16 : పన్ను వర్తించే ఆదాయం ఉండి, మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించినప్పుడు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటీఆర్​) సమర్పించాలి. కొన్నిసార్లు పన్ను వర్తించే ఆదాయం మీకు లేకపోవచ్చు. కానీ, భవిష్యత్తు అవసరాల కోసం ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంత మంది వేతనం ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పటికీ ఫారం-16 ఉండకపోవచ్చు. మరి, ఇలాంటప్పుడు రిటర్నులు దాఖలు చేయడం ఎలా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గడువు పొడిగిస్తారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఐటీఆర్​ దాఖలు చేయడానికి (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఈ గడువు ఇంకా పొడిగిస్తారా? లేదా? అనేది తెలియదు. అందువల్ల ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. రిటర్నులను సమర్పించేందుకు ఫారం-16 లేకపోయినా ఏం ఫర్వాలేదు. ఇతర ఆధారాలు, అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకొని, మీరు ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలు, జీతం రశీదులు, వడ్డీ సర్టిఫికెట్లు సహా, ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయానికి సంబంధించిన పత్రాలు సేకరించి, వాటి ఆధారంగా ఆదాయ పన్ను రిటర్నులు సమర్పించే అవకాశం ఉంటుంది.

ఆదాయ మార్గాలు :పన్ను చెల్లింపుదారులకు వివిధ మార్గాల్లో ఆదాయం వస్తుంటుంది. వాటిలో ప్రధానమైనవి ఏమిటంటే?

  • జీతం : మీ ఆదాయాన్ని లెక్కించేందుకు మీరు నెలవారీ పొందిన జీతం వివరాలను చూడాలి.
  • వడ్డీ : మీ పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులపై వచ్చిన వడ్డీ ఆదాయాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి.
  • అద్దె : అద్దె రూపంలో వచ్చిన డబ్బును కూడా మీ మొత్తం ఆదాయానికి జోడించాల్సి ఉంటుంది.
  • ఇతర వనరులు : పైన పేర్కొన్న వనరుల నుంచి కాకుండా, ఇతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీ కలిపితే గత ఆర్థిక సంవత్సరంలో మీరు సంపాదించిన మొత్తం డబ్బు లెక్క తేలుతుంది.

వార్షిక సమాచార నివేదికతో
ఆదాయపు పన్ను పోర్టల్‌ నుంచి ఫారం-26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లను తీసుకోవాలి. వీటిలో మీకు వివిధ మార్గాల నుంచి వచ్చిన ఆదాయాల వివరాలు కనిపిస్తాయి. కనుక ఈ ఆధారాలతోనూ ఆదాయ పన్ను రిటర్నులు సమర్పించేందుకు వీలవుతుంది.

పన్ను కోత ఉంటే
యాజమాన్యం మీ వేతనం నుంచి మూలం వద్ద పన్ను కోత (TDS) విధిస్తే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, కచ్చితంగా ఫారం-16 జారీ చేస్తుంది. కొన్నిసార్లు మీకు ఆదాయం ఉన్నప్పటికీ, టీడీఎస్‌ ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు యాజమాన్యం ఫారం-16 ఇవ్వకపోవచ్చు. ఇలాంటప్పుడు పైన పేర్కొన్న ప్రకారం లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది.

ఐటీఆర్​ ఎందుకు దాఖలు చేయాలి?

  • ఆదాయపు పన్ను రిటర్నులకు చట్టపరమైన విలువ ఉంటుంది. అంటే, మీ ఆదాయానికి అధికారిక గుర్తింపు లభిస్తుంది.
  • రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, మీ ఆదాయ ధ్రువీకరణకు ఐటీఆర్​ ఉపయోగపడుతుంది.
  • మూలధన నష్టాలను రానున్న ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చేసుకునే వీలు కలుగుతుంది.
  • మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) ఉండి, రీఫండ్​కు అర్హత ఉన్నప్పుడు, రిటర్నులు దాఖలు చేసి, దాన్ని పొందవచ్చు.
  • విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు, వీసా సులభంగా వచ్చేందుకు ఐటీఆర్‌ తోడ్పడుతుంది.

మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ ఫీజులు, ఛార్జీలు గురించి మీకు తెలుసా? - Credit Card Charges And Fees

'అన్​లిమిటెడ్' హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్​ - ఎన్ని సార్లైనా, ఎంతైనా క్లెయిమ్ చేసుకోవచ్చు! - Unlimited Health Insurance

ABOUT THE AUTHOR

...view details