Hospital Daily Cash Insurance Policy : నేటి కాలంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, బీమా సంస్థలు విస్తృత రక్షణ కల్పించే ఇన్సూరెన్స్ పాలసీలను, సేవలను అందిస్తున్నాయి. వీటితోపాటు అనుబంధ పాలసీలను కూడా ఇస్తున్నాయి. అలాంటి వాటిల్లో 'హాస్పిటల్ డైలీ క్యాష్' ఒకటి. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఇది అదనపు రక్షణ కల్పిస్తుంది. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రోజువారీ ఖర్చులు!
ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్సకు మాత్రమే కాదు, అదనపు ఖర్చులు ఎన్నో అవుతుంటాయి. సాధారణంగా ఇలాంటి వ్యయాలకు బీమా కంపెనీలు ఎలాంటి పరిహారం ఇవ్వవు. ఇలాంటప్పుడే 'హాస్పిటల్ డైలీ క్యాష్' కవర్ లాంటి అనుబంధ పాలసీలు అక్కరకు వస్తాయి. పేరులో ఉన్నట్లుగానే, ఆసుపత్రిలో చేరినప్పుడు రోజువారీగా అయ్యే ఖర్చులను ఇవి పాలసీదారునికి అందిస్తాయి.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, చికిత్స కోసం అయిన మొత్తాన్ని ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ చెల్లిస్తుంది. దీనికి అనుబంధంగా తీసుకున్న హాస్పిటల్ డైలీ క్యాష్ పాలసీ అనేది, పాలసీదారుడు ఆసుపత్రిలో ఉన్నన్నాళ్లు, అతనికి రోజువారీ ఖర్చులను చెల్లిస్తుంది. ఇది ఆసుపత్రి బిల్లులకు అదనం.
ఉదాహరణకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు రోజుకు రూ.500 చెల్లించేలా ఈ హాస్పిటల్ డైలీ క్యాష్ అనే అనుబంధ పాలసీని ఎంచుకున్నారని అనుకుందాం. అప్పుడు ఆసుపత్రిలో ఎన్ని రోజులు చికిత్స తీసుకుంటే, అన్ని రోజులపాటు రోజువారీగా రూ.500 చొప్పున బీమా సంస్థ చెల్లిస్తుంది. మీ ఖర్చులు రూ.800 అయినా, రూ.400 అయినా బీమా సంస్థ దాని గురించి పట్టించుకోదు. ముందే నిర్ణయించుకున్న మొత్తాన్ని మీకు చెల్లిస్తుంది. అయితే ఈ అనుబంధ పాలసీని విడిగా తీసుకునే అవకాశాన్ని కూడా కొన్ని బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. ప్రాథమిక పాలసీకి అనుబంధంగా జోడించుకుంటే, రోజువారీ నగదు పరిమితి అనేది పాలసీ విలువలో 1 శాతం వరకు ఉండవచ్చు. లేదా స్థిరంగా ఇంత మొత్తం అందిస్తామనే నిబంధనతోనూ పాలసీ ఇవ్వవచ్చు. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలాగానే దీన్ని జీవిత కాలం పాటు రెన్యువల్ (పునరుద్ధరణ) చేసుకోవచ్చు. ఈ అనుబంధ పాలసీ ప్రీమియం చాలా తక్కువగానే ఉంటుంది.
నిబంధనలు తెలుసుకోవాలి!
రోజువారీగా ఎంత మొత్తం చెల్లిస్తారనేది ఆయా బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఈ మొత్తం రోజుకు రూ.500 నుంచి కొన్ని వేల రూపాయల వరకూ ఉండవచ్చు. ఏదైనా క్లిష్ట సమస్యతో ఐసీయూలో చేరాల్సి వస్తే, రోజువారీ నగదు భత్యం కొన్ని రోజులకు రెట్టింపు అవుతుంది.