How To Withdraw Cash Using Aadhaar Card :టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోయాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేయాలన్నా, పక్కనే ఉన్న కిరాణా దుకాణంలో వస్తువులు కొనాలన్నా, బిల్స్ పే చేయాలన్నా అన్నింటికీ ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తున్నాం. కానీ ఇంటర్నెట్ లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా డబ్బులు వాడుతూనే ఉన్నారు. మరి ఇలాంటి ఏరియాల్లో ఉన్నప్పుడు సమయానికి డబ్బులు లేకపోతే పరిస్థితి ఏమిటి?
సాధారణంగా మనకు డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకు లేదా ఏటీఎంకు వెళ్లి క్యాష్ విత్‌డ్రా చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు పొరపాటున ఏటీఎం కార్డ్ ఇంట్లో మరిచిపోయి, డబ్బులు తీయలేక చాలా ఇబ్బందిపడుతూ ఉంటాం. అందుకే ఈ సమస్యను నివారించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) - ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీ దగ్గర ఏటీఎం కార్డు లేకపోయినా, ఆధార్ కార్డుతోనే డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కలిగింది. మరి ఇది ఎలా పని చేస్తుందంటే?
ఆధార్ కార్డ్‌తో మనీ విత్‌డ్రా
మీ బ్యాంకు ఖాతాతో, ఆధార్ కార్డును అనుసంధానం చేసుకుని, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చెక్ చేయవచ్చు. అవసరమైతే ఇతరులకు డబ్బులు పంపించవచ్చు. మైక్రో ఏటీఎంలు, బ్యాంక్ ఏజెంట్ల వద్దకు వెళ్లి, మీ ఆధార్‌తో, బయోమెట్రిక్ అథంటికేషన్‌తో ఈ సర్వీస్‌లను యాక్సెస్ చేయవచ్చు.
విత్‌డ్రా పరిమితి
బ్యాంకులను బట్టి ఆధార్ కార్డు ఉపయోగించి రోజుకు ఎంత పరిమితి మేరకు డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు అనేది మారుతుంది. ప్రస్తుతానికి చాలా బ్యాంకులు రోజుకు రూ.10,000 నుంచి రూ.50,000 వరకు ఆధార్ కార్డ్‌తో విత్‌డ్రా చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా కొన్ని బ్యాంకులు ఏఈపీఎస్ సేవలపై పరిమితులు విధించే అవకాశం ఉంటుంది.
ఆధార్ కార్డుతో డబ్బులు విత్‌డ్రా చేయండి ఇలా!
- ముందుగా మీ దగ్గర్లోని మైక్రో-ఏటీఎం సర్వీస్ పాయింట్ లేదా బ్యాంకింగ్ కరెస్పాండెంట్ వద్దకు వెళ్లండి.
- సదరు బ్యాంకింగ్ కరెస్పాండెంట్‌కు మీ 12 అంకెల ఆధార్ నంబర్ చెప్పండి.
- తరువాత మీ బ్యాంకును ఎంచుకుని, మీ ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కానింగ్ చేసి, అథంటికేషన్ పూర్తి చేయండి.
- మీరు ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలని అనుకుంటున్నారో చెప్పండి. అంతే సింపుల్!
- అథంటికేషన్ పూర్తి అయిన తరువాత, మీరు కోరుకున్న డబ్బుతో సహా, ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కూడా వస్తుంది.