Angel Networks In India :వ్యాపారం పెట్టాలనే ఆలోచన చేసే వాళ్లంతా 'ఏంజెల్ ఇన్వెస్టర్' అనే పదం గురించి చాలాసార్లు వినే ఉంటారు. ఏంజెల్ అంటే దైవదూత. దైవదూతలా వచ్చి సహాయం చేస్తారనే అర్థం వచ్చేలా 'ఏంజెల్ ఇన్వెస్టర్' అనే పదం ఏర్పడింది. వ్యాపారంలో కొంత వాటాను తీసుకొని దానికి బదులుగా పెట్టుబడిని సమకూర్చడం 'ఏంజెల్ ఇన్వెస్టర్' ప్రత్యేకత. మంచి పెట్టుబడి అవకాశాల కోసం ఏంజెల్ ఇన్వెస్టర్లు నిత్యం వెతుకుతుంటారు. తాము ఎంచుకునే కంపెనీలకు వారు పెట్టుబడితో పాటు మెంటార్‌షిప్‌ను కూడా అందిస్తారు.
ప్రస్తుతం మన దేశంలో 125కుపైగా యాంజెల్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ఏంజెల్ నెట్‌వర్క్‌లు దాదాపు 540 ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్లలో పాల్గొని, దాదాపు 470కిపైగా స్టార్టప్‌లను మద్దతును ప్రకటించాయి. అయితే పెట్టుబడుల సమీకరణ కోసం ఏంజెల్ ఇన్వెస్టర్లను ఎలా కనెక్ట్ కావాలో తెలియక చాలామంది యువ ఎంట్రప్రెన్యూర్లు సతమతం అవుతుంటారు. ఏంజెల్ ఇన్వెస్టర్లతో కనెక్ట్ చేసే దేశంలోని ప్రఖ్యాత ఏంజెల్ నెట్‌వర్క్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్టార్టప్‌లకు సాయం చేసే ప్రఖ్యాత ఏంజెల్ నెట్‌వర్క్స్
వీ ఫౌండర్ సర్కిల్ (We Founder Circle) : వీ ఫౌండర్ సర్కిల్ (WFC)లో 9వేల మందికిపైగా ఇన్వెస్టర్లు ఉన్నారు. దీన్ని 2020 సంవత్సరంలో నీరజ్ త్యాగి, గౌరవ్ వీకే సింఘ్వి, భావనా భట్నాగర్, వికాస్ అగర్వాల్, సౌరభ్ దేవ్ స్థాపించారు. దాదాపు 100కుపైగా ఇన్వెస్ట్‌మెంట్ డీల్స్‌లో ఈ నెట్‌వర్క్‌కు చెందిన ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. భారత్‌తో పాటు అమెరికా, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, జర్మనీ, స్విట్జర్లాండ్‌లలో కూడా ఈ నెట్‌వర్క్ విస్తరించి ఉంది.
ఆహ్ వెంచర్స్ (ah! Ventures) : ఆహ్ వెంచర్స్ అనే ఏంజెల్ నెట్‌వర్క్‌ను 2012లో అభిజీత్ కుమార్, హర్షద్ లహోటీ స్థాపించారు. ఇందులో 3వేల మందికిపైగా ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. దాదాపు 62వేల మంది ఎంట్రప్రెన్యూర్లు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. ఆహ్ వెంచర్స్ ఇప్పటివరకు 121 స్టార్టప్‌లలో 183 పెట్టుబడులను పెట్టింది. దీని ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో విలువ రూ.394 కోట్లు. ఇప్పటిదాకా 16 ఎగ్జిట్‌లు నమోదయ్యాయి.
హైదరాబాద్ ఏంజెల్స్ : హైదరాబాద్ ఏంజెల్స్ అనే ఇన్వెస్టర్ల నెట్‌వర్క్ ప్రధానంగా టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ రంగ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతుంటుంది.
ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ :ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్‌కు మనదేశంలో ఎంతో పేరుంది. ఇందులో ఎంతోమంది సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్లు, బిజినెస్‌మెన్లు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. కొత్తగా ఏర్పడే స్టార్టప్‌లకు పెట్టుబడిని అందించి వాటికి మెంటార్‌షిప్‌ను అందించడం ఈ నెట్‌వర్క్ ప్రత్యేకత. టెక్నాలజీ రంగ స్టార్టప్‌లకు సహాయం చేయడంపై ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ ఫండ్ ఫోకస్ చేస్తుంటుంది.
లీడ్ ఏంజెల్స్ :భిన్న విభిన్న రంగాల స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడమే లీడ్ ఏంజెల్స్ నెట్‌వర్క్ లక్ష్యం. ఇది కూడా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు చేదోడు అందిస్తుంటుంది.
చెన్నై ఏంజెల్స్ : విభిన్న రంగాల స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడం చెన్నై ఏంజెల్స్ లక్ష్యం. అయితే వీరి ప్రధాన ఫోకస్ టెక్నాలజీ స్టార్టప్‌లపై ఉంది.
లెట్స్ వెంచర్ :లెట్స్ వెంచర్‌ను శాంతి మోహన్, సంజయ్ ఝా కలిసి 2013లో స్థాపించారు. వారు ఇప్పటివరకు 930 ఇన్వెస్ట్‌మెంట్లు చేశారు. వాటి విలువ దాదాపు రూ.92వేల కోట్లు ఉంటుందని అంచనా. లెట్స్ వెంచర్ నెట్‌వర్క్‌లో దాదాపు 19,530 మంది ఇన్వెస్టర్లు ఉన్నారు.