Economic Survey 2024 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు, ఆర్థిక సర్వేను లోక్‌సభ ముందు ఉంచడం ఆనవాయితీ. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరం పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టలేదు. దీనితో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించిన తరువాత లోక్‌సభ రేపటికి (గురువారానికి) వాయిదా పడింది.
ఆర్థిక సర్వేకు బదులుగా రివ్యూ
పార్లమెంట్ సంప్రదాయం ప్రకారం, పూర్తిస్థాయి బడ్జెట్‌కు ముందే ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. తాత్కాలిక బడ్జెట్ ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఎన్నికల అనంతరం అధికారం చేపట్టే ప్రభుత్వమే, పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది. జూన్- జులై నెలల్లో మిగిలిన ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. అయితే ఇది ఎన్నికల సంవత్సరం కావడం వల్ల, మోదీ ప్రభుత్వం ఎకనామిక్ సర్వే విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావించారు. కానీ మోదీ సర్కార్ ఆర్థిక సర్వేకు బదులుగా 'ఇండియన్ ఎకానమీ - ఏ రివ్యూ' అనే పేరుతో ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. గత పదేళ్లలో భారత్ ఆర్థిక ప్రస్థానం గురించి దీనిలో వివరించారు. అలాగే సమీప భవిష్యత్‌లో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండనుందో కూడా ఈ నివేదికలో ప్రస్తావించారు.
డిజిటల్ బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు (ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్ వార్షిక పద్దును కూడా ప్రవేశపెట్టనున్నారు. అయితే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నారు సీతారామన్. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్ ద్వారా ఆమె బడ్జెట్‌ను చదివి వినిపించనున్నారు.
బడ్జెట్ యాప్
బడ్జెట్‌లోని సమాచారాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూనియన్ బడ్జెట్ అనే ఒక వెబ్‌సైట్‌ను, అలాగే ఒక యాప్‌ను తీసుకొచ్చింది. వీటిలో బడ్జెట్ పీడీఎఫ్ ప్రతులు, బడ్జెట్ ప్రసంగం, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు సహా మొత్తం బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటాయి.