House Rental Income Tax Exemption : దేశంలో చాలా మంది స్థితిమంతులు, పదవీ విరమణ చేసినవారు, ఏ పనీ చేయలేని పెద్దవారు ఇళ్ల అద్దెలు, స్థిరాస్తి మీద వచ్చే ఆదాయంతో తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కొంత మందికి అయితే జీవనాధారంగా ఈ అద్దెలే ఉన్నాయి. భారతదేశంలో స్థిరాస్తి, ఆద్దె ద్వారా వచ్చేవి ఆదాయపు పన్ను చట్టాల పరిధిలోకి వస్తాయి. అయితే ఇలా పన్ను ఉండటం వల్ల వారికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అయితే కొన్ని చిట్కాలు ఉపయోగించి ఈ పన్నులపై రాయితీ పొందవచ్చు. ఉమ్మడిగా ఆస్తిని కొనుగోలు చేసినా ఈ పన్ను మినహాయింపులు ఉంటాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
స్థిరాస్తి అద్దె ఆదాయంపై ఇన్కం ట్యాక్స్
ఒక వ‌్యక్తికి వస్తున్న ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో ఇతర ఆదాయాలు ఏమి లేకుండా రూ.2.50 లక్షల కంటే తక్కువ అద్దె ఆదాయం వస్తుంటే, వాటిపై ఎటువంటి పన్ను ఉండదు. ఎందుకంటే ఆదాయ పన్ను విధించదగిన కనీస పరిమితి కంటే ఇది తక్కువగా ఉంది. ఒకవేళ వచ్చే ఆర్థిక సంవత్సరంలో అద్దె ఆదాయం 20% పెరిగినా, మీపై ఎలాంటి అదనపు పన్ను పడదు.
అద్దె ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్
ప్రామాణిక తగ్గింపు (స‌్టాండర్డ్ డిడక్షన్) ద్వారా స్థిరాస్తి యాజమాని, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. స్థిరాస్తి అద్దెల నుంచి ఆదాయాన్ని పొందే యజమాని నికర ఆస్తి విలువపై 30% స్టాండర్డ్ డిడక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి స్థిరాస్తి నుంచి రూ.3.60 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడని అనుకోండి. మున్సిపల్ పన్నులు రూ.30 వేలు అయితే, అతడు పొందే నికర అద్దె రూ.3.30 లక్షలు. నికర అద్దె విలువపై 30% స్టాండర్డ్ డిడక్షన్ రూ.99,000. దీంతో స్థిరాస్తిపై అతనికి వచ్చే ఆదాయం రూ.2,31,000గా మాత్రమే పరిగణిస్తారు. కనుక అతనికి ఆదాయపు పన్ను వర్తించదు. ఎన్ఆర్ఐలు కూడా స్థిరాస్తి నుంచి వచ్చే ఆదాయంపై ప్రామాణిక తగ్గింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇంటి రుణంపై పన్ను ప్రయోజనం
మీరు గృహ రుణంపై చెల్లించే వడ్డీపై కూడా పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) ప్రకారం, ఇంటి యజమాని సొంతింటి గృహ రుణంపై చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు. అయితే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టయితే రూ.2 లక్షల పరిమితి వర్తించదు. అలాగే, అసలు మొత్తంపై అతడు రూ.1.50 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందొచ్చు. మీరు గృహ రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసి, సదరు ఆస్తి నుంచి అద్దె రూపంలో ఆదాయం పొందుతున్నట్లైతే, సదరు రుణానికి సంబంధించి చెల్లించిన వడ్డీ, అసలుపై రూ.3.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.