How To e-Verify Your Income Tax Return : ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి మరికొద్ది రోజులే (జులై 31 వరకు) గడువు ఉంది. అయితే కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఈ గడువును ఆగస్టు వరకు పొడిగించమని ఆదాయ పన్ను శాఖను కోరుతున్నారు. కానీ ఇలా చివరి వరకు వేచి ఉండడం ఏమాత్రం మంచిది కాదు. వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయడమే మంచిది. ఒక వేళ మీరు ఇప్పటికే, ఐటీఆర్ దాఖలు చేసి ఉంటే, కచ్చితంగా దానిని 30 రోజుల్లోపు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే సదరు ఐటీఆర్ చెల్లకుండా పోతుంది. అందుకే ఐటీఆర్ వెరిఫికేషన్ ఎలా పూర్తి చేయాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఈ-వెరిఫై ఆప్షన్ ద్వారా చాలా సులభంగా ఐటీఆర్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం వివిధ మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. ఆధార్ ఓటీపీ ద్వారా : ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలోనే ఆధార్ ఓటీపీ ద్వారా వెరిఫై ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- 'ఈ-ఫైల్' ట్యాబ్‌పై క్లిక్ చేసి డ్రాప్‌డౌన్ మెనూలోని 'ఆదాయ పన్ను రిటర్న్' (ITR)ను ఎంచుకోవాలి.
- అసెస్‌మెంట్ ఇయర్, ఐటీఆర్ ఫారమ్ పేరు, సబ్మిషన్ మోడ్‌లను ఎంచుకోవాలి. తరువాత 'కంటిన్యూ'పై క్లిక్ చేయాలి.
- ధృవీకరణ మాధ్యమంగా 'ఆధార్ ఓటీపీ'ని ఎంచుకోవాలి.
- డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి రిటర్నులు సమర్పించాలి.
- తరువాత 'జనరేట్ ఆధార్ OTP'పై క్లిక్ చేయాలి.
- వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. అది కేవలం 30 నిమిషాల వరకు మాత్రమే పనిచేస్తుంది.
- మీరు OTPని ఎంటర్ చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేస్తే చాలు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
2. నెట్ బ్యాంకింగ్ ద్వారా : ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలోనే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా వెరిఫై ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా మీరు నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి.
- తరువాత ఈ-ఫైలింగ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీరు ఐటీ ఈ-ఫైలింగ్ సైట్‌లోకి వెళ్తారు.
- 'ఈ-ఫైల్' ట్యాబ్‌పై క్లిక్ చేసి డ్రాప్‌డౌన్ మెనూలోని 'ఆదాయ పన్ను రిటర్న్'ను ఎంచుకోవాలి.
- అసెస్‌మెంట్ ఇయర్, ఐటీఆర్ ఫారమ్ పేరు, సబ్మిషన్ మోడ్‌లను ఎంచుకోవాలి. తరువాత కంటిన్యూపై క్లిక్ చేయాలి.
- డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి రిటర్నులను సమర్పిస్తే చాలు. ఈ-వెరిఫికేషన్ పూర్తయినట్లే.
3. బ్యాంకు ఖాతా ద్వారా :ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలోనే, మీ బ్యాంక్ ఖాతా ద్వారా కూడా వెరిఫై ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- ప్రొఫైల్ సెట్టింగ్స్ & ప్రీ-వ్యాలిడేట్ యువర్ బ్యాంక్ అకౌంట్‌ను సెలక్ట్ చేయాలి.
- అసెస్‌మెంట్ ఇయర్, ఐటీఆర్ ఫారమ్ పేరు, సబ్మిషన్ మోడ్‌లను ఎంచుకోవాలి. తరువాత కంటిన్యూపై క్లిక్ చేయాలి.
- ధృవీకరణ మాధ్యమంగా 'ఈవీసీ యూజింగ్ ప్రీ-వ్యాలిడేటెడ్ బ్యాంక్ అకౌంట్'ను ఎంచుకోవాలి.
- వెంటనే మీ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. అది 72 గంటల వరకు చెల్లుబాటు అవుతుంది.
- మీరు ఐటీఆర్ పత్రాలను అప్‌లోడ్ చేసిన తరువాత, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈవీసీ ఎంటర్ చేస్తే చాలు. ఈ-వెరిఫికేషన్ పూర్తయినట్లే.