Employee Deposit Linked Insurance Scheme:ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ దాదాపు ఈపీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) ఈ అకౌంట్లను నిర్వహిస్తుంటుంది. జాబ్ చేసే ప్రతి ఎంప్లాయి నెలనెలా తన ప్రాథమిక జీతంలో 12 శాతం పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. సరిగ్గా అంతే మొత్తంలో వారి యజమాని లేదా కంపెనీ ఆ అకౌంట్‌కి జమ చేస్తారు. ఈ డబ్బును ఉద్యోగులు తమ అత్యవసర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఇంత వరకు అందరికీ తెలుసు. కానీ, చాలా మంది పీఎఫ్ చందాదారులకు.. ఒక్క రూపాయి చెల్లించకుండా ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా రూ.7 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ పొందవచ్చనే విషయం తెలియదు. అసలేంటి.. EDLI స్కీమ్? ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? ప్రయోజనాలేంటి? దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
EDLI స్కీమ్ అంటే ఏమిటంటే?:కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమే.. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI). దీన్ని 1976లో ప్రవేశపెట్టింది కేంద్రం. ఈ స్కీమ్ కింద.. ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ ఏకమొత్తంలో బీమా మొత్తాన్ని అందుకుంటారు.
ఎవరెవరికి వర్తిస్తుందంటే?:EDLI స్కీమ్ ఈపీఎఫ్‌లోని క్రియాశీల చందాదారులందరికీ వర్తిస్తుంది. అంటే.. EPFO ఖాతాను కలిగి ఉన్న ఏ ఉద్యోగి అయినా ఆటోమేటిక్‌గా EDLI స్కీమ్‌కు అర్హులు అవుతారట. అదేవిధంగా.. ఈ బీమా ఇన్సూరెన్స్ పొందడానికి ఉద్యోగి ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు. ఉద్యోగులు ఈపీఎఫ్‌కు చందా సహకారం అందిస్తే సరిపోతుంది. EDLI నిబంధనల ప్రకారం యజమాని.. ఉద్యోగి బేసిక్, డీఏలో 0.50% లేదా గరిష్ఠంగా నెలకు రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌వో చట్టం వర్తించే అన్ని ఫ్యాక్టరీలు, ఇతర సంస్థల ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.
ఆర్థిక ప్రయోజనాలివే!
- ఉద్యోగి మరణిస్తే.. అతడిపై ఆధారపడిన కుటుంబసభ్యులు EDLI స్కీమ్ కింద లభించే బెనిఫిట్స్ పొందేందుకు అర్హులు.
- సర్వీసులో ఉన్న ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో అర్హతగల కుటుంబసభ్యులకు రూ.7 లక్షల గరిష్ఠ ఆర్థిక ప్రయోజనాన్ని ఏక మొత్తంగా 'EPFO' అందిస్తుంది.
- మరణించిన సభ్యుడు మరణానికి ముందు 12 నెలల పాటు నిరంతర ఉద్యోగ సర్వీసులో ఉంటే.. కనీస హామీ ప్రయోజనం కింద అర్హతగల కుటుంబ సభ్యులకు రూ.2.50 లక్షలు అందిస్తారు.
- అలాగే.. బీమా ప్రయోజనం నేరుగా నామినీ లేదా చట్టపరమైన వారసుడి బ్యాంకు అకౌంట్‌కు జమ చేస్తారు.