తెలంగాణ

telangana

ETV Bharat / business

సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారా? ఈ టాప్​-6 టిప్స్ మీ కోసమే! - Business Launch Tips

Business Launch Tips : మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే మీకు ముందు కావాల్సింది స్పష్టమైన విజన్. ముందుచూపుతో, ముందస్తు ప్రణాళికతో బిజినెస్‌ను మొదలుపెట్టే వారిని విజయం తప్పక వరిస్తుంది. అయితే వీటితో పాటు ఇంకో 6 కీలకమైన టిప్స్‌ను యువ ఆంత్రప్రెన్యూర్స్​ (Entrepreneurs) తప్పకుండా తెలుసుకోవాలి.

Types of entrepreneurship
What is Entrepreneurship? (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 12:13 PM IST

Business Launch Tips :భారతదేశంలో ఏదైనా కొత్త బిజినెస్‌ను ప్రారంభించడం అంత ఈజీ కాదు. అందుకోసం మనం చాలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మనకు సమగ్రమైన వ్యాపార ప్రణాళిక ఉండాలి. పట్టు విడవకుండా చివరిదాకా మార్కెట్లో నిలిచే సామర్థ్యం, వ్యూహం మన దగ్గర ఉండి తీరాలి. వీటన్నింటికి మించి బలమైన సంకల్పం తప్పకుండా ఉండాలి. వ్యాపారం ప్రారంభించాక ఎదురయ్యే సవాళ్లపై ముందే ఒక అవగాహనకు రావడం వల్ల ముందుచూపుతో వ్యవహరించే అవకాశం దక్కుతుంది. వ్యాపారం ప్రారంభించాక కూడా మనం నిత్యవిద్యార్థిలా మసులుకోవాలి. వ్యాపారాన్ని నిర్వహించే క్రమంలో ఎదురయ్యే అనుభవాలను పాఠాలుగా నేర్చుకుంటూ ముందుకుసాగాలి. మార్కెట్ అవసరాలు, వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కంపెనీలో మార్పులు చేసే మానసిక సంసిద్ధత కూడా వ్యాపారవేత్తల్లో ఉండాలి. అందుకే ఈ ఆర్టికల్​లో ఆంత్రప్రెన్యూర్స్ అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన 6 కీ పాయింట్స్ గురించి తెలుసుకుందాం.

1. మార్కెట్ రీసెర్చ్ - ధ్రువీకరణ : ఏదైనా బిజినెస్‌ను ప్రారంభించే ముందు దానికి సంబంధించిన మార్కెట్‌పై రీసెర్చ్ చేయాలి. దీనివల్ల మనం ఉత్పత్తి చేసే వస్తువులు/సేవలకు ఉన్న డిమాండ్‌పై ఒక అవగాహన వస్తుంది. సదరు వ్యాపార విభాగంలో ఉన్న పోటీదారులు ఎవరు? వారి ప్రోడక్ట్స్/సేవల ధరలు, క్వాలిటీ ఏమిటి? ఏడాదిలో సగటున ఎంత మందిని కస్టమర్లుగా మార్చుకోవచ్చు? అనే అంశాలపై క్లారిటీ రావాలంటే, మార్కెట్ రీసెర్చ్ చేయడం తప్పనిసరి. క్లయింట్లు, పరిశ్రమ నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రోడక్ట్స్/సేవల నాణ్యతను మెరుగుపర్చడంపై ఆంత్రప్రెన్యూర్లు ఫోకస్ చేయాలి.

2. బిజినెస్ ప్లాన్ రూపకల్పన : బిజినెస్ ప్లాన్ లేకుండా బిజినెస్‌ను మొదలుపెట్టడం అనేది కరెక్టు కాదు. దీనివల్ల మీ బిజినెస్ ఎటువైపు పోతుంది అనే దానిపై మీకే క్లారిటీ కుదరదు. మీ కంపెనీ టార్గెట్ ఏమిటి? మీ కస్టమర్లు ఎవరు? మీ వస్తువులు/ సేవల నాణ్యతతో పాటు ధరల రేంజ్​ ఎలా ఉంటుంది? మార్కెటింగ్ కోసం ఏమేం చేస్తారు? వచ్చే ఏడాది కాలానికి వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి అవసరాలు ఏమిటి? అనే వివరాలు బిజినెస్ ప్లాన్‌లో కవర్ అవుతాయి. అందుకే దీన్ని తయారు చేసుకునే విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదు. నిజాయితీతో కూడిన బిజినెస్ ప్లాన్‌ను రెడీ చేసి, మీకు రుణాలు ఇచ్చే వారికి, వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారికి అందించాలి.

3. ఆర్థిక సంసిద్ధత : వ్యాపారం ముందుకు సాగాలంటే మనకు బలమైన ఆర్థిక మూలాలు ఉండాలి. లేదంటే కనీసం ఆర్థిక వనరులను వివిధ మార్గాల ద్వారా సమీకరించుకునే సామర్థ్యమైనా ఉండి తీరాలి. అందుకే వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కొన్ని నెలల పాటు నిరాటంకంగా నిర్వహించడానికి ఎన్ని నిధులు అవసరం అవుతాయనే దానిపై ముందే ఒక అంచనాకు రావాలి. మార్కెటింగ్ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, ఊహించని ఇబ్బందుల కోసం వ్యయాలు వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని నిధులను రెడీ చేసుకోవాలి. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్, రుణాలు, ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడి, వ్యక్తిగత పొదుపు ద్వారా డబ్బును పొందొచ్చు.

4. నియంత్రణ, చట్టపరమైన అంశాలు : బిజినెస్‌ను ప్రారంభించే ముందు దాన్ని ప్రభుత్వం, స్థానిక సంస్థల వద్ద తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. అవసరమైన అన్ని రకాల లైసెన్సులను సక్రమ పద్ధతుల్లో తీసుకోవాలి. పన్ను చట్టాలు, మేధో సంపత్తి హక్కులు, పరిశ్రమ సమాఖ్యల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఈ క్రమంలో ఏవైనా సందేహాలు వస్తే కంపెనీ లా నిపుణులు, సీఏలు, పరిశ్రమ నిపుణులను సంప్రదించవచ్చు.

5. బ్రాండింగ్, మార్కెటింగ్ వ్యూహం : మన ప్రోడక్ట్స్/సేవలకు బ్రాండింగ్ చేసుకోవడం తప్పనిసరి. దీనివల్ల ప్రజల్లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఈ ఇంప్రెషన్‌కు ప్రతిఫలంగా మనం కొంతమేర ధరలను పెంచుకోవచ్చు. బ్రాండింగ్ వల్ల సేల్స్ వేగంగా పెరుగుతాయి. బ్రాండింగ్ ఎలా చేయాలి? ఇందుకోసం ఎలాంటి ప్రచారం చేయాలి? మీరు టార్గెట్ చేసిన కస్టమర్లను ఆకట్టుకునేలా బ్రాండింగ్ ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతకాలి. మేధోమథనం చేస్తే వీటికి సరైన సమాధానం దొరికి తీరుతుంది. వెరసి, మార్కెట్లో మన ఉత్పత్తులు/సేవలు బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు బాటలు పడతాయి.

6. రిస్క్ మూల్యాంకనం, అత్యవసర ప్రణాళిక :ఏ వ్యాపారంలోనైనా రిస్క్ ఉంటుంది. మార్కెట్‌లో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలు, మన బిజినెస్​ను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఊహించని పరిస్థితులు ఎదురయ్యే ముప్పు సైతం ఉంటుంది. ఇలాంటివి ఎదురైతే ఏం చేయాలి? ఎలా గట్టెక్కాలి? అనే దానిపైనా వ్యాపారం ప్రారంభించడానికి ముందే కొంత స్పష్టతను ఏర్పర్చుకోవాలి. ఇందుకోసం ఇప్పటికే ఆయా విభాగాల్లో వ్యాపారాలు చేస్తున్న వారిని సంప్రదించి సలహాలు తీసుకోవాలి. ఈ అంశంపై ప్రచురితమైన నివేదికలను చదవాలి. నిపుణులను సంప్రదించాలి. మనం చేసే వ్యాపార రంగంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుర్కొనేందుకు బ్యాకప్ ప్లాన్‌ను రెడీగా ఉంచుకోవాలి.

వరమాల వేడుకలో అనంత్, రాధిక ఫుల్ ఫన్- ఒకరినొకరు ప్రామిస్​ చేసుకుని! - Anant Radhika Marriage

అట్టహాసంగా అనంత్​, రాధిక వెడ్డింగ్- అంబానీల పెళ్లికి హాజరైన అతిరథ మహారథులు - Anant Ambani Marriage

ABOUT THE AUTHOR

...view details