RBI Floating Rate Bonds :మనలో చాలా మందిఅధిక వడ్డీని ఇచ్చే పెట్టుబడి మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. పైగా తమ డబ్బుకు రక్షణ ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారిలో ఎక్కువ మంది బ్యాంకులు అందించేఫిక్స్‌డ్ డిపాజిట్లను (FD) ఆశ్రయిస్తుంటారు. ఇది మంచి విషయమే. ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. కానీ, ఎఫ్‌డీ కంటే అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ హామీ ఉన్న స్కీమ్ ఒకటి ఉంది. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన 'ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్, 2020'. ఈ బాండ్లపై అధిక వడ్డీతో పాటు ఆర్‌బీఐ సార్వభౌమ గ్యారెంటీ కూడా ఉంటుంది. అందువల్ల మన డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే?
ఆర్బీఐఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో వడ్డీ రేట్లు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటైన నేషనల్ సేవింగ్స్ స్కీమ్ (ఎన్‌ఎస్‌సీ)తో ఈ వడ్డీ రేట్లు ముడిపడి ఉంటాయి. ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటును పెంచితే ఈ బాండ్ల రేటు కూడా పెరుగుతుంది. ఒకవేళ ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటు తగ్గితే ఈ బాండ్లపై వచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్‌ఎస్‌సీ అందించే వడ్డీ రేటుతో పోలిస్తే, ఈ బాండ్లపై 0.35 శాతం ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది.
ఆర్‌బీఐ ఈ జులై 1న 2024 జులై-డిసెంబర్ అర్ధ వార్షికానికి సంబంధించిన వడ్డీ రేటును ఖరారు చేసింది. దీని ప్రకారం, ఆర్‌బీఐ బాండ్లపై 8.05 శాతం వడ్డీ రేటు లభించనుంది. ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు 7.7 శాతం వడ్డీ రేటు మాత్రమే లభిస్తోంది. అయితే ఈ ఆర్బీఐఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ల వడ్డీ రేట్లు ప్రతి 6 నెలలకోకసారి మారుతుంటాయి. ఏడాదికి రెండు సార్లు (జనవరి 1, జులై 1) ఈ వడ్డీ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంటుంది.
ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ఆర్‌బీఐ ప్రవేశ పెట్టిన ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ కాలావధి 7 సంవత్సరాలు. ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన తరువాత, ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉండదు. అయితే సీనియర్ సిటిజన్లు మాత్రం కనీస లాక్-ఇన్ పీరియడ్ తర్వాత ముందుగానే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 60-70 ఏళ్ల మధ్య వయసున్న వారికి 6 సంవత్సరాలు; 70-80 ఏళ్ల మధ్య వయసున్న వారికి 5 సంవత్సరాలు; 80 ఏళ్లు దాటిన వారికి 4 ఏళ్లు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.