తెలంగాణ

telangana

ETV Bharat / business

షేర్​​ మార్కెట్లో భారీ లాభాలు సంపాదించాలా? బెస్ట్ పోర్ట్​ఫోలియోను నిర్మించుకోండిలా!

How To Build An Investment Portfolio In Telugu : మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు కచ్చితంగా మంచి పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలి. అప్పుడే మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకే ఈ ఆర్టికల్​లో​ సరైన స్టాక్​ మార్కెట్ పోర్ట్​ఫోలియోను ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుందాం.

How To Build An stock market Portfolio
How To Build An Investment Portfolio

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 5:54 PM IST

How To Build An Investment Portfolio : స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కాస్త రిస్క్​తో కూడుకున్నవి. కానీ దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవడానికి ఇవే ఉత్తమ మార్గంగా ఉంటాయి. ఇందుకోసం మంచి పోర్ట్​ఫోలియోను రూపొందించుకోవడం చాలా అవసరం. అందుకే మీ ఆర్థిక లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన మంచి పోర్ట్​ఫోలియోను ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. లక్ష్యాలకు అనుగుణంగా
    ముందుగా మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. అందుకు తగిన పోర్ట్​ఫోలియోను నిర్మించుకోవాలి. ఉదాహరణకు మీరు 25-30 ఏళ్ల వ్యక్తి అనుకుందాం. మీరు మరో 10-15 ఏళ్లలో ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే, దానికోసం ఇప్పుడే మంచి స్టాక్‌ పోర్ట్‌పోలియోను సృష్టించుకోవాలి.
  2. పెట్టుబడి కేటాయింపులు
    మీ దగ్గర ఉన్న డబ్బును, వివిధ పెట్టుబడి మార్గాలకు మళ్లించాలి. దీనికంటే ముందు మీరు ఎంత మేరకు నష్టాన్ని భరించగలరో అంచనా వేసుకోవాలి. అందుకనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి. ఉదాహరణకు మీరు 15 ఏళ్ల తర్వాత రిటైర్ కావాలని ప్లాన్‌ చేసుకున్నారని అనుకుందాం. అప్పుడు మీరు మీడియం రిస్క్‌ గల షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. వాస్తవానికి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లార్జ్ క్యాప్ షేర్లలో కాస్త రిస్క్ తక్కువగా ఉంటుంది. అందువల్ల మీ పోర్ట్​ఫోలియోలో లార్జ్ క్యాప్​ షేర్లు ఎక్కువగా; మిడ్​, స్మాల్ క్యాప్ షేర్లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
  3. అనుభవాన్ని వాడుకోవాలి
    మీకు అనుభవం ఉన్న రంగంలో పెట్టుబడులు పెట్టడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఉదాహరణకు ఒక వ్యక్తికి స్టీల్‌, పవర్‌, నిర్మాణ రంగాల్లో మంచి అనుభవం ఉంది అనుకుందాం. అప్పుడు అతనికి ఇతర పరిశ్రమలతో పోలిస్తే ఈ మూడు రంగాలపై మంచి పట్టు ఉంటుంది. సదరు షేర్ల గురించి మంచిగా విశ్లేషణ చేయగలుగుతాడు. కనుక అతను తనకు తెలిసిన రంగాల్లో పెట్టుబడులు పెడితే, మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్​పై సరైన అవగాహన లేకపోతే, మంచి ఫైనాన్సియల్ అడ్వైజర్​ సలహాలను తీసుకోవాలి.
  4. హోంవర్క్‌ చేయాలి
    మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలని అనుకున్నా, ఆ రంగంపై కచ్చితంగా సమగ్ర పరిశోధన చేయాలి. ముఖ్యంగా మీరు కొనాలని అనుకుంటున్న స్టాక్స్ గురించి ఫండమెంటల్ ఎనాలసిస్ చేయాలి. కంపెనీ ఆదాయం, ఖర్చులు, దాని ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకోవాలి. సంస్థ ఆర్థిక నివేదికలను కచ్చితంగా పరిశీలించాలి. అంతేకాదు పరిశ్రమ పోకడలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. పోటీ సంస్థల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో కూడా అంచనా వేసుకోవాలి.
  5. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్
    రిస్క్ మేనేజ్​మెంట్​లో పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చాలా కీలకమైన అంశం. దీని వల్ల నష్టభయం బాగా తగ్గుతుంది. మంచి ఆదాయం వచ్చే అవకాశం మెరుగవుతుంది. అందువల్ల మీ డబ్బు అంతటినీ ఒకే రంగంలో లేదా ఓకే స్టాక్‌లో కాకుండా, వేర్వేరు సెక్టార్లలో, వేర్వేరు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మార్కెట్లో అస్థిరత వచ్చినా, మీ పెట్టుబడులకు రక్షణ లభిస్తుంది. ఎలా అంటే, మీ పోర్ట్‌ఫోలియోలోని ఒక స్టాక్‌కు ఏర్పడిన నష్టాన్ని, మరొకదాని లాభాలతో కవర్‌ చేసుకోవచ్చు.
  6. పెట్టుబడి కాలవ్యవధి
    చాలా మంది స్టాక్‌ మార్కెట్లో స్వల్పకాల పెట్టుబడులు పెడుతుంటారు. ఇది సరైన విధానం కాదు. దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రమే మీకు రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకుని, రిస్క్​ను తగ్గిస్తాయి. ఎక్కువ కాలం పాటు ఓపికతో పెట్టుబడులను కొనసాగించిన వారికి స్టాక్‌ మార్కెట్ మంచి రాబడులను అందిస్తుందని చరిత్ర స్పష్టం చేస్తోంది. అందుకే కనీసం 5-10 ఏళ్లపాటు మీ పెట్టుబడులను కొనసాగించాలి. అప్పుడే మీ ఆర్థిక లక్ష్యం నెరవేరుతుంది.
  7. భావోద్వేగాల నియంత్రణ
    స్టాక్ మార్కెట్ పెట్టుబడులు విషయంలో ఎమోషనల్ డెసిషన్స్ ఏమాత్రం తీసుకోకూడదు. మీలోని భావోద్వేగాలను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. చాలా మంది మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు స్టాక్స్ అమ్మేస్తూ ఉంటారు. మార్కెట్ లాభాల్లో ఉన్నప్పుడు ఎగబడి షేర్స్ కొంటూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. దీని వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
  8. మార్పులు, చేర్పులు
    స్టాక్‌ మార్కెట్లో ఒడుదొడుకులు సహజం. అందువల్ల స్టాక్‌ మార్కెట్‌ పోర్ట్‌ఫోలియోను కాలానుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉండాలి. నెలవారీగా లేదా మూడు నెలలకు ఒకసారి అయినా మీ పోర్ట్​ఫోలియోను చెక్ చేసుకోవాలి. వీలుకాకపోతే కనీసం ఏడాదికి ఒక్కసారైనా మీ పోర్ట్​ఫోలియోలో తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలి.
  9. నిపుణుల సలహా
    షేర్​ మార్కెట్ పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. మీడియాలో వచ్చిన ఫైనాన్సియల్ కథనాలను గమనిస్తూ ఉండాలి. ఆన్​లైన్ కోర్సులు చేయాలి. వర్క్​షాప్​లకు, సెమినార్లకు హాజరు కావాలి. స్టాక్ మార్కెట్​కు సంబంధించిన పుస్తకాలు, ఆర్టికల్స్ చదవాలి. ఇవన్నీ మీ ఫైనాన్సియల్ నాలెడ్జ్​ను పెంచుతాయి. వీటిని ఉపయోగించి మీ ఆర్థిక లక్ష్యాన్ని సాధించేందుకు తగిన పోర్ట్​ఫోలియోను నిర్మించుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details