తెలంగాణ

telangana

ETV Bharat / business

2025లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్​- ఆర్థిక సర్వే అంచనాలు ఇవే! - 2025 GOLD PRICE FORECAST

2025లో తగ్గుముఖం పట్టనున్న బంగారం ధరలు! - ఆర్థిక సర్వేలు ఏం చెప్తున్నాయంటే?

Economic Survey On Gold Prices
Economic Survey On Gold Prices (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2025, 7:07 PM IST

2025 Gold Price Forecast : కొన్ని రోజులుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.84,700 వద్ద ట్రేడయ్యింది. గోల్డ్‌ కొనాలనే ఆలోచన చేయడానికే సామాన్యులు భయపడుతున్నారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2025లో బంగారం ధరలు తగ్గి, వెండి ధరలు కాస్త పెరిగే అవకాశం ఉందని 2024-25 ఆర్థిక సర్వే అంచనా వేసింది.

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు జనవరి 31న పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. ఈ సర్వేకు మద్దతుగా ప్రపంచ బ్యాంకు అక్టోబర్ 2024 కమోడిటీ మార్కెట్ల అంచనాలను ఉదహరించారు. దీని ప్రకారం, కమోడిటీ ధరలు 2025లో 5.1%, 2026లో 1.7% వరకు తగ్గుతాయని అంచనా. ఆయిల్‌ ధరలు తగ్గనుండగా, నేచురల్‌ గ్యాస్‌ ధరలు పెరుగుతాయి. లోహాలు, వ్యవసాయ ముడి పదార్థాలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

బంగారం ధరలు తగ్గుముఖం!
2025లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సర్వే తెలిపింది. విదేశీ మారక నిల్వలు మారడమే దీనికి ప్రధాన కారణమని ట్రేడ్ వర్గాల మాట. ఇక ప్రపంచ అనిశ్చితి కారణంగా చాలా సెంట్రల్ బ్యాంకులు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి. 2024లో బంగారు కడ్డీ నిల్వలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ డిమాండ్ బంగారం ధరలు పెరగడానికి దోహదపడింది. అయితే వచ్చే ఏడాది డిమాండ్ తగ్గుముఖం పట్టి ధరలు దిగివచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

వెండి ధరలు పెరగవచ్చు!
వెండి ధరలు మాత్రం పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా వెండి ధరలు పెరగవచ్చని నివేదిక సూచించింది. విలువైన లోహాలలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న పెట్టుబడిదారులు 2025లో వెండిని ఆకర్షణీయమైన ఎంపికగా భావించవచ్చని పేర్కొంది.

ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
బంగారం ధరలు తగ్గడం, వెండి ధరల పెరుగుదల భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మిశ్రమ ప్రభావాలను చూపుతాయి. బంగారం ధరలు తగ్గితే వినియోగదారులకు, ముఖ్యంగా ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ క్షీణత పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. అయితే వెండి ధరల పెరుగుదల బులియన్ మార్కెట్‌కు కొంత బ్యాలెన్స్‌ని తీసుకొస్తుందని సర్వే తెలిపింది.

ద్రవ్యోల్బణం, వాణిజ్యం, విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ఈ ధరల కదలికలను నిశితంగా పరిశీలించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. వీటితోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, యూఎస్‌ డాలర్ ఆధిపత్యం వంటివి కమోడిటీ ధరలను ప్రభావితం చేయవచ్చు.

మన పక్క దేశంలో అతి తక్కువ ధరకే బంగారం- వీసా లేకుండానే వెళ్లొచ్చు- కొనేందుకు రూల్స్ ఇవీ!

నదిలో 33 టన్నుల బంగారం! పాక్ దశ తిరుగుతుందా? కష్టాల నుంచి గట్టెక్కుతుందా?

ABOUT THE AUTHOR

...view details