Petrol Diesel Price Cut :అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. లీటర్‌కు రూ.2-3 చొప్పున తగ్గించేందుకు వీలుందని పేర్కొంది. ఇప్పటికే వివిధ సంస్థలు ధరలు తగ్గొచ్చని అంచనాలు వెలువరించగా, ఇప్పుడు ఇక్రా కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. చమురు సంస్థ మార్జిన్లు బాగా పెరిగాయని, అందుకే పెట్రోల్- డీజిల్ ధరలు తగ్గే వీలుందని అభిప్రాయపడింది.
బాగా మెరుగయ్యాయి: ఇక్రా
అయితే భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు సగటు ధర సెప్టెంబర్‌లో బ్యారెల్‌కు 74 డాలర్లుగా ఉంది. 2024 మార్చిలో ఆ మొత్తం 83-84 డాలర్లుగా ఉందని ఇక్రా తాజాగా పేర్కొంది. అంతర్జాతీయంగా ఇప్పటికే తగ్గిన ముడి చమురు ధరలతో ప్రభుత్వ రంగ చమురు సంస్థ మార్జిన్లు బాగా మెరుగయ్యాయని వెల్లడించింది. ఇలానే స్థిరంగా కొనసాగితే రిటైల్ చమురు ధరలను తగ్గించొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది.
ఎలాంటి మార్పు లేదు!
అంతర్జాతీయ ధరలతో పోల్చినప్పుడు చమురు కంపెనీల పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ.15, డీజిల్‌పై రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీశ్ కుమార్ వెల్లడించారు. 2024 మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 చొప్పున తగ్గించారని తెలిపారు. అప్పటి నుంచి వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదని అన్నారు. ఒకవేళ అంతర్జాతీయంగా ఇవే ధరలు కొనసాగితే రూ.2-3 చొప్పున తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు.
అయితే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలను సవరించుకునే వెసులుబాటు 2021 నుంచే అమల్లో ఉన్నా, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరల్లో ఎలాంటి మార్పు చేయడం లేదు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దిల్లీలో ధరలు ఇలా!
Petrol Diesel Price Today :ప్రస్తుతంహైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.