తెలంగాణ

telangana

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​ రిజెక్ట్ అయ్యిందా? కారణాలు ఇవే - ఇలా చేస్తే సమస్యకు చెక్​! - Health insurance claim

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 2:35 PM IST

Health Insurance Claim Process : నేటి కాలంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే వేలల్లో, లక్షల్లో ఖర్చవుతోంది. ఇలాంటి సందర్భంలో ఆరోగ్య బీమా ఎంతో అండగా నిలుస్తుంది. అయితే కొన్ని సార్లు ఇన్సూరెన్స్ కంపెనీలు మీ క్లెయింను తిరస్కరిస్తూ ఉంటాయి. దీనికి గల కారణాలు ఏమిటో తెలుసా?

Health Insurance Claim Process
Health Insurance Claim Process (ANI)

Health Insurance Claim Process :ఇన్సూరెన్స్ అంటే పాలసీదారుడికి, బీమా సంస్థకు మధ్య జరిగిన ఒక ఒప్పందం. ఇందులో మన వైపు నుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా బీమా సంస్థలు క్లెయిం చెల్లించేందుకు నిరాకరిస్తాయి. దీనికి అనేక కారణాలుంటాయి. అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

పూర్తి వివరాలను ఇవ్వకపోవడం
ఆరోగ్య బీమా కోసం దరఖాస్తు చేసేప్పుడు పాలసీదారులు కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుతారు. చాలా సందర్భాల్లో పాలసీ దరఖాస్తులో ఏముందో చూడకుండానే సంతకం చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడూ ఇలాంటి తప్పులే చేస్తుంటారు. కొన్నిసందర్భాల్లో తెలిసి, మరికొన్నిసార్లు తెలియకుండానే పొరపాటు సమాచారం ఇస్తుంటారు. పేరులో అక్షర దోషాలు, వయసు తప్పుగా పేర్కొనడం, ధూమపానం, మద్యపానం మొదలైన అలవాట్లు, వార్షిక ఆదాయం వివరాలను వెల్లడించకపోవడం లాంటివి సాధారణంగా జరిగే తప్పులు. బీమా క్లెయిం చేసుకోవాల్సి వచ్చినప్పుడు బీమా సంస్థ ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తుంది. పొరపాటు జరిగినట్లు తేలితే, బీమా సంస్థలు క్లెయిం చెల్లించడానికి నిరాకరించే ప్రమాదం ఉంటుంది.

ఏం చేయాలి?
ప్రస్తుతం ప్రతి పాలసీకీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) తప్పనిసరి. మీ పేరు, పుట్టిన తేదీ వివరాలతోపాటుగా మొబైల్‌ నంబరు, ఇ-మెయిల్‌ వంటి వివరాలను సరిగ్గా ఉండేలా చూసుకోండి. వీటి ఆధారంగానే కేవైసీ పూర్తి చేయాలి. ఆధార్​కార్డు, పాన్‌ కార్డ్​లో ఉన్న పేరునే పాలసీ పత్రంలోనూ ఉండేలా చూసుకోండి. ఇక వ్యాధుల విషయానికి వస్తే, ఏవైనా వివరాలు పూర్తిగా వెల్లడించలేదు అని భావిస్తే వాటిని ఇ-మెయిల్‌ ద్వారా బీమా సంస్థకు తెలియజేయండి. పాలసీ పునరుద్ధరించుకునే సమయంలోనైనా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు క్లెయిం సందర్భంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది.

వైద్య చరిత్ర
ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు గతంలో మీరు చేయించుకున్న వైద్యానికి సంబంధించి కచ్చితమైన వివరాలను అందించాలి. అన్ని వివరాలూ చెబితే పాలసీ ఇవ్వరని అనుకోవద్దు. మీరు ఆరోగ్య వివరాలు, అలవాట్లు దాచి పెట్టి పాలసీ తీసుకున్నా, ఏదైనా సందర్భంలో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు వైద్యుడికి అన్ని వివరాలూ చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు మోసపూరితంగా పాలసీ తీసుకున్నారని బీమా సంస్థ అంటుంది.

ఏం చేయాలి?
పాలసీ తీసుకునేటప్పుడు పూర్తి పారదర్శకంగా ఉండాలి. పాలసీ ఇచ్చేదీ, లేనిదీ బీమా సంస్థ అప్పుడే నిర్ణయిస్తుంది. కొన్నిసార్లు కాస్త అధిక ప్రీమియాన్ని వసూలు చేయొచ్చు. కానీ, మున్ముందు ఎలాంటి ప్రశ్నలూ వేయకుండా క్లెయింను ఆమోదిస్తుంది.

30 రోజుల వరకూ
కొత్తగా పాలసీ తీసుకున్నప్పుడు '30 రోజుల వరకు సాధారణ వేచి ఉండే వ్యవధి' ఉంటుంది. కొన్ని బీమా సంస్థలు 15 రోజుల వరకూ వేచి ఉండే వ్యవధిని ఇస్తుంటాయి. మరికొన్ని పాలసీలు ఎలాంటి వ్యవధి లేకుండా వెంటనే అమల్లోకి వస్తున్నాయి. కాబట్టి, మీరు తీసుకునే పాలసీ వెయిటింగ్ పీరియడ్ గురించి కచ్చితంగా తెలుసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ విషయంలోనూ వ్యాధి నిర్ధరణ అయిన తర్వాత కనీసం 30 రోజులు పాలసీదారుడు జీవించి ఉంటేనే క్లెయిం ప్రయోజనాలు అందుతాయి. కొన్ని ముందస్తు వ్యాధులకు 24-48 నెలల పాటు వేచి ఉండే వ్యవధి ఉంటుంది.

ఏం చేయాలి?
పాలసీ తీసుకునేటప్పుడే మినహాయింపులు, వేచి ఉండే వ్యవధి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. పాలసీ పత్రంలో ఉన్న వివరాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో బీమా వర్తించదో కూడా తెలుసుకొని ఉండాలి.

పునరుద్ధరించుకోండి
చాలా మంది బీమా పాలసీలు తీసుకున్నప్పటికీ సకాలంలో వాటిని పునరుద్ధరించుకోవడం గురించి పట్టించుకోరు. కొంతమంది పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత ఉండే 30 రోజుల అదనపు గడువులో పునరుద్ధరణ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు. గడువు తీరుతుందన్న నాలుగైదు రోజుల ముందే పాలసీని పునరుద్ధరించుకోవడం మంచిది.

వెంటనే తెలియజేయండి
బీమా సంస్థ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో కాకుండా వేరే దగ్గర చేరినప్పుడు, లేదా అత్యవసరంగా ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లినప్పుడు బీమా సంస్థకు వెంటనే సమాచారం ఇవ్వాలి. పాలసీదారుడి బదులుగా అతని నామినీ లేదా ఇతర వ్యక్తులూ బీమా కంపెనీకి సమాచారం ఇవ్వవచ్చు.

మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ నచ్చలేదా? సింపుల్​గా రద్దు చేసుకోండిలా! - Free Look Period In Insurance

హోం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఏజెంటును కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలివే! - Home Insurance Questions

ABOUT THE AUTHOR

...view details