తెలంగాణ

telangana

ETV Bharat / business

HDFC నుంచి 4 కొత్త బిజినెస్‌ క్రెడిట్‌ కార్డులు - బెనిఫిట్స్​ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! - Business News

HDFC New Business Credit Cards : ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ ఇటీవలే నాలుగు సరికొత్త బిజినెస్‌ క్రెడిట్‌ కార్డులను మార్కెట్​లోకి విడుదల చేసింది. వ్యాపారులకు, స్వయం ఉపాధి పొందే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అందుకే వాటి ఫీచర్లు, జాయినింగ్‌ ఫీజు సహా ఇతర బెనిఫిట్స్​ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

HDFC New Business Credit Cards
HDFC New Business Credit Cards

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 5:22 PM IST

HDFC New Business Credit Cards :మామూలుగా రోజువారి ఖర్చుల కోసం మనం వాడే వ్యక్తిగత క్రెడిట్​ కార్డుల మాదిరిగానే, వ్యాపారుల కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల బిజినెస్​ క్రెడిట్​ కార్డులు ఉంటాయి. వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు వీటిని వ్యాపార అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా మన వాణిజ్య అవసరాలు తీరడమే కాకుండా ఇతర అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇటీవలే ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ నాలుగు బిజినెస్‌ క్రెడిట్‌ కార్డులను ఇండియన్​ మార్కెట్​లో రిలీజ్​ చేసింది. వాటి ఫీచర్లు, జాయినింగ్‌ ఫీజు సహా ఇతర బెనిఫిట్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బిజ్‌ఫస్ట్​
ఈ బిజ్‌ఫస్ట్‌ కార్డు పొందాలంటే వార్షిక ఐటీఆర్‌ విలువ రూ.6 లక్షలకు పైనే ఉండాలి. 55 రోజుల వరకు వడ్డీరహిత క్రెడిట్‌ లభిస్తుంది. ఈఎంఐ చెల్లింపులపై 3 శాతం క్యాష్‌ పాయింట్లు ఉంటాయి. యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రానిక్స్‌, పేజాప్‌ లావాదేవీలపై 2 శాతం, ఇతర వ్యయాలపై 1 శాతం క్యాష్‌ పాయింట్లు పొందవచ్చు. ఈ కార్డు జాయినింగ్‌, రెన్యూవల్​ ఫీజును రూ.500గా నిర్ణయించారు. పన్నులు అదనం. తొలి ఏడాదిలో రూ.50 వేలు ఖర్చు చేస్తే తర్వాత సంవత్సరం రెన్యువల్‌ ఫీజును రద్దు చేస్తారు. స్విగ్గీ డైనౌట్‌ ద్వారా చేసే ఫుడ్​ ఆర్డర్​ బిల్లు చెల్లింపులపై 20 శాతం వరకు డిస్కౌంట్​ లభిస్తుంది.

బిజ్‌ఫస్ట్​ బిజినెస్ క్రెడిట్​ కార్డ్​

బిజ్‌గ్రో
ఈ బిజ్‌గ్రో కార్డు పొందాలన్నా వార్షిక ఐటీఆర్‌ విలువ రూ.6 లక్షలకు పైనే ఉండాలి. దీనిపైనా 55 రోజుల వరకు వడ్డీరహిత క్రెడిట్ దొరుకుతుంది. వ్యాపార అవసరాల కోసం చేసే ప్రతి రూ.150 ఖర్చుపై రెండు క్యాష్‌ పాయింట్లు లభిస్తాయి. బిల్లులు, పన్ను చెల్లింపులు, బిజినెస్​ సంబంధిత ప్రయాణాల కోసం చేసే ఖర్చులపై 10 పాయింట్లు లభిస్తాయి. ఈ కార్డు జాయినింగ్‌, రెన్యూవల్​ ఫీజు రూ.500గా ఉంది. పన్నులు అదనం. తొలి ఏడాదిలో రూ.1 లక్ష ఖర్చు చేస్తే తర్వాత సంవత్సరం పునరుద్ధరణ రుసుమును మాఫీ చేస్తారు. రూ.400 నుంచి రూ.5,000 ఇంధన బిల్లులపై ఒక శాతం ఫ్యుయల్‌ సర్‌ఛార్జ్‌ రద్దు ప్రయోజనం ఉంటుంది. అలా గరిష్ఠంగా ఒక బిల్లింగ్‌ సైకిల్‌లో రూ.250 వరకు రాయితీని పొందవచ్చు. స్విగ్గీ డైనౌట్‌ ద్వారా చేసే రెస్టారంట్‌ బిల్లు చెల్లింపులపై 20 శాతం వరకు రాయితీ లభిస్తుంది.

బిజ్‌గ్రో బిజినెస్ క్రెడిట్​ కార్డ్​

బిజ్‌పవర్‌
బిజ్‌పవర్‌ కార్డును తీసుకోవాలంటే వార్షిక ఐటీఆర్‌ విలువ రూ.12 లక్షలకు పైగా ఉండాలి. ఈ కార్డు ద్వారా వ్యాపార అవసరాల కోసం చేసే ప్రతి రూ.150 ఖర్చుపై ఐదు రివార్డు పాయింట్లను పొందవచ్చు. బిల్లులు, పన్ను చెల్లింపులు, వ్యాపార ప్రయాణాలకు కూడా ఈ రివార్డు పాయింట్లు వర్తిస్తాయి. ఈ కార్డుపై కూడా 55 రోజుల వడ్డీరహిత క్రెడిట్ లభిస్తుంది. అంటే ఈ సమయంలో లోన్స్​ లేదా ఇతర చెల్లింపులు క్లియర్​ చేస్తే ఎలాంటి వడ్డీ పడదు. ఈ కార్డు జాయినింగ్‌, రెన్యూవల్​ ఫీజు రూ.2,500. పన్నులు ఉంటాయి. తొలి ఏడాదిలో కనీసం రూ.4 లక్షలు ఖర్చు చేస్తే తర్వాత సంవత్సరం రెన్యువల్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. దేశీయంగా 16 ఎయిర్‌పోర్టు లాంజ్‌ యాక్సెస్‌లను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఒక త్రైమాసికంలో రూ.75,000 ఖర్చు చేస్తే మరో రెండు అదనపు లాంజ్​ యాక్సెస్‌లు లభిస్తాయి. ప్రయారిటీ పాస్‌ను ఉపయోగించి అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ లాంజ్‌ యాక్సెస్​ సౌలభ్యాన్ని పొందవచ్చు.

బిజ్‌పవర్‌ బిజినెస్ క్రెడిట్​ కార్డ్​

బిజ్‌బ్లాక్‌
బిజ్‌బ్లాక్‌ క్రెడిట్​ కార్డులోనూ ప్రతి రూ.150 బిజినెస్​ ఖర్చులపై ఐదు రివార్డు పాయింట్లు లభిస్తాయి. దీనిని పొందాలంటే వార్షిక ఐటీఆర్‌ విలువ రూ.21లక్షలకు పైనే ఉండాలి. దేశీయ ఎయిర్‌పోర్ట్​లలో అపరిమిత లాంజ్‌ యాక్సెస్‌ సౌకర్యం ఉంటుంది. ట్యాలీ, ఆఫీస్‌ 365, ఏడబ్ల్యూఎస్, గూగుల్‌, క్రెడ్‌ఫ్లో, అజూర్‌ సహా ఇతరత్రా బిజినెస్‌ ప్రొడక్టివిటీ టూల్స్‌పై వెచ్చించే ఖర్చులకూ రివార్డు పాయింట్లను పొందవచ్చు. ఒక స్టేట్‌మెంట్‌ సైకిల్‌లో కనీసం రూ.50 వేలు ఖర్చు చేస్తే రివార్డు పాయింట్లను క్లెయిం చేసుకునే వీలు ఉంటుంది. బిజ్‌బ్లాక్‌ కార్డు జాయినింగ్‌, రెన్యూవల్​ ఫీజును రూ.10,000గా నిర్ణయించారు. పన్నులు అదనంగా ఉంటాయి. కార్డు పొందినప్పటి నుంచి 90 రోజుల్లోగా రూ.1.5 లక్షల నగదు ఖర్చు చేస్తే మొదటి ఏడాది రెన్యూవల్‌ ఫీజును రద్దు చేస్తారు.

బిజ్‌బ్లాక్‌ బిజినెస్ క్రెడిట్​ కార్డ్​

ఈ కార్డులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఆసక్తి ఉన్నవారు జీఎస్‌టీ రిటర్నులు, ఐటీఆర్‌లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, మర్చంట్‌ పేమెంట్‌ నివేదికలను ఉపయోగించి ఈ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 65 ఏళ్ల వయసున్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న భారత పౌరులు ఎవరైనా ఈ కార్డులను పొందవచ్చు.

2024 మార్చి నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

బైక్ ఇన్సూరెన్స్​ తీసుకోవాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details