తెలంగాణ

telangana

ETV Bharat / business

కేంద్ర ప్రభుత్వ సూపర్ ఇన్సూరెన్స్ - నెలకు రూ.36 చెల్లిస్తే రూ.2 లక్షల జీవిత బీమా - Best Life Insurance Plan - BEST LIFE INSURANCE PLAN

PMJJBY Scheme Details : అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి ఇన్సూరెన్స్ పాలసీలు కుటుంబాన్ని ఆదుకుంటాయి. అయితే, చాలా మంది ఎక్కువ ప్రీమియం కారణంతో వాటిని తీసుకోవడానికి ముందుకు రారు. అలాంటి వారు.. పీఎంజేజేబీవై స్కీమ్​లో చేరితే కేవలం నెలకు రూ.36 చొప్పున చెల్లించి రూ.2లక్షలు బీమా సదుపాయం పొందొచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

BEST LIFE INSURANCE PLAN
PMJJBY Scheme (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 9:17 AM IST

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Scheme :ఎవరి ఇంట్లోనైనా కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంత కాలం జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ.. అదే అనుకోని పరిస్థితుల కారణంగా ఆ వ్యక్తి మరణిస్తే ఇంటిల్లిపాది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి టైమ్​లో.. జీవిత బీమా(Life Insurance) చాలా ఉపయోగపడుతుంది. అయితే.. చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన ఉన్నా.. ప్రీమియం ఎక్కువ ఉంటుందన్న కారణం వల్ల వాటికి దూరంగా ఉంటున్నారు.

అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తక్కువ ప్రీమియంతో కొన్ని బీమా పాలసీలను అందిస్తోంది. అలాంటి వాటిల్లో ఒకటి.. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY). 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. ఈ స్కీమ్​ ద్వారా నెలకు రూ.36 చొప్పున చెల్లించి రూ.2లక్షలు బీమా సదుపాయం పొందొచ్చు. ఇంతకీ, ఈ పథకంలో చేరాలంటే ఉండాల్సిన అర్హతలు? కాల వ్యవధి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అర్హతలు :

  • ఈ పథకంలో చేరేందుకు 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు అర్హులు.
  • బ్యాంకు/ పోస్టాఫీసులో సేవింగ్ అకౌంట్ ఉన్నవారెవరైనా ఈ స్కీమ్​లో చేరవచ్చు.
  • ఇందుకోసం బ్యాంకు అకౌంట్​ను ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. కేవైసీ చేయించడం తప్పనిసరి అనే విషయాన్ని మీరు గమనించాలి.
  • జాయింట్ అకౌంట్ ఉన్నవారు కూడా PMJJBYలో చేరవచ్చు. అయితే, ఇద్దరూ విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించాలి.
  • పాలసీదారుకు 55 ఏళ్ల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ పొందేందుకు వీలుంటుంది. అంటే.. పాలసీదారుడి వయసు 55 ఏళ్లకు చేరినప్పుడు బీమా రద్దవుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

ప్రీమియం వివరాలు :

  • పీఎంజేజేబీవై ప్రస్తుత ప్రీమియం ఏడాదికి రూ.436గా ఉంది. అంటే.. రోజుకు 1.20 పైసలు, నెలకు రూ.36 చొప్పున పడుతుంది.
  • ఒకే వాయిదాలో ఈ ప్రీమియం మొత్తాన్ని ఆటోడెబిట్‌ ద్వారా బ్యాంకు/పోస్టాఫీసు అకౌంట్ నుంచి చెల్లించాలి.
  • అయితే, ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఈ పథకంలో చేరే నెలను అనుసరించి ప్రీమియం మారుతూ ఉంటుంది.
  • LICతో పాటు దాదాపు అన్ని జీవిత బీమా సంస్థ‌లు ఈ స్కీమ్​ను అందిస్తున్నాయి. అలాగే.. బ్యాంకుల వ‌ద్ద కూడా PMJJBY స్కీమ్ అందుబాటులో ఉంది.

జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 'రైడర్ల'ను కచ్చితంగా యాడ్ చేసుకోండి! - Life Insurance Riders

కాల వ్యవధి వివరాలు :

  • ఈ స్కీమ్ ఒక సంవ‌త్స‌రం కాల‌ప‌రిమితితో వ‌స్తుంది. అంటే.. ఏ సంవ‌త్స‌రానికి ఆ సంవ‌త్స‌రం ప్రీమియం చెల్లించి ప‌థ‌కాన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • జూన్‌ 1 నుంచి మే 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఒకసారి ఇందులో చేరిన వారికి మే 25-31 మధ్య ప్రీమియం మొత్తం ఆటో డెబిట్‌ ద్వారా రెన్యువల్‌ అవుతుందనే విషయాన్ని గమనించాలి.
  • అదే.. ఒకవేళ క్యాన్సిల్‌ చేసుకోవాలనుకుంటే రద్దు కోసం బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది.
  • కొత్తగా PMJJBYలో చేరే వారికి జూన్‌ 1 నుంచి మే 31 వరకు కవరేజీ లభిస్తుంది. దీంట్లోకి కొత్తగా చేరినా లేదా తిరిగి జాయిన్‌ అయిన వ్యక్తి ఏ కారణం చేతనైనా చనిపోతే నమోదు చేసుకున్న 30 రోజుల తర్వాత మాత్రమే క్లెయిమ్‌ చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది.

బీమా హామీ :

  • పాలసీదారుడు మరణిస్తే రూ.2 లక్షల హామీ మొత్తాన్ని నామినీకి అందించడం జరుగుతుంది.
  • కొత్తగా చేరే పాలసీదారులు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం.. ఇది ప్యూర్ టర్మ పాలసీ కావటంతో మొచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు.
  • పాలసీదారుడు మరణించినప్పుడు మాత్రమే లబ్ధిదారునికి హామీ మొత్తం చెల్లిస్తారు.
  • ఈ పాలసీ నియమం ప్రకారం.. ప్రీమియం చెల్లించిన సంవత్సరానికి మధ్యలో నిలిపివేయడం గానీ, వెనక్కి ఇచ్చేయడం గానీ సాధ్యం కాదు.

ఇవి గుర్తుంచుకోండి :

  • ఈ స్కీమ్​లో చేరేవారు ప్రీమియం మొత్తాన్ని ఏటా అకౌంట్​ నుంచి ఆటోమేటిక్‌గా బ్యాంకులు తీసుకొనేందుకు అనుమతించాలి.
  • అయితే, ఒకవేళ డెబిట్‌ అయ్యే టైమ్​లో తగినంత బ్యాలెన్స్ అకౌంట్​లో లేనప్పుడు బీమా పాలసీ రద్దవుతుందనే విషయాన్ని మీరు గమనించాలి.

జీవిత బీమా తీసుకున్నారా? పరిహారం ఇవ్వకపోతే ఏం చేయాలో తెలుసా? - Life Insurance Claim Settlement

ABOUT THE AUTHOR

...view details