తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​- EFTA మధ్య కుదిరిన డీల్- రూ.8లక్షల కోట్ల పెట్టుబడులు- ధరలు తగ్గే వుస్తువులివే! - efta india trade agreement

EFTA India Trade Agreement : ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్‌ తెలిపారు. కాగా, భారత్‌-ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (EFTA) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. ఈ నేపథ్యంలో భారత పరిశ్రమల్లో తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ, సుంకాలు లేకుండా ఈఎఫ్‌టీఏ దేశాల్లో విక్రయించుకోవచ్చు.

EFTA India Trade Agreement
EFTA India Trade Agreement

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 9:09 AM IST

EFTA India Trade Agreement :భారత్‌-ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (EFTA) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదరింది. ఈ క్రమంలో ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్‌ పేర్కొన్నారు. దీంతో స్విట్జర్లాండ్‌ వాచీలు, కట్‌ అండ్‌ పాలిష్డ్‌ వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం రానుంది.

ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్‌, ఐస్‌లాండ్‌, లిక్టన్‌స్టైన్‌, నార్వే సభ్య దేశాలు. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్‌టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఎఫ్‌టీఏలో పెట్టుబడుల హామీకీ చట్టబద్దత లభించడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఏడాది సమయం పట్టే వీలుంది.

ప్రయోజనాలు ఏంటంటే?
భారత పరిశ్రమల్లో తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ, సుంకాలు లేకుండా ఈఎఫ్‌టీఏ దేశాల్లో విక్రయించుకోవచ్చు. ప్రాసెస్‌ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకూ సుంకాల్లో రాయితీలు లభిస్తాయి. మన ఉత్పత్తులపై 2024 జనవరి నుంచే స్విట్జర్లాండ్‌ సుంకాలను తొలగించింది.

  • భారత్​లో కూడా ఈఎఫ్‌టీఏ ఉత్పత్తుల్లో 95.3 శాతానికి మినహాయింపు ఇస్తోంది. అక్కడ నుంచి బంగారం భారత్​లోకి అధికంగా దిగుమతి అవుతున్నా, కస్టమ్స్‌ సుంకం (15%) విషయంలో మినహాయింపు ఇవ్వలేదు. బౌండ్‌రేటు (అత్యంత అనుకూల దేశాలుగా పరిగణించి ఇచ్చేది)ను మాత్రం 1% తగ్గించి, 39% చేసింది.
  • ఐరోపా సమాఖ్యకు చేరేందుకు భారత కంపెనీలు స్విట్జర్లాండ్‌ను బేస్‌గా వినియోగించుకోవచ్చు. ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌, హెల్త్‌ సైన్సెస్‌, పునరుత్పాదక ఇంధనం, వినూత్నత-పరిశోధనల్లో సాంకేతిక సహకారం సులువు అవుతుంది.
  • డెయిరీ, సోయా, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను మాత్రం మినహాయింపుల జాబితాలో చేర్చలేదు. అందువల్ల వీటికి సుంకాల్లో రాయితీలు అమలు కావు.2008 నుంచి భారత్‌, ఈఎఫ్‌టీఏ మధ్య సుదీర్ఘంగా ఈ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆదివారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద పత్రాలపై భారత్‌- నాలుగు దేశాల ఈఎఫ్‌టీఏ సంతకాలు చేశాయి. 2008లో ప్రారంభమైన ఈ చర్చలు 2013 నవంబరులో ఆగిపోగా, 2016 అక్టోబరు నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. 21 విడతలుగా చర్చించాక, ఒక కొలిక్కి వచ్చాయి.
  • ఈ ఒప్పందం ప్రకారం, వచ్చే 15 ఏళ్లలో ఈఎఫ్‌టీఏ మన దేశంలో 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,30,000 కోట్ల) పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో సరకు వాణిజ్యం, మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్‌), సేవలు, పెట్టుబడి ప్రోత్సాహం, సహకారం, ప్రభుత్వ సేకరణ, సాంకేతిక అడ్డంకులను తొలగించుకోవడం వంటి 14 అంశాలున్నాయి. దీంతో పాటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు నిబంధనలు సడలించాల్సి ఉంటుంది.
  • భారత్‌-ఈఎఫ్‌టీఏల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 27.23 బి.డాలర్లు ఉండగా, 2022-23లో 18.65 బి.డాలర్లకు తగ్గింది. వీటిల్లో భారత్​తో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా స్విట్జర్లాండ్‌ ఉండగా, నార్వే తర్వాతి స్థానంలో ఉంది. భారత్‌-స్విట్జర్లాండ్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో 17.14 బి.డాలర్లు (1.34 బి.డాలర్ల ఎగుమతులు, 15.79 బి.డాలర్ల దిగుమతులు) కాగా, భారత వాణిజ్య లోటు 14.45 బి.డాలర్లుగా నమోదైంది.
  • స్విట్జర్లాండ్‌ నుంచి భారత్‌ ఎక్కువగా బంగారం (12.6 బి.డాలర్లు), యంత్రాలు (409 మి.డాలర్లు), ఔషధాలు (309 మి.డాలర్లు), కోకింగ్‌ అండ్‌ స్టీమ్‌ కోల్‌ (380 మి.డాలర్లు), ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంట్లు, ఆర్థోపెడిక్‌ అప్లియెన్సెస్‌ (296 మి.డాలర్లు), వాచీలు (211.4 మి.డాలర్లు), సోయాబీన్‌ ఆయిల్‌ (202 మి.డాలర్లు) చాక్లెట్లు (7 మి.డాలర్లు) తదితర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. రసాయనాలు, రత్నాభరణాలు, కొన్ని రకాల టెక్స్‌టైల్స్‌, దుస్తులను భారత్ ఎగుమతి చేస్తోంది.
  • స్విట్జర్లాండ్‌ నుంచి భారత్​ 2000 ఏప్రిల్‌ నుంచి 2023 డిసెంబరు మధ్య 10 బి.డాలర్ల (రూ.83,000 కోట్ల) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పొందింది. భారత్​లో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో ఇది 12వ స్థానంలో ఉంది. నార్వే నుంచి 721.52 మి.డాలర్లు, ఐస్‌లాండ్‌ నుంచి 29.26 మి.డాలర్లు, లిక్టన్‌స్టైన్‌ నుంచి 105.22 మి.డాలర్లు మన దేశానికి తరలి వచ్చాయి.

స్టార్టప్ కోసం లోన్ కావాలా? ఈ ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ స్కీమ్స్​ గురించి తెలుసుకోండి!

రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details