Home Loan Repayment By Using EPF Funds : ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన తర్వాత, బ్యాంకులు గృహ రుణాల వడ్డీ రేట్లను బాగా పెంచాయి. అందుకే చాలా మంది ఈ హోమ్ లోన్ భారాన్ని తగ్గించుకోవడానికి, ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)ని ఉపయోగించాలని భావిస్తున్నారు. అయితే ఇలా చేసే ముందు కచ్చితంగా కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రిటైర్మెంట్ ప్లాన్
ఈపీఎఫ్ స్కీంలోని సెక్షన్ 68బీబీ ప్రకారం, మీరు హోమ్ లోన్ రీపేమెంట్ కోసం పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం మీ ఇంటిని వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా పీఎఫ్ సభ్యుని పేరుపై నమోదు చేయాలి. అలాగే మీరు పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేయాలంటే, కనీసం పదేళ్ల పీఎఫ్ రికార్డును కలిగి ఉండాలి. ఐదేళ్ల నిరంతర సర్వీసు పూర్తయిన తర్వాత విత్‌డ్రా చేసుకునే పీఎఫ్ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు.
వడ్డీ రేట్లను బేరీజు వేసుకోవాలి!
ఈపీఎఫ్ అనేది మీరు పదవీ విరమణ చేసిన తరువాత ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అయితే మీరు కెరీర్ ప్రారంభ దశలో ఉన్నట్లయితే, ఈపీఎఫ్లోని డబ్బులు విత్‌డ్రా చేసుకున్న ఫర్వాలేదు. ఎందుకంటే, మీ ఈపీఎఫ్ ఖాతాలోకి మరిన్ని నిధులను తిరిగి జమ చేసుకునేందుకు తగినంత సమయం ఉంటుంది.