తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్​ కార్డ్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్!

Credit Card Usage Tips : ప్రస్తుతం దేశంలో క్రెడిట్​ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే క్రెడిట్​ కార్డులు ఉపయోగించే విషయంలో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Credit Card Usage Tips in telugu
Credit Card Usage Tips

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 1:45 PM IST

Credit Card Usage Tips : దేశంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. బ్యాంకులు సులభంగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తుండటం వల్ల 10 కోట్లకు పైగా క్రెడిట్‌ కార్డులు ఇప్పుడు వినియోగంలోకి వచ్చాయి. క్రెడిట్ కార్డులపై పలు రకాల ఆఫర్లు లభిస్తుండటం వల్ల చాలా మంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే క్రెడిట్​ కార్డులను చాలా జాగ్రత్తగా వాడాలి. లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోవడం తథ్యం. అందుకే ఈ ఆర్టికల్​ క్రెడిట్​ కార్డును ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

తగిన కార్డు ఎంపిక
భారతీయ మార్కెట్‌లోక్రెడిట్‌ కార్డులు తీసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఏ కార్డు ఎంచుకోవాలన్నదే క్లిష్టమైన ప్రక్రియ. అందుబాటులో ఉన్న క్రెడిట్‌ కార్డులలో మీ అవసరాలకు ఏది సరిపోతుందో చూసుకోండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ తరువాతే మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే క్రెడిట్ కార్డును ఎంచుకోండి.

రుసుముల గురించి తెలుసుకోండి
ఆర్థిక ఉత్పత్తి ఏదైనా సరే దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు పొందగలం. క్రెడిట్‌ కార్డులు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. కార్డు తీసుకున్నప్పుడు దానికి వర్తించే ఛార్జ్​లు ఏమిటి? రుసుములు తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలు, షరతులు గురించి ముందుగానే తెలుసుకోవాలి. కార్డుతో పాటు వచ్చే సమాచారాన్ని పూర్తిగా చదవాలి. అప్పుడే మీకు క్రెడిట్‌ కార్డు గురించి పూర్తి అవగాహన వస్తుంది. కార్డు ఉచితం అంటే ఎలాంటి రుసుములు ఉండవనుకోవద్దు. వార్షిక రుసుములు, ఆలస్యపు చెల్లింపు, విదేశీ లావాదేవీలు ఇలా ప్రతిదానికీ ఒక నిర్ణీత రుసుము ఉంటుంది. వీటన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ క్రెడిట్‌ కార్డుకు చెల్లించే ప్రతి రుసుమూ మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు.

అధిక ఖర్చులకు దారితీయొచ్చు
ఆర్థిక నిర్వహణలో బడ్జెట్‌ కీలకపాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు అనుకోని ఖర్చుల కోసం క్రెడిట్‌ కార్డు వాడుతుంటాం. మరికొందరు రివార్డు పాయింట్లను దృష్టిలో పెట్టుకొని క్రెడిట్ కార్డు ద్వారా వస్తు, సేవలు కొంటూ ఉంటారు. మరికొందరు క్యాష్​బ్యాక్​ ప్రయోజనాల కోసం ఆశపడుతూ ఉంటారు. వీటి మాయలో పడి, స్తోమతకు మించి అధిక వ్యయం చేస్తుంటారు. దీని వల్ల క్రమంగా అప్పుల ఊబిలోకి దిగిపోతారు. కనుక, నెలవారీ ఖర్చులకు డెబిట్‌ కార్డును వినియోగించడమే ఉత్తమం.

వ్యయ పరిమితిని సెట్ చేసుకోవాలి
క్రెడిట్​ కార్డ్ ట్రాన్షాక్షన్స్​ కోసం వ్యయ పరిమితులను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల కార్డు మోసాలను నియంత్రించవచ్చు. అనవసర, అధిక కొనుగోళ్లను తగ్గించేందుకు వ్యయ పరిమితి సెట్ చేసుకోవడం చాలా మంచిది. అవసరం లేని సందర్భాల్లో అంతర్జాతీయ లావాదేవీలను పూర్తిగా నిష్క్రియం చేయండి. దీనివల్ల కార్డు పోయినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

గడువు తేదీలోగా బిల్లు చెల్లించాలి
కార్డు బిల్లులను సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు 30 శాతం వరకూ వడ్డీ విధించే అవకాశాలున్నాయి. పైగా ఫైన్​లు ఉంటాయి. సిబిల్​ స్కోర్​పైనా దీని ప్రభావం పడుతుంది. కాలక్రమేణా ఇవి పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది. కనీస బకాయి మొత్తం అనే ఆకర్షణలో చిక్కుకుపోవద్దు. సాధ్యమైనంత వరకూ సకాలంలో పూర్తి బిల్లును చెల్లించడమే ఉత్తమం.

నగదు కోసం క్రెడిట్​ కార్డ్​ వాడొద్దు
క్రెడిట్‌ కార్డులతో నగదును తీసుకున్నప్పుడు 24-36 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఈ వడ్డీ తక్షణమే అమల్లోకి వస్తుంది. కనుక, కొనుగోళ్లకు కోసం మాత్రమే క్రెడిట్ కార్డు వాడాలి. నగదు కోసం క్రెడిట్‌ కార్డులను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకపోవడమే మంచిది.

రివార్డు పాయింట్లు
క్రెడిట్‌ కార్డులు రివార్డు పాయింట్లను అందిస్తాయి. వీటిని గడువు తేదీకి ముందే వినియోగించుకునేందుకు ప్రయత్నించాలి. చెల్లింపులు, టూర్లు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్ల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లు, క్యాష్​ బ్యాక్​ లాంటివి మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. అవసరం మేరకు వినియోగించినప్పుడు క్రెడిట్‌ కార్డులు పలు ప్రయోజనాలను అందిస్తాయి. వ్యయ ప్రణాళికలను సిద్ధం చేసుకొని, ఆర్థిక క్రమశిక్షణ పాటించినంత కాలం ఇవి మనకు ఉపయోగకరంగా ఉంటాయి.

ఊరట ఇవ్వని కేంద్ర బడ్జెట్! పన్ను విధానంలో మార్పుల్లేవ్!

పేటీఎం యూజర్లకు అలర్ట్- ఆ రోజు నుంచి డిపాజిట్స్ బంద్​!

ABOUT THE AUTHOR

...view details