Home Loan Eligibility : సొంత ఇల్లు కల నెరవేరాలంటే బడ్జెట్, దీర్ఘకాలిక ప్రణాళిక, దూరదృష్టి ఎంతో అవసరం. చాలా మంది ఎక్కువగా బ్యాంకు రుణంతో ఇంటిని కొనుగోలు లేదా నిర్మించడానికి చేయడానికి ప్రయత్నిస్తారు. మనదేశంలో అయితే హోమ్ లోన్ పొందడం అంత తేలికైన పనికాదు. ఇంటి రుణం అనేది చాలా పెద్ద అప్పు. కాబట్టి బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు దరఖాస్తుదారుడికి సంబంధించి చాలా ఆర్థిక విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. కొన్నిసార్లు ఒకే క్రెడిట్ స్కోర్ ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ హోమ్ లోన్ దరఖాస్తుల విషయంలో వేర్వేరు ఫలితాలను పొందొచ్చు. ఇంటి రుణాల విషయంలో క్రెడిట్ స్కోరు ఒక్కటే ప్రమాణికంగా చూడరు. దీంట్లో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. హోమ్ లోన్ ఆమోదించే ముందు బ్యాంకులు ఎలాంటి విషయాలపై దృష్టిపెడతాయో ఇప్పడు తెలుసుకుందాం.
ఇప్పటికే లోన్స్ ఉంటే
హోమ్ లోన్ కోసం అఫ్లై చేసుకునే వ్యక్తికి ఇప్పటికే రుణాలు కలిగి ఉండి, ఈఎంఐలు చెల్లిస్తున్నట్లయితే అతని ఇంటి రుణ అర్హత తగ్గుతుంది. రుణాలు తీసుకుని రీపేమెంట్స్ సరిగ్గా చేయనివారిని, ఆర్థిక సంస్థలు అనుమానాస్పదంగా చూస్తాయి. అందుచేత సమయానికి ఈఎమఐ చెల్లించడం ఎంతో ముఖ్యం.
వయసు
ఇంటి రుణం మంజూరు చేసే సమయంలో బ్యాంకులు చూసే ముఖ్యమైన అంశం వయసు. 30-50 సంవత్సరాల వయసు గల వ్యక్తులకు రుణం ఇవ్వడానికి ఉత్తమ అభ్యర్థులుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అలాంటి వారికి రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగిన సంఖ్యలో పని సంవత్సరాలు మిగిలి ఉంటాయి. రుణాన్ని తిరిగి చెల్లించే ఆదాయ శక్తి సామర్థ్యాలు ఈ వయసులో ఉన్నవారికి ఎక్కువగా ఉంటాయని బ్యాంకులు నమ్ముతాయి.
స్థిరత్వం
ఇంటి రుణాన్ని ఆమోదించే ముందు ఆర్థిక సంస్థలు వ్యక్తి స్థిరత్వాన్ని పరిశీలిస్తాయి. తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండే వ్యక్తుల పట్ల బ్యాంకులు ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉంటాయి. సందేహాస్పదమైన ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీలో పనిచేసే వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపించవు. కనీసం 3 సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడతాయి. ఒక వ్యక్తి సంస్థలో ఎంత ఎక్కువ కాలం పనిచేస్తే, రుణం పొందే అవకాశాలు అంత ఎక్కవగా ఉంటాయి.
వృత్తి
హోమ్ లోన్ అంచనా వేసేటప్పుడు పరిగణనలోకి తీసుకునే ముఖ్యమైన అంశాలలో చేసే పని ఒకటి. ఎందుకంటే, తిరిగి చెల్లించే సామర్థ్యం వ్యక్తికి వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. స్థిరమైన ఉద్యోగం, స్థిర ఆదాయం ఉన్న వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ /ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, వారి స్థిరంగా ఉండే ఉద్యోగాల కారణంగా బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తాయి. అలాగే, ప్రముఖ సంస్థల్లో పనిచేసే వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు ఇంటి రుణాన్ని పొందేవారిలో తరువాతి వరుసలో ఉంటారు. స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, కాంట్రాక్టర్లకు రుణం మంజూరు చేసేటప్పడు ఆర్థిక సంస్థలు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. అలాంటి వారు అకౌంట్ పుస్తకాలూ, గత కొద్ది ఏళ్ల ఐటీఆర్ లాంటివి సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి ప్రస్తుత జీతంతో పాటు రాబోయే సంవత్సరాల్లో వేతనం పెరుగుదల ఇంటి రుణం పొందడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
జీవిత భాగస్వామి ఆదాయం
దరఖాస్తుదారుడి జీవిత భాగస్వామి ఆదాయాన్ని బట్టి, ఉమ్మడిగా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందువల్ల రుణ అర్హత పెరగడమే కాకుండా, రుణం అధికంగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు ఉన్నందున, ఇది మెరుగైన రీపేమెంట్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. భార్య పేరు మీద ఇంటి రుణం మంజూరయితే, వడ్డీ సాధారణ రేటు కంటే ఐదు బేసిస్ పాయింట్లు తక్కువ ఉంటుందనే విషయం తెలుసుకోవాలి.
ఆస్తి ఉండే ప్రదేశం
రుణం త్వరగా మంజూరు చేయడానికి ఆస్తి (ఇల్లు) ఉండే ప్రాంతం లేదా ప్రదేశాన్ని బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. త్వరగా అమ్ముకునే ప్రదేశంలో ఉన్న ఆస్తిని బ్యాంకులు ఉత్తమమైనదిగా చూస్తాయి. దూరంగా ఉన్న ఇళ్లతో పోలిస్తే, పాఠశాలలు, షాపింగ్ ప్లాజాలు, రైల్వే స్టేషన్, ఆసుపత్రులకు దగ్గరగా సౌకర్యంగా ఉండే ఆస్తులపై రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకోబోయే ఇళ్లు చాలా దూరంలో ఉంటే, బ్యాంకులు రుణాన్ని ఆమోదించడంలో ఆసక్తి చూపవు. ఈ అంశాలతో పాటుగా దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోరు, డౌన్ పేమెంట్ మొత్తం, రుణ కాలవ్యవధి లాంటి అంశాలు రుణ ఆమోదంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
సెకండ్ హ్యాండ్ కారు కోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి సుమా! - Second Hand Car Loan
PMAY అర్బన్ 2.0 స్కీమ్ కింద కోటి ఇళ్లు మంజూరు - అర్హులెవరు? ప్రయోజనాలు ఏంటి? - Pradhan Mantri Awas Yojana