Budget 2025 Agriculture :కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025లో రైతులకు శుభవార్త చెప్పారు. వెనుకబడిన జిల్లాలో వ్యవసాయాన్ని ప్రోత్సాహంచే విధంగా 'ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన' ప్రకటించారు. అంతే కాకుండా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంచుతున్నట్లు తెలిపారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన ఉంటుందని చెప్పారు.
వంద జిల్లాల్లో అమలు
తక్కువ దిగుబడి, ఆధునిక పంటలు, సగటు కంటే తక్కువ క్రెడిట్ పరిమితి కలిగిన వంద జిల్లాల్లో ప్రధానమంత్రి ధన్ ధ్యాన్ కృషి యోజనను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 1.7 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నట్లు చెప్పారు. 'తొలిదశలో అభివృద్ధి చెందుతున్న వంద జిల్లాల్లో పథకం అమలు చేస్తున్నాం. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు మా ప్రభుత్వం జాతీయ వంటనూనె విత్తనాల మిషన్‌ను అమలు చేస్తోంది. మన రైతులకు దేశ అవసరాలు, అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది' అని ఆర్థిక మంత్రి తెలిపారు.
7.7 కోట్ల మందికి లబ్ధి
కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. "కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 7.7కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారులకు స్వల్పకాలిక రుణాలు ఇవ్వబోతున్నాం. యూరియా ఉత్పత్తిలో స్వావలంబన కోసం మా ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో 3 డార్మెంట్ యూరియా ప్లాంట్లను తిరిగి ప్రారంభించింది. యూరియా సరఫరాను మరింత పెంచేందుకు 12.70లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో అసోంలోని నామ్‌రూప్‌లో మరో ప్లాంటును ఏర్పాటు చేయనున్నాం" అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ప్రత్యేక కార్యక్రమంతో ఉత్పత్తిలో స్వాలంబన
యువత, రైతులు, మహిళలు లక్ష్యంగా గ్రామాల శ్రేయస్సు, పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ద్వారా పప్పు ధాన్యాలు కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. కంది, మినప, ఎర్రపప్పు ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు ఆరేళ్ల కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కూరగాయలు, పండ్ల సాగు పెంపుతో పాటు లాభదాయక ధరలు అందించేందుకు ఓ సమగ్ర కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.