Gas Price Today :లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ను తగ్గిస్తూ ఆయిల్ మార్కెట్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.19 తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. మే1వ తేదీ నుంచి వాణిజ్య సిలిండర్ ధర రూ.19 తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెట్ కంపెనీలు తెలిపాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి.
ప్రధాన నగరాల్లో ఇలా!
19 కిలోల వాణిజ్య ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ ధర మే 1 నుంచి దిల్లీలో రూ.1764.50 ఉండగా, తాజాగా రూ.19 తగ్గడం వల్ల రూ.1745.50కి అందుబాటులో ఉంటుంది. కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1879 ఉండగా తాజా తగ్గింపుతో రూ.1859కు తగ్గింది. 19 కిలోల ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గి రూ.1994.50కు చేరింది.
గత నెలలోనూ తగ్గింపు
గత నెలలోనూ 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.30.50 తగ్గింది. ఏప్రిల్ 1న వాణిజ్య సిలిండర్ల ధరపై రూ. 30.50 తగ్గించాయి. మార్చిలో రూ. 25.50, ఫిబ్రవరిలో రూ. 14 పెంచగా, జనవరి 1న వాణిజ్య సిలిండర్ల ధరపై రూ. 1.50 స్వల్పంగా తగ్గించాయి. 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గింది. అయితే ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 802.50గా ఉంది. ఉజ్వల స్కీమ్ కింద బెనిఫిట్ పొందే వారికి మాత్రం సిలిండర్ కేవలం రూ. 502కే లభిస్తోంది. వీరికి రూ.300 వరకు సబ్సిడీ వస్తుంది.
విమర్శల వల్లేనా?
ఇంధన ధరలను నియంత్రించడంలో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఇండి కూటమి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ ఈ నిర్ణయం వెలువడింది. ధరల తగ్గుదల వెనుక ఉన్న కచ్చితమైన కారణాలు వెల్లడికానప్పటికీ, అంతర్జాతీయ చమురు ధరల్లో, పన్నుల విధానాల్లో మార్పుల వల్లే వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గినట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి.