How To Apply For Tatkal Passport Online : మీరు తత్కాల్ టికెట్ గురించి వినే ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల ప్రజలైతే దసరా, సంక్రాంతి లాంటి పండగల సమయంలో ఈ మాట ఎక్కువగా వింటారు. కానీ మీరెప్పుడైనా తత్కాల్ పాస్‌పోర్ట్ గురించి విన్నారా? అసలు అలాంటి పాస్‌పోర్ట్ ఉంటుందనే విషయం మీకు తెలుసా? ఇంతకీ ఈ తత్కాల్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? దాని కోసం ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తత్కాల్ టికెట్ లాగే, అత్యవసరంగా ప్రయాణం చేయాలని అనుకునే వారికి ఈ తత్కాల్ పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తారు. ఈ విధానాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవేశ పెట్టింది. వేగంగా పాస్‌పోర్టులు జారీ చేసేందుకు, అత్యవసర సమయాల్లో, చివరి నిమిషంలో తప్పనిసరిగా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు జారీ చేసే పాస్‌పోర్టునే 'తత్కాల్ పాస్‌పోర్ట్' అంటారు. సుదీర్ఘ దరఖాస్తు ప్రక్రియ లేకుండా, ఎక్కువ కాలం వేచి చూసే అవసరం లేకుండా, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
సాధారణంగా ఇండియాలో పాస్‌పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. పైగా దీనికి చాలా సమయం కూడా పడుతుంది. అందుకే ఏదైనా విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారు ముందుగానే దీని కోసం అప్లై చేసుకుంటారు. కానీ అనుకోకుండా, అత్యవసర సమయాల్లో కొన్ని సార్లు ప్రయాణం చేయాల్సి రావచ్చు. అలాంటి సమయంలో పాస్‌పోర్ట్ లేకుంటే చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. అలాంటి సమస్యను నివారించేందుకే కేంద్ర ప్రభుత్వం 'తత్కాల్ పాస్‌పోర్ట్' విధానాన్ని తీసుకొచ్చింది. దీని కోసం ఆన్లైన్లోనే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం కావాల్సిన పత్రాలు
Documents Required For Tatkal Passport :
- అనెక్సర్- ఎఫ్‌లో వివరించిన వెరిఫికేషన్ సర్టిఫికెట్
- కింది వాటిలోని ఏవైనా మూడు డాక్యుమెంట్లు ఉండాలి.
- ఎలక్షన్ కార్డు
- సర్వీసు ఫొటో ఐడీ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రాలు
- స్వాతంత్య్ర సమర యోధుల ఐడీ కార్డులు
- ఆయుధాల లైసెన్స్
- రేషన్ కార్డు
- ఆస్తి పత్రాలు
- పింఛను పత్రాలు
- రైల్వే ఫొటో ఐడీ కార్డు
- పాన్ కార్డు
- బ్యాంకు పాస్‌బుక్
- స్టూడెంట్ ఐడీ కార్డు (గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీ చేసినది)
- డ్రైవింగ్ లైసెన్స్
- జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్)
- గ్యాస్ కనెక్షన్ బిల్లు
తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి?
How To Apply For Tatkal Passport :
- ముందుగా పాస్‌పోర్డ్ సేవా వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- వెంటనే మీకొక ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది.
- ఈ ఐడీ, పాస్‌వర్డ్‌లతో వెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
- అక్కడ మీకు Fresh & Reissue అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి.
- తర్వాత Tatkal అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వివరాలు అన్నీ జాగ్రత్తగా నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
- తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజును కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- తరువాత పేమెంట్‌కు సంబంధించిన రశీదు ప్రింట్అవుట్ తీసుకోవాలి.
- చివరగా మీ దగ్గర్లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ డేట్‌ను ఫిక్స్ చేసుకోవాలి. అంతే సింపుల్!