Google EU Court Huge Fine :టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్‌కు యూరప్‌లో భారీ షాక్‌లు తగిలాయి. ఈయూ యాంటీట్రస్ట్ చట్టాల ఉల్లంఘనల కేసులో రూ.2.4 బిలియన్ యూరోల(రూ. 22.67 వేల కోట్లు) పెనాల్టీ విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఈయూ కోర్టు సమర్థించింది. దీంతో గూగుల్ చివరి అప్పీల్ అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా కోర్టు విధించిన పెనాల్టీని కట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. మరో కేసులో యాపిల్ 13 బిలియన్ యూరోలు(రూ.1.19 లక్షల కోట్లు) బ్యాక్ ట్యాక్స్ చెల్లించాల్సిందేనని ఈయూ కోర్టు ఆదేశించింది.
డిజిటల్ ప్రకటనల వ్యాపారంలో గుత్తాధిపత్యం, యాంటీ ట్రస్ట్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు గూగుల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ఈయూ కమిషన్ 2017లో 2.4 బిలియన్ యూరోలు పెనాల్టీ విధించింది. గూగుల్ తన ప్రత్యర్థుల కంటే సొంత షాపింగ్ కంపారిజన్ సర్వీస్‌కే మొగ్గు చూపిందని కమిషన్ ఆ సమయంలో పేర్కొంది. దీనిపై గూగుల్ యురోపియన్ జనరల్ కోర్టులో అప్పీల్ చేసింది. అక్కడ కూడా ఈ టెక్ దిగ్గజానికి చుక్కెదురైంది. కమిషన్ నిర్ణయంతో జనరల్ కోర్టు ఏకీభవించింది. దీంతో గూగుల్, యురోపియన్ కోర్టు ఆఫ్ జస్టిస్(ECJ)లో అప్పీల్ చేసింది. ఈ విషయంపై విచారణ జరిగిన ఈయూ టాప్ కోర్టు, జనరల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. గూగుల్ 2.4 బిలియన్ యూరోల ఫైన్ కట్టాలని ఆదేశించింది.
యాపిల్ రూ.1.19 లక్షల కోట్లు కట్టాల్సిందే!
మరో కేసులో యాపిల్ రూ.13 బిలియన్ యూరోలు(రూ.1.19 లక్షల కోట్లు) బ్యాక్ ట్యాక్స్ చెల్లించాల్సిందేనని ఈయూ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దిగువ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈయూ సభ్య దేశమైన ఐర్లాండ్‌లో యాపిల్ పన్ను చెల్లింపులపై 2014లో ఈయూ కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో 2016లో దర్యాప్తు పూర్తి చేసిన ఈయూ కమిషన్, దాదాపు 2 దశాబ్దాలుగా యాపిల్ సంస్థ, ఐర్లాండ్ ప్రభుత్వం నుంచి చట్టవిరుద్ధమైన పన్ను ప్రయోజనాలు పొందిందని తేల్చింది. అందుకుగానూ 13 బిలియన్ యూరోలను ఐర్లాండ్ ప్రభుత్వం రికవర్ చేసుకోవాల్సిందిగా ఆదేశించింది.